♦ టీఎస్‌ఐపాస్‌లో ప్రకటించింది రూ.100 కోట్లు..
♦ బడ్జెట్‌లో కేటాయించింది రూ.5 కోట్లే..
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలోని విద్య, పరిశోధన సంస్థల్లో జరిగే ఆవిష్కరణలు, సాంకేతికతను పరిశ్రమలతో అనుసంధానం చేసేందుకు ప్రభుత్వం రీసెర్చ్ అండ్ ఇన్నోవేషన్ ఆఫ్ హైదరాబాద్ (రిచ్) అనే వేదికను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. విద్యార్థులకు చదువుతో పాటు ఉద్యోగానికి అవసరమైన శిక్షణ కాలేజీ దశలోనే ఇప్పించాలనేది దీని ఉద్దేశం. రిచ్‌ను బలోపేతం చేసేందుకు రూ.100 కోట్లు కేటాయిస్తామని ప్రకటించినా ప్రస్తుతం బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో దీనికి ఆదిలోనే గండి కొట్టే సూచనలు కన్పిస్తున్నాయి.
హైదరాబాద్‌లోని ఇక్రిశాట్, క్రిడా, సీసీఎంబీ తదితర ప్రతిష్టాత్మక సంస్థల్లో జరిగే నూతన ఆవిష్కరణలు, సాంకేతికత, ఉత్పాదనలు, సేవలు వెలుగు చూడటం లేదు. ఈ సంస్థల్లోని ఆవిష్కరణలు, సాంకేతికతను రాష్ట్రంలోని పారిశ్రామిక రంగంతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రభుత్వం ప్రకటించిన రూ.100తో పాటు వెంచర్ కేపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్ల నుంచి కూడా రిచ్‌కు నిధులు సమకూర్చేలా ఆర్‌ఎంఎఫ్ (రీసెర్చ్ టు మార్కెట్ ఫండ్)ను ఏర్పాటు చేస్తామని ప్రకటించింది. కాగా, రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కాలేజీలు, ఐటీఐ వంటి సంస్థలను పరిశ్రమలతో అనుసంధానం చేస్తూ స్కిల్ పాలసీని రూపొందిస్తామని ప్రకటించింది. నూతన పారిశ్రామిక విధానం విడుదలై సుమారు 11 నెలలు కావస్తున్నా ఈ పాలసీకి తుది రూపునివ్వడం లేదు. మరోవైపు ‘రిచ్’కు ఈ బడ్జెట్‌లో రూ.5 కోట్లు మాత్రమే కేటాయించడంతో ఆర్‌ఎంఎఫ్‌కు నిధులు సమకూర్చేందుకు వెంచర్ కేపిటలిస్టులు, ఏంజెల్ ఇన్వెస్టర్లు ముందుకు వచ్చే పరిస్థితి కనిపించడం లేదు.
‘రిచ్’కు నిధులేవీ!
Published Mon, Apr 4 2016 1:01 AM | Last Updated on Sun, Sep 3 2017 9:08 PM
Advertisement
Advertisement