వీటితో స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండండి..
సాక్షి, హైదరాబాద్: దేశంలో స్వైన్ ఫ్లూ చాపకింద నీరులా విస్తరిస్తోంది. కేంద్ర ఆరోగ్యశాఖ లెక్కల ప్రకారం ఈ ఏడాది దేశవ్యాప్తంగా 25,864 స్వైన్ ఫ్లూ కేసులు నమోదయ్యాయి. ఇది గతేడాది నమోదైన కేసులకన్నా 14 రెట్లు ఎక్కువ. ఇక 2016లో 1,786 కేసులు నమోదయ్యాయి. ప్రస్తుతం ఈ విషయం ఆందోళన కలిగిస్తోంది. ఇక ఈ వ్యాధితో మరణించే వారి సంఖ్య నాలుగు రెట్లు పెరిగింది. స్వైన్‌ఫ్లూ శ్వాసకోస వ్యాధి కావండంతో త్వరగా విస్తరిస్తోంది. వ్యాధిని గుర్తించడంలో నిర్లక్ష్యం వహించడం, సకాలంలో వైద్యం అందకపోవడంతో ఈ వ్యాధి మరణాల సంఖ్య పెరుగుతోంది.
వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవడంతోనే స్వైన్ ఫ్లూకు దూరంగా ఉండవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. సహజంగా లభించే ఆహార పదార్థాలతో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇది చల్లని వాతవారణంలో త్వరగా వ్యాప్తి చెందుతోంది కాబట్టి ఈ మన్‌సూన్ సీజన్‌లో జాగ్రత్తగా ఉండాలి.
ఈ కింది వాటితో వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు..
♦వేడి నీరు, నిమ్మ రసం, తేనేల మిశ్రమాన్ని ఉదయాన్నే పడిగడుపున తీసుకుంటే బరువు తగ్గడంతో పాటు, వ్యాధి నిరోధక శక్తి పెంపొందించుకోవచ్చు.
♦ హెర్బల్ టీలతో కూడా వ్యాధినిరోధక శక్తి పెంచుకోవచ్చు. దీంతో ఇన్‌ఫెక్షన్ల నుంచి దూరంగా ఉండవచ్చు. తులసి, అల్లం, నిమ్మ, బ్రాహ్మి టీలతో ఈ వ్యాదికి దూరంగా ఉండవచ్చు.
♦ఉసిరి జ్యూస్‌లో తేనేను కలిపి తాగడం వల్ల కూడా వ్యాధి నిరోధక శక్తి పెంచుకోవచ్చు. ఇందు యాంటీ ఆక్సిడెంట్స్, మైక్రో న్యూట్రిన్‌లు పుష్కలంగా ఉంటాయి.
♦పసుపు మానవ శరీరానికి మంచి ఔషదంలా పనిచేస్తోంది. యాంటి బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్ గా పనిచేస్తూ వ్యాధినిరోధక శక్తిని పెంపోందిస్తుంది. ఇది మనం వంటలలో రోజు వాడేదే.
♦ నల్లమిరియాలు శరీరంలో వేడిమిని తగ్గించడమే కాకుండా వ్యాధినిరోధక శక్తి పెంపొందిస్తాయి. మిరియాలను కూడా మన ఆహార పదార్థాల్లో ఉపయోగిస్తాం.
♦ దాల్చిన చెక్కతో జలుబు, దగ్గు, గొంతునొప్పి, తలనొప్పిలను తగ్గించడమే కాకుండా ఎలాంటి వైరస్‌లు ధరిచేరకుండా చేస్తోంది. దాల్చిన చెక్క పౌడర్‌ను తేనేలో కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితాలుంటాయి.