తెలంగాణకు పెట్టుబడులతో రండి!
చెన్నైలో పారిశ్రామికవేత్తలతో భేటీలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ లాజిస్టిక్ రంగంలో అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వంటి సంస్థలు తమ అతిపెద్ద గిడ్డంగులను ఇప్పటికే ఏర్పాటు చేశాయని, టీవీఎస్ సంస్థ కూడా రాష్ట్రానికి తరలిరావాలని రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి కె.తారక రామారావు ఆహ్వానించారు. అత్యుత్తమ మానవ వనరులను కలిగి ఉండటం రాష్ట్రానికి బలమని అన్నారు. రెండు రోజుల చెన్నై పర్యటనలో భాగంగా మంగళవారం టీవీఎస్, ఎంఆర్‌ఎఫ్, సన్‌మార్, సుందరం పాస్టనెర్స్, రానే ఇంజనీరింగ్, మురుగప్ప కంపెనీలతో కేటీఆర్ భేటీ అయ్యారు. తెలంగాణ ప్రభుత్వం టీవీఎస్ గ్రూపునకు పూర్తిస్థాయి సహకారం అందిస్తుందని ఆ సంస్థ లాజిస్టిక్స్ విభాగం మేనేజింగ్ డెరైక్టర్ ఆర్.దినేశ్‌కు హామీ ఇచ్చారు. జీఎస్టీ బిల్లు అమల్లోకి రాగానే తమ సంస్థ విస్తరణ ప్రణాళికతో తెలంగాణకు వస్తామని దినేశ్ మాటిచ్చారు.
తెలంగాణలో ఎంఆర్‌ఎఫ్ విస్తరణకు అవకాశాలను పరిశీలించాలని ఆ సంస్థ సీఈఓ అరుణ్ మెమన్‌ను కేటీఆర్ కోరారు. ప్రస్తుతం ఉన్న పరిశ్రమకి ప్రభుత్వం తరఫున పూర్తిగా సహకరిస్తామని పేర్కొన్నారు. హైదరాబాద్ దగ్గర్లోని ప్లాస్టిక్ పార్కులో పెట్టుబడి పెట్టాలని సన్‌మార్ గ్రూప్‌ను కేటీఆర్ కోరారు. వ్యవసాయ రంగంలో ఉత్పాదకత పెంచేందుకు సేంద్రియ వ్యవసాయం, యాంత్రీకరణ, ఉత్పత్తుల అమ్మకం వంటి అంశాల్లో మురుగప్ప గ్రూప్ చేస్తున్న ప్రయత్నాలను కేటీఆర్ అడిగి తెలుసుకున్నారు. తెలంగాణ మున్సిపాలీటీల్లో వేస్ట్ మేనేజ్‌మెంట్, సైకిళ్ల వ్యాపారంపై మురుగప్ప యాజమాన్యం ఆసక్తి చూపింది.