చేనేత బ్రాండ్ అంబాసిడర్‌గా సమంత
- ఈ రంగంపై అవగాహన ఉంది
- ప్రాచుర్యం కల్పించేందుకు పాటుపడతా
- మార్కెటింగ్ కల్పించేందుకు ప్రయత్నిస్తా
- ఇందుకోసం డిజైనర్లు, సంస్థల సాయం
- అధికారులతో ఆలోచనలు పంచుకున్న నటి
- సమంత చొరవను అభినందించిన కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: చేనేత వస్త్రాల వాడకాన్ని ప్రోత్సహించే దిశగా మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన చేపట్టిన కార్యక్రమానికి ప్రముఖ సినీ తార సమంత మద్దతు పలికారు. చేనేతకు బ్రాండ్ అంబాసిడర్‌గా ఉండేందుకు ఆమె అంగీకరించారు. మంగళవారం ఇక్కడ కేటీఆర్‌తో ఆమె భేటీ అయ్యారు. చేనేత కోసం మంత్రి చేపట్టిన కార్యక్రమాన్ని అభినందించారు. దీనికి సంపూర్ణ మద్దుతు ప్రకటించారు. ‘‘నాకు చేనేత వస్త్రాలంటే అత్యంత ఇష్టం. సాధ్యమైనప్పుడల్లా వాటినే ధరిస్తాను. చేనేతను ఒక కళగా నేను భావిస్తాను. ఈ పరిశ్రమపై నాకు అవగాహన ఉంది’’ అని వివరించారు. చేనేత కార్మికుల కోసం తాను చేయాలనుకుంటున్న పలు కార్యక్రమాలపై ఈ సందర్భంగా అధికారులతో ఆమె చర్చించారు.
తెలంగాణ లో పలు ప్రాంతాల్లో లభించే చేనేత ఉత్పత్తుల గురించి, ముఖ్యంగా ఇక్కత్, పోచంపల్లి వంటివాటి బ్రాండ్ వ్యాల్యూను మరింత పెంచే విషయంలో తన అలోచనలను అధికారులతో పంచుకున్నారు. సిరిసిల్లలో అత్యధికంగా ఉన్న మరమగ్గాల కార్మికుల ఉత్పత్తులకు మరింత మార్కెట్ కల్పించేందుకు డిజిటల్ ప్రింటింగ్ వంటి పరిజ్ఞానాలను ఉపయోగించవచ్చన్నారు. చేనేత ప్రోత్సాహం కోసం తాను చేపట్టబోయే కార్యక్రమాల పూర్తి వివరాలను త్వరలో వెల్లడిస్తాననన్నారు. కరీంనగర్ జిల్లాలోని చేనేతల నుంచి తాను సేకరించిన పలు రకాల వస్త్రాల శాంపిళ్లను ఈ సందర్భంగా ఆమె తీసుకొచ్చారు.
ఇలాంటి వస్త్రాలకు మార్కెట్ కల్పించేందుకు తనకు తెలిసిన డిజైనర్లు, సంస్థలతో కలిసి పని చేసేందుకు సిద్ధంగా ఉన్నట్టు వెల్లడించారు. ప్రభుత్వం తలపెట్టిన మంచి కార్యక్రమానికి నటి సమంత మద్దతు పలకడం, చేనేత కార్మికుల కోసం పని చేసేందుకు నేరుగా ముందుకు రావడం హర్షణీయమని కేటీఆర్ అన్నారు. సమంతకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా పోచంపల్లి చీర, శాలువాను ఆమెకు బహూకరించారు. చేనేతకు ప్రాచుర్యం కల్పించే దిశగా ఆమె చేపట్టే అన్ని కార్యక్రమాలకూ సహకరించాలని అధికారులను కోరారు. సమావేశంలో పరిశ్రమ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్ రంజన్‌తోపాటు, టెస్కో డైరెక్టర్ శైలజా రామయ్యర్ పాల్గొన్నారు.