గ్రేటర్‌లో ఆఫీస్ స్పేస్.. హాట్ కేక్!
- ముంబై తరువాతి స్థానంలో హైదరాబాద్
- ఢిల్లీ, బెంగళూరులను వెనక్కి నెట్టిన మహానగరం
- ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూరిపోర్ట్ నివేదికలో వెల్లడి
సాక్షి, హైదరాబాద్: అవకాశాల హబ్‌గా మారిన గ్రేటర్ హైదరాబాద్‌లో ఇప్పుడు ఆఫీస్ స్పేస్ (కార్యాలయ ప్రదేశం) హాట్ కేక్ అయింది. ఐటీ, ఐటీ ఆధారిత కంపెనీలను నెలకొల్పేందుకు అవసరమైన స్థలాలకు ఇటీవలి కాలంలో డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది తొలి త్రైమాసికం (జనవరి–మార్చి మధ్య)లో 31 లక్షల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ అవసరం కాగా... ఇందులో ముంబై తరవాత హైదరాబాద్ నగరంలో అత్యధిక డిమాండ్ ఉండడం విశేషం. ముంబైలో 12 లక్షలు, నగరంలో 11 లక్షల అడుగుల మేర ఆఫీస్ స్పేస్ అవసరముందని ‘ఇండియా ఆఫీస్ మార్కెట్ వ్యూ రిపోర్ట్–2017’తాజా సర్వేలో తెలిపింది.
విస్తరిస్తున్న వాణిజ్య ప్రాంతం...
ప్రధానంగా హైటెక్‌సిటీ, మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి, నానక్‌రామ్‌గూడ, రాయదుర్గం, మణికొండ, కూకట్‌పల్లి ప్రాంతాల్లో డిమాండ్ అధికంగా ఉందని నివేదిక పేర్కొంది. ఈ ప్రాంతాలను సెంట్రల్ బిజినెస్ డిస్ట్రిక్ట్‌గా పిలవడం తెలిసిందే.
ఇక నానక్‌రామ్‌గూడలో నిర్మాణంలో ఉన్న రెండు భారీ ఐటీ సెజ్‌లలో కూడా అవస రమైన స్థలాలు దక్కించుకునేందుకు డిమాండ్ అనూహ్యంగా పెరిగింది. బంజారాహిల్స్ ప్రాంతంలో మధ్యతరహా ఐటీ కేంద్రాలు విస్తరిస్తుండటంతో ఈ ప్రాంతంలోనూ ఆఫీస్ స్పేస్ హాట్‌కేక్ అయింది.
ప్రధానంగా డిమాండ్ ఉన్నదిక్కడే...
► ఐటీ కారిడార్: కార్వీ సంస్థ ఒక లక్ష చదరపు అడుగుల స్థలాన్ని ఇటీవల లీజుకు తీసుకుంది.
► మైహోమ్ హబ్ ఫేజ్–2: 43 వేల చదరపు అడుగుల స్థలాన్ని ప్రైమేరా మెడికల్ టెక్నాలజీస్ సంస్థ అద్దెకు తీసుకుంది.
► ఐటీ కారిడార్‌లోని వెస్ట్రన్ పెర్ల్: 38 వేల చదరపు అడుగుల స్థలాన్ని వర్క్‌ఫెల్లా అనే సంస్థ లీజుకు తీసుకుంది.
నగరంలో అధిక డిమాండ్ ఎందుకంటే...
► నగరంలో ఐటీరంగం శరవేగంగా విస్తరిస్తుండడంతో ఐటీ కారిడార్‌లో ఆఫీస్ స్పేస్‌కు డిమాండ్ అనూహ్యంగా పెరగడం
► దేశ, విదేశాలకు చెందిన పలు ఐటీ, బీపీఓ, కేపీఓ ఆధారిత పరిశ్రమలు సిటీకి క్యూ కడుతుండడం
► నూతన ఆవిష్కరణలకు నిలయంగా మారి న స్టార్టప్ కంపెనీలు గ్రేటర్‌కు వెల్లువెత్తడం
► ఐటీకారిడార్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతంలో ఆఫీస్ స్పేస్‌కు ఇటీవలి కాలంలో డిమాండ్ అధికం కావడంతో ఈ ప్రాంతంలో అద్దెలు సైతం 10 శాతం మేర పెరగడం గమనార్హం.
► రియల్‌ఎస్టేట్ రెగ్యులేషన్ యాక్ట్, జీఎస్‌టీ విధానం కూడా వాణిజ్య భవంతుల విస్తరణకు దోహదం చేస్తున్నట్లు రియల్‌ఎస్టేట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.
► నగరంలో వివిష్ట భౌగోళిక వాతావరణం. సునామీ, వరదలు, భూకంపాల వంటి విపత్తులకు ఆస్కారం లేకపోవడం.
► సముద్ర మట్టానికి అత్యంత ఎత్తులో ఉండడం, వేసవిలోనూ సాయంత్రం వేళ వాతావరణం ఆహ్లాదంగా మారడం.
► ఐటీ, అనుబంధ రంగాల్లో పని చేసేందుకు అవసరమైన మానవవనరులు పుష్కలంగా లభించడం.
► తెలంగాణా ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన ఐటీ, హార్డ్‌వేర్, టీఎస్‌ఐపాస్ పాలసీలు వివిధ బహుళజాతి సంస్థలను నగరానికి విశేషంగా ఆకర్షించడం.