నాకు క్యూటీ కావాలి! | New bird Very small sparrow is half the size | Sakshi
Sakshi News home page

నాకు క్యూటీ కావాలి!

Published Sat, Aug 19 2017 12:15 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

నాకు క్యూటీ కావాలి! - Sakshi

నాకు క్యూటీ కావాలి!

పిట్ట కథ

ఓ పదిహేను రోజులక్రితం... టైం ఎనిమిదవుతుంది... నేనింకా నిద్రలోనే ఉన్నా.. బాల్కనీ గోడ పక్కన ఓ కొత్త సవ్వడి.. ఇంతకు ముందు విన్నపక్షుల సవ్వడిలా లేదు. బలవంతంగా నిద్రలేచి తలుపు తీసి చూశాను. ఏం కనిపించలేదు. కానీ ఆ కొత్త సవ్వడి మాత్రం వినిపిస్తూనే ఉంది. మొహం కడుక్కుని స్నానం చేసేలోపు ఓ ఐదారుసార్లు వినిపించింది ఆ సౌండ్‌ పిట్ట మాత్రం కనిపించలేదు. ఇలా కాదని జాగ్రత్తగా సీతాఫలం చెట్టు ఆకుల మధ్యలోంచి నెమ్మదిగా చూశాను.. అప్పుడు కనిపించింది.. నేను ఊహించినట్టే ఓ కొత్త పక్షి. చాలా చిన్నగా... పిచ్చుకలో సగం సైజే ఉంది. బూడిదరంగు శరీరం... తోకమాత్రం భలే అందంగా ఉంది. నెమలీకను బీడీ సైజ్‌ లో కట్‌ చేసి అతికించినట్టుంది. అది సీతాఫలం చెట్టు ఆకు వెనకాల దాక్కుంది.. ఆ ఆకు దానిని పూర్తిగా కవర్‌ చేసిందంటే అర్థం చేసుకోవచ్చు. అదెంత ఉందో. కానీ చూడ్డానికి మాత్రం భలే ముద్దుగా ఉంది. అరుపు కూడా ప్రత్యేకంగా ఉంది కాబట్టి నాకు ఆసక్తి పెరిగింది.

రెండోరోజు చూస్తే సీతాఫలం చెట్టు మీదే చిన్న గూడు కట్టుకుంది.. అసలా గూడు చూస్తే హాశ్చర్యపోతారు. కేవలం మూడంటే మూడే ఆకులతో ఎంత చక్కగా గూడు కట్టిందంటే, భలే ముచ్చటగా ఉందిలే. వెంటనే మా ఆవిడను పిలిచి చూపించాను. ముచ్చటగా కట్టుకున్న దాని ఇల్లు చూసి ముక్కున వేలేసుకుంది. మా అబ్బాయికయితే ప్రపంచ వింత చూస్తున్నంత సంబరం. వాడు స్కూల్లో టాంటాం వేశాడు తనకు కొత్త ఫ్రెండ్‌ అని, దాని పేరు క్యూటీ అనీ, దాని గూడు బాగుందనీ ఇలా... క్యూటీతో చిక్కేంటంటే.. అలికిడి వినిపిస్తే గూట్లోంచి ఎగిరిపోయేది.. అందుకే మెల్లగా.. బెడ్‌ రూం డోర్‌ తీసి మెత్తగా అడుగులు వేస్తూ చిన్నగా మెడ పైకెత్తి చూస్తే దాని గూడు కనిపించేది. అందులో తలపైకెత్తి పడుకునేది. చిన్న మొహం.. పూసల్లాంటి కళ్లు.. చిన్నముక్కు.. పదేపదే చూడాలనిపించేది కానీ సెకనులో వెయ్యోవంతులో ఎగిరిపోయేది. కొన్ని రోజులు ఇదే తంతు.

మేమైతే భలే ఎంజాయ్‌ చేస్తున్నాం ఇదంతా.. వారం రోజుల్లోనే దాంతో చిన్న అటాచ్‌మెంట్‌ పెరిగింది. దానికి కూడా నమ్మకం కుదిరిందేమో. ఇంతకు ముందులా మరీ వేగంగా పారిపోవడం లేదు. లేకపోతే చప్పుడు చేయకుండా చూడడం నాకు అలవాటయిందో మరి.. చెట్ల ఆకుల మధ్యలో కూర్చుని ఆ చిన్న అందమైన తోకని బోరింగ్‌ కొట్టినట్టు పైకీ, కిందకీ ఊపుతూ బోలెడు పాటలు పాడేది. మేం జాగ్రత్తగా తలుపు కొంచమే తెరిచి దానిని చూస్తుండేవాళ్లం. వేడివేడి టీకప్పుతో కిటీకీ దగ్గర నిల్చుని బయట దానిని చూడడం నాకు గొప్పగా అనిపించేది.ఆ మధ్య రెండు రోజులు వర్షం పడింది.అర్ధరాత్రి మెలకువొచ్చింది.. జోరున వర్షం పడుతున్న శబ్దం నా మనసులో ఏదో అలజడి. పే...ద్ద గాలి వాన. మా తలుపు సందులోంచి సన్నగా నీళ్లు లోపలికి వస్తున్నాయ్‌. అమ్మో.. ఇంత గాలివాన.. క్యూటీ ఎలా ఉందో... సిమెంట్‌తో కట్టిన ఇంట్లోకే నీళ్లొస్తున్నాయ్‌.. దాని ఆకుల గూడు ఎలా ఉందో! మనసులో ఒకటే దడదడ. ఫోన్‌లో టార్చ్‌ ఆన్‌ చేసుకుని నెమ్మదిగా డోర్‌ తెరిచి ఆకుల మధ్యలోంచి లైట్‌ వేసి చూశాను.

ఆశ్చర్యం.. దాని గూడు ఏమాత్రం తడవలేదు.. గాలికి దాని గూడు ఊగుతుంటే ఊయల ఊగినట్టు.. లోపల హాయిగా నిద్రపోతుంది. ఈసారి మాత్రం ఎగిరిపోలేదు.. దానిని అంత స్పష్టంగా చూడడం అదే మొదలు. ఇక నాకు ఇదే అలవాటైపోయింది.. పొద్దున్నే వాటి సవ్వడితో లేవడం... ఓసారి దాని గూట్లోకి తొంగిచూడడం.. బయటికెళ్లి రాగానే దాన్నోసారి పలకరించడం...  ఆ చిన్న పిట్ట పుణ్యమాని మా ఇంట్లోనూ చిన్న చిన్న మార్పులు... ‘‘ఇదిగో, పొరపాటున కూడా ఆ గోడ పక్కన ఏదీ విసిరేయకు.. దాని గూడుకి తగిలితే కష్టం. నీళ్లు.. గింజలు పెట్టావా? మరిచిపోయావా? వాడిమీద అరిచేటప్పుడు కాస్త హాల్‌లోకి వెళ్లు.. ఆ చిన్నప్రాణం భయపడితే కష్టం...’’ ఇలా ఉండేవి నా హెచ్చరికలు..మొత్తానికి నిద్రలేవడం మొదలు.. అర్ధరాత్రి దాకా దాని గురించి బోలెడు మాటలు. ఓ కుక్కనీ, పిల్లిని, చిలుకను పెంచుకునే వాళ్లలాగ మాకు ఓ బుజ్జి పిట్ట..! ఇలా ఇరవై రోజులు గడిచాయి.మూడు రోజుల క్రితం పొద్దున్నే దాని అలికిడి లేదు! ఏదో పోగొట్టుకున్నట్టుంది. లేచి బాల్కనీలోంచి తొంగిచూశాం. గూడు ఖాళీగా ఉంది.. ఏమైంది? పొద్దున్నే వెళ్లిపోయింటుందా?ఆ రోజు ఇలా నాలుగైదు సార్లు చూసినా ఎప్పుడూ గూడు ఖాళీగానే కనిపిస్తోంది. నా మనసేమో కాస్త సున్నితం. అందుకే  దిగులుగా ఉంది.. ఇక మా అబ్బాయి నాలుగు రోజులుగా ఒకటే ప్రశ్న ‘‘నాన్నా.. క్యూటీ ఎక్కడికి వెళ్లిందీ’’ అని. వారమైనా పత్తాలేదు.. రోజు రోజుకు నాకు దిగులు పెరిగిపోతోంది. ఇలా లాభంలేదని ఓ కర్ర తీసుకొచ్చి నెమ్మదిగా ఆ గూడును కదిపి చూశాం.

ఒక్కసారిగా గుండె ఝల్లుమంది. లోపల క్యూటీ నిర్జీవంగా పడుంది. తలెత్తి మిటుకు మిటుకు మంటూ చూస్తే తల పక్కకు వాలిపోయి ఉంది... జాగ్రత్తగా గమనించాను.. గూట్లో తెల్లగా పౌడర్‌.. చెట్టునిండా.. ఆకుల మీదకూడా. ఏం జరిగుంటుంది..? ఎవరైనా పిండి పడేసుంటారా? ఆలోచనలతో నా బుర్ర వేడెక్కిపోయింది. మా ఆవిడ రాగానే అడిగాను ఆ తెల్లపౌడర్‌ ఏంటని? గుర్తు చేసుకుని చెప్పింది. నాలుగు రోజుల క్రితం మూడు ఇళ్ల అవతల ఒకరోజంతా బోర్‌ వేశారు.. నీళ్లు పడలేదు సరికదా.. పెద్ద శబ్దం. కింద బండ ఉందేమో.. తెల్లటి పౌడర్‌ కాలనీ అంతా. తను చెబుతూనే ఉంది.. బాల్కనీ తలుపుమీద.. కిటికీమీద, నేలమీద...ఒక ఇంచు మేర ఆ బూడిద పరుచుకుందనీ.. అదంతా కడిగేసరికి తల ప్రాణం కాళ్లకొచ్చిందనీ.నాకు విషయం అర్థమైపోయింది.. ఆ పేద్ద శబ్దాలు, విపరీతంగా రేగిన బూడిద దెబ్బకు ఈ చిన్న ప్రాణం తట్టుకోలేకపోయిందనీ, ఊపిరాడక ఉన్నచోటే ప్రాణమొదిలేసిందనీ... జడివానకు, సుడిగాలికి తట్టుకునేలా గూడు నిర్మించుకుందనుకుందిగానీ, పిచ్చిది. మనుషుల సంగతి దానికేం తెలుసు? తప్పెవరిది? అమాయకంగా మా మధ్యలోకొచ్చిన ఆ చిన్ని ప్రాణానిదా? మనలాంటి జీవులు కూడా ఈ ప్రకృతిలో భాగమేనని ఆలోచించని మనుషులదా?
- వాసవీ మోహన్‌  
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement