మెగా పరిశ్రమలకు ప్రత్యేక పాలసీ
ముసాయిదా సిద్ధం చేసిన పరిశ్రమల శాఖ
- రూ. 200 కోట్లకు పైబడిన పెట్టుబడులకు రాయితీలు
- ఇందుకోసం ఏర్పాటు కానున్న ప్రత్యేక నిధి
- సీఎం ఆమోదం తర్వాత అమలుకు పరిశ్రమలశాఖ సన్నాహాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రూ. 200 కోట్లకుపైగా పెట్టుబడితో కనీసం వెయ్యి మందికి ఉపాధి కల్పించే భారీ పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వం యోచిస్తోంది. అనుమతులు, మౌలిక సౌకర్యాల కల్పనకు భారీ పరిశ్రమలు వెచ్చించే మొత్తాన్ని తిరిగి చెల్లించేందుకు ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. అలాగే పరిశ్రమల ఉపాధి కల్పన, పెట్టుబడులను పరిగణనలోకి తీసుకుని వ్యాట్ చెల్లింపులపై భారీగా మినహాయింపులను ఇవ్వనుంది. మెగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై పరిశ్రమలశాఖ ప్రత్యేక పాలసీ ముసాయిదాను కూడా సిద్ధం చేసింది. సీఎం ఆమోదం తర్వాత దీని అమలుకు పరిశ్రమలశాఖ సన్నాహాలు చేస్తోంది.
ప్రత్యేక రాయితీలకు ఉపసంఘం నిర్ణయం
ఉపాధి కల్పన, ఖజానాకు ఆదాయాన్ని సమకూర్చడంలో పారిశ్రామిక రంగ ప్రగతి అత్యంత కీలకమని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే ‘టీ ఐడియా’లో భాగంగా పరిశ్రమలకు స్టాంప్ డ్యూటీ, వ్యాట్ చెల్లింపు, భూమి, విద్యుత్, పెట్టుబడులు తదితర అంశాల్లో పలు రాయితీలు, ప్రోత్సాహకాలను అందిస్తోంది. అయితే రూ.200 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టనున్న తమకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాలని ప్రభుత్వానికి భారీ పరిశ్రమలు పలుమార్లు విజ్ఞప్తి చేశాయి. కేపిటలైజేషన్ చార్జీలు, నీటి సరఫరా చార్జీలు, సబ్‌స్టేషన్ల నిర్మాణ వ్యయం తదితరాలను ప్రభుత్వమే చెల్లించాలని మెగా పరిశ్రమలు కోరుతున్నాయి.
ఈ నేపథ్యంలో మెగా పరిశ్రమలకు ఇవ్వాల్సిన రాయితీలు, ప్రోత్సాహకాలపై సూచనలిచ్చేందుకు ప్రభుత్వం పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అధ్యక్షతన మంత్రివర్గ ఉప సంఘాన్ని ఏర్పాటు చేసింది. మే 4న సమావేశమైన ఉపసంఘం మెగా పరిశ్రమలకు ప్రత్యేక రాయితీలు ఇవ్వాల్సి ఉంటుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేసింది. అలాగే రాష్ట్రంలో ఇప్పటికే ఉన్న కొన్ని పరిశ్రమలు మరింత పెట్టుబడితో విస్తరించే యోచన ఉండటంతో అవి కూడా మెగా ప్రాజెక్టుల కేటగిరీలోకి వస్తాయని.. అలాంటి పరిశ్రమలకూ రాయితీలు, ప్రోత్సాహకాలు ఇవ్వాల్సి ఉంటుందని అభిప్రాయపడింది. టీఎస్ ఐపాస్ నిబంధనలకు అనుగుణంగా రాష్ట్రంలో ఇప్పటికే 389 మెగా ప్రాజెక్టులు ఏర్పాటైన నేపథ్యంలో మెగా పరిశ్రమలకు రాయితీలు, ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు పరిశ్రమలశాఖ ఆధ్వర్యంలో ప్రత్యేక నిధి ఏర్పాటు చేయాలని ఉప సంఘం సూత్రప్రాయంగా నిర్ణయించింది. రాయితీల చెల్లింపులో పారదర్శకత కోసం ఏకీకృత విధానం ఉండాలని తీర్మానించింది. ఉప సంఘం సూచన మేరకు రాష్ట్రానికి మెగా పరిశ్రమలను ఆకర్షించేలా ప్రత్యేక పాలసీని పరిశ్రమలశాఖ రూపొందించింది.
రాయితీల కోసం ప్రత్యేక నిధి.
మెగా పరిశ్రమలతోపాటు సూపర్ మెగా (రూ. 500 కోట్ల నుంచి రూ. వెయ్యి కోట్ల పెట్టుబడి, 2-3 వేల ఉద్యోగాలు), అల్ట్రా మెగా (రూ. వెయ్యి కోట్లకు పైబడిన పెట్టుబడి, 3 వేలకుపైగా ఉద్యోగాలు) పరిశ్రమలకు ఇచ్చే రాయితీలు, ప్రోత్సాహకాలకు నిధులు సమకూర్చేందుకు పారిశ్రామిక మౌలిక సౌకర్యాల అభివృద్ధి నిధి (ఐఐడీఎఫ్) ఏర్పాటు చేయాలని పాలసీ ముసాయిదాలో పరిశ్రమలశాఖ ప్రతిపాదించింది. దీని ప్రకారం పురపాలన, హైదరాబాద్ మె ట్రో వాటర్, ట్రాన్స్‌కో, డిస్కంలు తదితర ప్రభుత్వ విభాగాలకు ప్రభుత్వం కేటాయించే వార్షిక బడ్జెట్ నుంచి కొత్త మొత్తాన్ని ఐఐడీఎఫ్‌కు కేటాయిస్తారు. మెగా పరిశ్రమలు కోరుతున్న విధంగా మౌలిక సౌకర్యాల కల్పనకు ప్రభుత్వ సంస్థలు వెచ్చించే నిధులను ఐఐడీఎఫ్ ఖాతా నుంచి చెల్లిస్తారు.
వ్యాట్‌పరంగా మెగా పరిశ్రమలకు 75%, సూపర్ మెగా ప్రాజెక్టులకు 100% చొప్పున ఏడేళ్లపాటు రీయింబర్స్ చేస్తారు. అల్ట్రా మెగా ప్రాజెక్టులకు పదేళ్ల పాటు 100% వ్యాట్‌ను రీయింబర్స్ చేస్తారు. మెగా ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పు న ఏడేళ్లపాటు, సూపర్ మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు యూనిట్‌కు రూపాయి చొప్పు న పదేళ్లపాటు విద్యుత్ చార్జీలను తిరిగి చెల్లిస్తారు. మౌలిక సౌకర్యాల కల్పన కోసం మెగా పరిశ్రమలు వెచ్చించే మొత్తంలో గరిష్టంగా రూ. 2.50 కోట్లకు మించకుండా 50 శాతం సాయాన్ని ఐఐడీఎఫ్ నుంచి అందిస్తారు. సూపర్ మెగా ప్రాజెక్టులకు గరిష్టంగా రూ. 5 కోట్లు, అల్ట్రా మెగా ప్రాజెక్టులకు గరిష్టంగా రూ. 7.5 కోట్లకు మించకుండా 50 శాతాన్ని ప్రభుత్వం చెల్లిస్తుంది. అయితే రాయితీల చెల్లింపును పరిశ్రమల ప్రారంభంలో కాకుండా పనులు, ఉత్పత్తి పురోగతినిబట్టి ఇవ్వాలని నిర్ణయించారు.