సింగపూర్ ‘ఏ స్టార్’తో రాష్ట్ర ఒప్పందం
- ఆవిష్కరణ, పరిశోధనల్లో కలసి పనిచేయాలని నిర్ణయం
- ఇరు ప్రాంతాల నడుమ విద్యార్థుల పరస్పర బదిలీ
- సింగపూర్ పర్యటనలో18 మంది సీఈవోలతో మంత్రి కేటీఆర్ భేటీ
సాక్షి, హైదరాబాద్: ఆవిష్కరణ, పరిశోధన, ఇంక్యుబేషన్, వాణిజ్య రంగాల్లో తెలంగాణ ప్రభుత్వంతో కలసి పనిచేసేందుకు సింగపూర్‌కు చెందిన ‘ఏ స్టార్’ (ఏజెన్సీ ఫర్ సైన్స్, టెక్నాలజీ, రీసెర్చ్) కంపెనీ సుముఖత వ్యక్తం చేసింది. ఈ మేరకు ప్రభుత్వం చేపట్టిన రిచ్(రీసెర్చ్, ఇన్నోవేషన్ సర్కిల్ ఆఫ్ హైదరాబాద్)తో ఒప్పందం కుదుర్చుకోవాలని నిర్ణయిం చింది. సింగపూర్ పర్యటనలో భాగంగా రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు బుధవారం 18 కంపెనీలకు చెందిన సీఈఓలతో భేటీ అయ్యారు.
సింగపూర్ ఆర్థిక, శాస్త్ర సాంకేతిక రంగాల అభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తున్న ఏ స్టార్ ప్రతినిధులతోనూ కేటీఆర్ భేటీ అయ్యారు. ఇన్నోవేషన్, విద్య రంగాల నడుమ వారధిగా పనిచేస్తున్న ఏ స్టార్‌తో ఒప్పందం ద్వారా పలు రం గాల్లో తెలంగాణతో కలసి పనిచేసేందుకు మార్గం సుగమంకానున్నది. సింగపూర్, తెలంగాణ నడుమ విద్యార్థుల బదిలీ కార్యక్రమాన్ని చేపడతామని కేటీఆర్ వెల్లడించారు. రాష్ట్రంలో పరిశోధన, చిన్న పరిశ్రమల స్థితిగతులపై ఏ స్టార్ ప్రతినిధులకు వివరించారు.
హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనం
హైదరాబాద్‌లో బహుళ అంతస్తుల భవనం నిర్మించాలని.. అందుకు అవసరమైన భూమి ని కేటాయిస్తామని ‘సుర్బానా జురోం గ్’ కంపెనీని.. మంత్రి కేటీఆర్ ఆహ్వానిం చారు. సింగపూర్‌లో పబ్లిక్‌హౌజింగ్ కార్యకలాపాల ను పర్యవేక్షిస్తున్న సుర్బానా జురోంగ్ సీఈవో టియో ఏంగ్ చాంగ్‌తో కేటీఆర్ భేటీ అయ్యారు. నగర మౌలిక వసతుల కల్పనలో అనుభవమున్న జురోంగ్ రాష్ట్రంలో గృహ నిర్మాణ పథకానికి సహకరించాలని కోరారు. హైదరాబాద్ ఫార్మాసిటీ ప్రత్యేకతలు, మౌలిక సౌకర్యాల కల్పనకు అవకాశాలను వివరిస్తూ ఫార్మాసిటీ ప్రణాళికలో భాగస్వామ్యం వహించాల్సిందిగా ఆహ్వానించారు. హైదరాబాద్ నగరంలో రోడ్లు, విద్యుత్, నీటి సరఫరా, ట్రాఫిక్ నిర్వహణలపై అధ్యయనం చేయాలని కోరగా త్వరలో రాష్ట్రానికి ప్రతినిధి బృందాన్ని పంపేందుకు టియో ఏంగ్ చాంగ్ సుముఖత వ్యక్తం చేశారు. సింగపూర్‌లోని టావుస్ ఇండస్ట్రియల్ పార్కు, బయో పోలిస్, క్లీన్‌టెక్ పార్కులను సందర్శించిన కేటీఆర్ అక్కడి సౌకర్యాలు, అభివృద్ధి నమూనాలపై ఆరా తీశారు.
టీఎస్ ఐపాస్‌పై ప్రజెంటేషన్
భారత హై కమిషన్, భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) ఏర్పాటు చేసిన వాణిజ్య సదస్సులో సింగపూర్‌కు చెం దిన 18 కంపెనీల సీఈవోలతో మంత్రి కేటీఆర్ భేటీ అయ్యారు. టీఎస్ ఐపా స్, ఐటీ పాలసీలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. రాష్ట్ర ఆవిర్భావం అనంతరం 2,200 కంపెనీల స్థాపనకు అనుమతులు ఇచ్చినట్లు వెల్లడించారు. పారదర్శకత, వేగమే లక్ష్యంగా తెలంగాణను పెట్టుబడుల ప్రదేశంగా తీర్చిదిద్దుతామని ప్రకటించారు. ఈ సందర్భంగా 2014లో సింగపూర్ పర్యటనకు వచ్చిన సీఎం కేసీఆర్‌తో జరిగిన భేటీ వివరాలను కేటీఆర్‌తో భారత హైకమిషనర్ విజయ్ ఠాకూర్ సింగ్ పంచుకున్నారు.