త్వరలో ప్రపంచ పటంపై టీ–హబ్
♦ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అవుతుంది
♦ స్టాన్‌ఫర్డ్ వర్సిటీ బృందంతో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో సృజనాత్మకత, పరిశోధనలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన టీ–హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్మించనున్న రెండో దశ టీ–హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ అవుతుందన్నారు. భారత్‌లో పరిశోధన లు–సవాళ్లు అనే అంశంపై అధ్యయనంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఇంగ్లండ్‌లోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్ మాట్లాడుతూ పరిశోధన రంగం, టీ–బ్రిడ్జి కార్యక్రమాల్లో స్టాన్‌ఫర్డ్ వర్సిటీ లాంటి సంస్థల సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
టీ–బ్రిడ్జి ద్వారా సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ సంస్థలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పరిశ్రమలకు ప్రోత్సాహం, టీఎస్ ఐపాస్ విధివిధానాల గురించి వర్సిటీ బృందానికి మంత్రి వివరించారు. వీటితోపాటు ఎక్కడైనా ఆదర్శవంత విధానాలున్నా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టే ముందు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, పరిస్థితులపై అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలటిక్స్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వర్సిటీ బృందం అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దేశ రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల విధివిధానాలు, నిర్ణయాలపై వర్సిటీ బృందం కేటీఆర్‌తో చర్చించింది. దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిం చేందుకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుంది.