విన్నపాలు వినవలె..! | DISCLAIMERS boom to Higher Power Committee | Sakshi
Sakshi News home page

విన్నపాలు వినవలె..!

Published Thu, Oct 6 2016 3:13 AM | Last Updated on Fri, Aug 30 2019 8:24 PM

విన్నపాలు వినవలె..! - Sakshi

విన్నపాలు వినవలె..!

హైపవర్ కమిటీకి విజ్ఞాపనల వెల్లువ
- కేకే నివాసంలో రెండోరోజు భేటీ అయిన కమిటీ
- కొత్త జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటుకు విజ్ఞప్తులు
- సిరిసిల్ల జిల్లా ఏర్పాటు కోసం కమిటీని కలసిన మంత్రి కేటీఆర్
- దేవరకొండను జిల్లా చేయండి: ఎమ్మెల్యే రవీంద్ర కుమార్, బాలూ నాయక్
- మొత్తం 630 దరఖాస్తులు అందాయి: కేకే
 
 సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల డిమాండ్లను పరిశీలించేందుకు ఏర్పాటైన ైెహ పవర్ కమిటీకి వినతులు వెల్లువెత్తుతున్నాయి. మరో ఆరు రోజుల్లో కొత్త జిల్లాలు మనుగడలోకి రానున్న నేపథ్యంలో కూడా కమిటీకి ఇంకా దరఖాస్తులు అందుతున్నాయి. రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు చైర్మన్‌గా వ్యవహరిస్తున్న హై పవర్ కమిటీ ఆయన నివాసంలో బుధవారం రెండోరోజూ భేటీ అయ్యింది. వాస్తవానికి పది పాత జిల్లాలకు తోడు మరో 17 కొత్త జిల్లాలు కలిపి మొత్తంగా 27 జిల్లాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. అయితే సిరిసిల్ల, జనగామ, గద్వాల ప్రత్యేక జిల్లాల కోసం పెద్ద ఎత్తున డిమాండ్ వచ్చింది. దీంతో ఈ మూడింటికి తోడు ఆదిలాబాద్ జిల్లాలో అదనంగా ఆసిఫాబాద్ జిల్లాను కూడా ఏర్పాటు చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం వచ్చింది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు రెండ్రోజులపాటు పార్టీ నాయకులతో జరిపిన సమావేశాల్లో సూత్రప్రాయంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ నాలుగు జిల్లాల ఏర్పాటుపై ప్రజాభిప్రాయం తెలుసుకుని ప్రభుత్వానికి నివేదించేందుకు హైపవర్ కమిటీని నియమించారు. అయితే రెండ్రోజులుగా కమిటీకి మరికొన్ని కొత్త జిల్లాలు కావాలంటూ విజ్ఞప్తులు అందుతున్నాయి.

 ఉదయం నుంచే తాకిడి
 హైపవర్ కమిటీ సభ్యులు డిప్యూటీ సీఎం మహమూద్ అలీ, మంత్రులు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, జగదీశ్ రెడ్డి, జోగు రామన్న.. కేకే నివాసానికి చేరుకోక ముందే నల్లగొండ జిల్లాకు చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉదయం ఏడున్నర గంటలకే కేకేను కలసి వెళ్లారు. అలాగే అలంపూర్ ఎమ్మెల్యే సంపత్.. కమిటీని కలిసి కొత్తగా ఏర్పాటు కాబోయే గద్వాలకు జోగులాంబ పేరును పెట్టాలని కోరారు. కల్వకుర్తి ఎమ్మెల్యే వంశీచంద్‌రెడ్డి రెండోరోజు కూడా కల్వకుర్తి అఖిలపక్ష నేతలతో కలిసి వచ్చారు. వెల్దండ, ఊర్కొండ, వంగూరు, చారగొండ, కల్వకుర్తి మండలాలతో రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

నల్లగొండ జిల్లా పరిషత్ చైర్మన్ బాలూ నాయక్, దేవరకొండ ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి వచ్చి కమిటీతో భేటీ అయ్యారు. దేవరకొండను ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చారు. ఎమ్మెల్యే కోవా లక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, స్థానిక ప్రజాప్రతినిధులు ఆసిఫాబాద్ జిల్లాను ఏర్పాటు చేయాలని కమిటీని కలిసి విజ్ఞప్తి చేశారు. ఆర్మూరు నియోజకవర్గం పరిధిలోని ఆలూరును మండలంగా మార్చాలని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి వినతి పత్రం ఇచ్చారు. బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే బద్దం బాల్‌రెడ్డి కమిటీని కలిసి.. రంగారెడ్డి జిల్లాలో బార్‌వాద్ గ్రామాన్ని మండల కేంద్రంగా చేయాలని డిమాండ్ చేశారు. ఆయనతోపాటు వచ్చిన కార్యకర్తలు, కొద్దిసేపు కేకే నివాసం ఎదుట బైఠాయించారు. అక్కడే ఉన్న చేవెళ్ల ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డిని కూడా వారు నిలదీశారు. రంగారెడ్డి జిల్లాకు చెందిన ఎమ్మెల్సీ పట్నం నరేందర్‌రెడ్డి కూడా కమిటీని కలిసి వెళ్లారు. కాంగ్రెస్ ఎమ్మెల్సీ పొంగులేటి సుధాకర్‌రెడ్డి కమిటీని కలిసి కల్లూరు రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేయాలని కోరారు. గార్ల, బయ్యారం, వెంకటాపురం, వాజేడు మండలాలను ఖమ్మం, కొత్తగూడెం జిల్లాల పరిధిలోనే ఉంచాలని కోరారు.

 ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయండి
 సమగ్ర గిరిజన అభివృద్ధి సంస్థ (ఐటీడీఏ)లు ఉన్న చోట్ల ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని న్యూడెమొక్రసీ పార్టీ డిమాండ్ చేసింది. ఆ పార్టీకి చెందిన ఇల్లందు మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నర్సయ్య, పార్టీ ప్రతినిధులతో కలిసి వచ్చి హైపవర్ కమిటీని కలిశారు. తెలంగాణలో భద్రాచలం, ఉట్నూరు, ఏటూరునాగారంలో ఐటీడీఏలు ఉన్నాయని, ఇవి జిల్లా కేంద్రాలుగా ప్రత్యేకంగా ఆదివాసీ జిల్లాలు ఏర్పాటు చేయాలని విన్నవించారు.

 630 దరఖాస్తులు స్వీకరించాం: కేకే
 ప్రజాభిప్రాయానికి అనుగుణంగానే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని హైపవర్ కమిటీ చైర్మన్ కేకే తెలిపారు. ఇప్పటి దాకా 630 దరఖాస్తులు అందాయన్నారు. మరికొన్ని కొత్త జిల్లాలు కావాలన్న దరఖాస్తులు కూడా అందాయని, వాటినీ పరిశీలిస్తున్నట్లు వివరించారు.
 
 రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలి: కేటీఆర్
 సిరిసిల్ల, వేములవాడ, చొప్పదండి, మానకొండూరు  నియోజకవర్గాలను కలుపుతూ సిరిసిల్లను రాజన్న జిల్లాగా ఏర్పాటు చేయాలని హైపవర్ కమిటీని కోరినట్లు ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. వేములవాడ ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌తో కలసి బుధవారం ఆయన హైపవర్ కమిటీని కలిశారు. ప్రజాభిప్రాయానికి అనుగుణంగా సిరిసిల్ల జిల్లా ఏర్పాటవుతుందన్న విశ్వాసం తమకుందన్నారు. కొత్తగా రుద్రంగి, మానాల మండలాలను ఏర్పాటు చేయాలని వినతిపత్రం ఇచ్చినట్లు చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement