రాష్ట్రంలో శాంతి భద్రతలు భేష్
నేరాల సంఖ్య తగ్గింది: ముఖ్యమంత్రి కేసీఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో నేరాల సంఖ్య తగ్గిందని, శాంతి భద్రతలు మెరుగ్గా ఉన్నాయని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అభిప్రాయపడ్డారు. పోలీసు శాఖలోని పలు అంశాలపై శుక్రవారం ప్రగతి భవన్‌లో హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, డీజీపీ అనురాగ్ శర్మ, హోంశాఖ ముఖ్య కార్యదర్శి రాజీవ్ త్రివేదీ, నగర కమిషనర్ మహేందర్‌రెడ్డి, మిషన్ భగీరథ చైర్మన్ వేముల ప్రశాంత్‌రెడ్డి, సీఎంఓ అధికారులతో సీఎం సమీక్షించారు. రాష్ట్రంలో పోలీసు, పరిశ్రమల శాఖలు మెరుగ్గా పనిచేస్తున్నాయని, ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్న పలువురు అభిప్రాయపడ్డారని తెలిపారు.
టీఎస్ ఐపాస్ విధానం ప్రకటించిన తర్వాత 2500కుపైగా పరిశ్రమలు ఏర్పాటై ఉత్పత్తి కూడా ప్రారంభమైందన్నారు. దీనంతటికీ ప్రదాన కారణం శాంతి భద్రతలు మెరుగ్గా ఉండటమే కారణమని ముఖ్యమంత్రి అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో నేరాల సంఖ్య భారీగా తగ్గిందని, అదే విధంగా నేరస్తుల్లోనూ మార్పు వచ్చిందన్నారు. మానవతా దృక్పథంతో పోలీసులు నేరస్తులను మారుస్తున్నారన్నారు. పోలీసు కానిస్టేబుళ్ల భర్తీ అంశం గురించి డీజీపీ అనురాగ్ శర్మ సీఎం కేసీఆర్‌కు వివరించారు. ఈ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు.