Stanford University Team
-
హైబ్రిడ్ వర్క్: ఐటీ దిగ్గజాలకు ఆ తలనొప్పి బాగా తగ్గిందట!
కాలిఫోర్నియా: వర్క్ ఫ్రం హోం పని విధానం అటు ఐటీ ఉద్యోగులకు, ఇటు ఐటీ సంస్థలకు బాగా ఉపయోగపడింది అనేది అందరికీ తెలిసిన విషయమే. అయితే హైబ్రిడ్ వర్క్ కంపెనీలకు ఇతర ఉపయోగాలతోపాటు మరో ప్రయోజనం కలిగిందని తాజా అధ్యయనంలో తేలింది. పని విధానం రేటింగ్, ప్రమోషన్ ప్రక్రియపై ఎలాంటి ప్రతికూల ప్రభావం లేకపోవడమేకాదు, ఐటీ దిగ్గజాలకు అట్రిషన్ (కంపెనీనుంచి మరో కంపెనికి తరలిపోవడం) అనే పెద్ద తలనొప్పినుంచి మూడోవంతు ఊరట లభించిందట. హైబ్రిడ్ పనివిధానంతో ప్రముఖ ఐటీ కంపెనీల్లో అట్రిషన్ రేటు 35 శాతం తగ్గిందని తాజా అధ్యయనంలో తేలింది. స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన నికోలస్ బ్లూమ్ ఆధ్వర్యంలోని కొత్త అధ్యయనం ఈ విషయాలను వెల్లడించింది. మొత్తంగా హైబ్రిడ్, లేదా వర్క్ ఫ్రం హోం ఉద్యోగులు, సంస్థలకు ఎంత ప్రయోజనకరంగా ఉంటుందో హైలైట్ చేసింది. కరోనా మహమ్మారి సమయంలో లాక్డౌన్లు, ప్రయాణ ఆంక్షలతో చాలా కంపెనీలు తమ ఉద్యోగుల కోసం వర్క్ ఫ్రం హోం విధానాన్ని అవలబించాయి. ఆ తరువాత సడలింపులతో హైబ్రిడ్ వర్క్ పద్దతిని ఫాలో అవుతున్నాయి. సాధారణంగా ప్రతి వారం కార్యాలయంలో రెండు నుండి మూడు రోజులు పని చేయడం , మిగిలిన రోజుల్లో ఇంట్లోనుంచే పని చేయడం అన్నమాట. నిరుద్యోగం రేటు ఐదు దశాబ్దాలలో కనిష్ట స్థాయికి చేరుకోవడంతో, ఇంటి నుండి పని చేసే విధానాన్ని తీవ్రంగా విమర్శించిన కొందరు కూడా ఉద్యోగులను ఆకర్షించడానికి వర్క్ ఫ్రం హోంను ఎంచు కున్నారుని స్టడీ వ్యాఖ్యానించింది. గ్లోబల్ ట్రావెల్ ఏజెంట్ Trip.comలో 2021, 2022లో 1,612 ఇంజనీర్లు, మార్కెటింగ్ అండ్ ఫైనాన్స్ ఉద్యోగులపై ట్రయల్ స్టడీ చేసింది. ఇందులో భాగంగా బేసి డేట్స్‌లో జన్మించిన వారు బుధ, శుక్రవారాల్లో ఇంటి నుండి పని చేసేందుకు నిర్ణయించుకోగా, మరికొందరు పూర్తి సమయం కార్యాలయంలో పని చేశారు. ఈ అధ్యయనం సానుకూల ఫలితాలతో Trip.com మొత్తం కంపెనీకి హైబ్రిడ్ పనిని అందించిందని ఈ స్టడీ నివేదించింది. బ్లూమ్, స్టాన్ఫోర్డ్ విశ్వవిద్యాలయానికి చెందిన రూబింగ్ హాన్ , జేమ్స్ లియాంగ్ సహ రచయితలుగా ఒక పేపర్‌ను పబ్లిష్ చేశారు. అట్రిషన్‌లో మెరుగుదలతో పాటు, నేషనల్ బ్యూరో ఆఫ్ ఎకనామిక్ రీసెర్చ్ పేపర్ హైబ్రిడ్ ఏర్పాట్లు పని షెడ్యూల్లు ,అలవాట్లను ఎలా మారుస్తుందో కూడా హైలైట్ చేసింది. రిమోట్ రోజులలో తక్కువ గంటలు పని చేసినా కానీ వారాంతంతో సహా ఇతర రోజులలో పని గంటల సంఖ్యను పెంచారు. మొత్తంగా, ఉద్యోగులు ఇంటి రోజులలో దాదాపు 80 నిమిషాలు తక్కువ పనిచేశారు కానీ ఇతర పని దినాల్లో వారాంతంలో దాదాపు 30 నిమిషాలు ఎక్కువ పనిచేశారు. ఈ పనివిధానంతో వర్క్ రివ్యూ, ప్రమోషన్స్‌లో ఎలాంటి ప్రభావం లేదని తెలిపింది. మొత్తంగా ఇంటి నుండి పని చేసే అవకాశం ఉన్నవారు కొంచెం ఎక్కువ ఉత్పాదకతను నివేదించారు. ఆఫీసుల్లో పనిచేసినవారితో పోలిస్తే కోడ్ లైన్లలో 8 శాతం పెరుగుదల నమోదైందట. -
వేసవిలో చల్లగా.. చలికాలంలో వెచ్చగా..
టూ ఇన్ వన్ షర్ట్ల గురించి మీరెప్పుడైనా విన్నారా? రెండువైపులా వేసుకోవచ్చు ఈ షర్ట్‌ను. అయితే వీటితో రంగులు, డిజైన్లు మారడానికి మించి ఇంకో ప్రయోజనం లేదు. ఇలా కాకుండా.. చలికాలంలో ఒకవైపున వేసుకుంటే వెచ్చగా ఉంటే.. ఇదే షర్ట్‌ను వేసవిలో తిరగేసి వేసుకుంటే చల్లగా అనిపిస్తే ఎలా ఉంటుంది? అచ్చంగా ఇలాంటి అద్భుతాన్నే ఆవిష్కరించారు స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయ శాస్త్రవేత్తలు. ఇలాంటి దుస్తులు విస్తృత స్థాయిలో అందుబాటులోకి వస్తే.. జనాలు ఏసీలు, ఫ్యాన్ల వాడకాన్ని తగ్గిస్తారని, తద్వారా వాతావరణ మార్పులను కొద్దిగానైనా అడ్డుకోవచ్చునని అంటున్నారు ఈ వినూత్న వస్త్రాన్ని అభివృద్ధి చేసిన శాస్త్రవేత్త ఈ కూయి. గత ఏడాది కూయి నేతృత్వంలోని శాస్త్రవేత్తల బృందం చర్మాన్ని చల్లబరచడం ద్వారా శరీర ఉష్ణోగ్రతను ప్రసారం చేయగల ఓ వస్త్రాన్ని అభివృద్ధి చేసింది. పత్తితో తయారైన వస్త్రంతో పోలిస్తే ఇది శరీరాన్ని రెండు డిగ్రీ సెల్సియస్ వరకూ చల్లగా ఉంచగలిగింది. వేర్వేరు ఉష్ణోగ్రత సామర్థ్యాలున్న రెండు పొరలను ఈ ప్రత్యేక వస్త్రంతో కలిపి వాడటం ద్వారా శరీరాన్ని వెచ్చగా ఉంచుకునేందుకూ వీలవుతుందని వీరు గుర్తించారు. ప్రస్తుతానికి ఈ వస్త్రాన్ని నేరుగా వాడే అవకాశం లేదని.. పోగులు తయారు చేసి వస్త్రం తయారు చేస్తే అది దృఢంగా ఉండటంతోపాటు మన్నిక కూడా ఎక్కువవుతుందని.. ప్రస్తుతం తాము అదే ప్రయత్నంలో ఉన్నామని కూయి తెలిపారు. వీలైనంత సులువుగా ఈ వినూత్న వస్త్రాన్ని తయారు చేసేందుకు ప్రయత్నిస్తున్నామని చెప్పారు. -
త్వరలో ప్రపంచ పటంపై టీ–హబ్
♦ ప్రపంచంలోనే అతిపెద్ద ఐటీ ఇంక్యుబేటర్ అవుతుంది ♦ స్టాన్‌ఫర్డ్ వర్సిటీ బృందంతో మంత్రి కేటీఆర్ సాక్షి, హైదరాబాద్: ఐటీ రంగంలో సృజనాత్మకత, పరిశోధనలను ప్రోత్సహించేందుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసిన టీ–హబ్ దేశంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ అని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కె. తారక రామారావు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం త్వరలోనే నిర్మించనున్న రెండో దశ టీ–హబ్ ప్రపంచంలోనే అతిపెద్ద టెక్నాలజీ ఇంక్యుబేటర్ అవుతుందన్నారు. భారత్‌లో పరిశోధన లు–సవాళ్లు అనే అంశంపై అధ్యయనంలో భాగంగా రాష్ట్రానికి వచ్చిన ఇంగ్లండ్‌లోని స్టాన్‌ఫర్డ్ వర్సిటీ అధ్యాపకులు, విద్యార్థులు మంగళవారం మంత్రి కేటీఆర్‌ను కలిశారు. కేటీఆర్ మాట్లాడుతూ పరిశోధన రంగం, టీ–బ్రిడ్జి కార్యక్రమాల్లో స్టాన్‌ఫర్డ్ వర్సిటీ లాంటి సంస్థల సహకారం తీసుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. టీ–బ్రిడ్జి ద్వారా సిలికాన్ వ్యాలీలోని ప్రముఖ సంస్థలతో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. రాష్ట్రంలో పారిశ్రామిక ప్రగతి, పరిశ్రమలకు ప్రోత్సాహం, టీఎస్ ఐపాస్ విధివిధానాల గురించి వర్సిటీ బృందానికి మంత్రి వివరించారు. వీటితోపాటు ఎక్కడైనా ఆదర్శవంత విధానాలున్నా అమలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. దేశంలో పెట్టుబడులు పెట్టే ముందు వివిధ రాష్ట్రాల్లోని ప్రభుత్వాలు, పరిస్థితులపై అధ్యయనం చేయాలని కేటీఆర్ సూచించారు. ఐటీ, సైబర్ సెక్యూరిటీ, డేటా అనలటిక్స్ వంటి రంగాల్లో ఉపాధి అవకాశాలు పెరుగుతాయని వర్సిటీ బృందం అడిగిన ప్రశ్నకు మంత్రి బదులిచ్చారు. దేశ రాజకీయ పరిస్థితులు, ప్రభుత్వాల విధివిధానాలు, నిర్ణయాలపై వర్సిటీ బృందం కేటీఆర్‌తో చర్చించింది. దేశంలో పరిశోధనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిం చేందుకు కల్పిస్తున్న మౌలిక సదుపాయాలను అడిగి తెలుసుకుంది.