జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది! | Young Citrus farmer growing in Cultivation | Sakshi
Sakshi News home page

జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది!

Published Tue, Apr 26 2016 12:13 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది! - Sakshi

జీవామృతం పారింది.. బత్తాయి నవ్వింది!

♦ డిగ్రీ చదివి బత్తాయి సాగులో రాణిస్తున్న యువరైతు
♦ రెండేళ్లుగా ప్రకృతి సేద్యం.. దిగుబడులు సంతృప్తికరం
♦ తోకముడిచిన వేరుకుళ్లు తదితర తెగుళ్లు  
 
 అతను డిగ్రీ చదువుకున్నాడు. సొంత భూమిలో బత్తాయి తోట సాగు ప్రారంభించాడు. అందరి మాదిరిగానే రసాయనిక వ్యవసాయ పద్ధతులను పాటించాడు. ఏటా తెగుళ్లతోపాటు ఖర్చూ పెరుగుతున్నా.. దిగుబడి నానాటికీ తీసికట్టవుతూ వచ్చింది. విసిగి వేసారి ప్రకృతి సేద్యం చేపట్టాడు. ఖర్చు 80 శాతం తగ్గింది. కానీ, దిగుబడి తొలి ఏడాది కూడా తగ్గలేదు. మరోవైపు బత్తాయిల నాణ్యత పెరిగింది.. ఏ రైతుకైనా ఇంతకన్నా ఏం కావాలి చెప్పండి..?
 
 గోట్ల గౌతమ్ అనే విద్యాధికుడైన యువ రైతు తన 18 ఎకరాల బత్తాయి తోటలో ప్రకృతి సేద్యం చేస్తూ.. తొలి ఏడాది నుంచే రసాయన సేద్యానికి దీటుగా దిగుబడులు సాధిస్తున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాల్ మండలం కొత్తపల్లి ఆయన స్వగ్రామం. డిగ్రీ వరకు చదువుకున్నారు. అయినా వ్యవసాయంపై మక్కువతో 2005 నుంచి 18 ఎకరాల్లో బత్తాయి సాగు (రసాయనిక వ్యవసాయం) ప్రారంభించారు. ఐదేళ్ల పాటు కంటికి రెప్పలా కాపాడుకున్నాక 2010లో పంట దిగుబడి ప్రారంభమైంది.

అదే సమయంలో తామర పురుగు, పచ్చదోమ, తెల్లదోమతో వైర స్ తెగుళ్ల వ్యాప్తి పెరిగింది. తరచూ వేరుకుళ్లు, కాంకర్ వంటి తెగుళ్లు, రసం పీల్చే పురుగులు పంటను ఆశించేవి. వీటిని నివారించేందుకు క్రిమిసంహారక మందులను విరివిగా పిచికారీ చేయాల్సి వచ్చేది. దీని వల్ల ఖర్చు పెరిగేది. శ్రమ ఎక్కువయ్యేది. అంత చేసినా దిగుబడి.. పంట నాణ్యత తగ్గుతూ ఉండేది. రకరకాల మందులను మార్చి మార్చి పిచికారీ చేసినా నెల రోజుల తర్వాత మళ్లీ చీడపీడల దాడి మొదలయ్యేది. వేరుపురుగుతో వేగలేక కొత్తపల్లి గ్రామంలో కొందరు రైతులు బత్తాయి తోటలను నరికివేశారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.

 అటువంటి అననుకూల పరిస్థితుల్లో ఇక రసాయనిక పురుగుమందుల పిచికారీతో చీడపీడల నివారణ సాధ్యం కాదని నిర్ణయించుకున్నారు గౌతమ్. ఆ దశలో పత్రికల  ద్వారా ప్రకృతి సేద్యం గురించి తెలుసుకొన్నారు. 2013లో నాగ్‌పూర్‌లో జరిగిన పాలేకర్ శిక్షణా శిబిరంలో పాల్గొన్నారు. మెలకువలను ఆకళింపు చేసుకొని శ్రద్ధగా ఆచరించటం ప్రారంభించారు.

 చెట్టుకు నెలకు 5-7 లీటర్ల జీవామృతం
 జీవామృతం తయారీ కోసం ఆరు ఒంగోలు జాతి ఆవులను గౌతమ్ పెంచుతున్నారు. నెలకు 25 వేల లీటర్ల జీవామృతాన్ని తయారు చేసి బత్తాయి మొక్కలకు అందిస్తున్నారు. ఒక్కో చెట్టుకు నెలకు 5-7 లీ. చొప్పున అందిస్తున్నారు. తయారు చేసిన జీవామృతాన్ని వారం లోపలే మొక్కలకు అందిస్తారు. మరో ట్యాంకును ఏర్పాటు చేసి ఫిల్టర్ అయిన జీవామృతాన్ని డ్రిప్ ద్వారా చెట్లకు అందిస్తున్నారు.  లీటరు నీటికి 10 నుంచి 20 మిల్లీ లీటర్ల జీవామృతాన్ని కలిపి నెలకోసారి చెట్లపై పిచికారీ చేస్తున్నారు. ఎలాంటి కషాయాలు పిచికారీ చేయకుండానే తెగుళ్ల బెడద తగ్గిపోయింది. ప్రకృతి సేద్యం పాటించినప్పటి నుంచి తోటలోకి ఎక్కువ సంఖ్యలో పక్షులు రావటం మొదలైంది. పంటను ఆశించే వివిధ రకాల పురుగులను తింటూ సహజ కీటక నివారిణిలుగా ఇవి పని చేస్తున్నాయి.

 తోటలో పెరిగే గడ్డి కూడా బలమే!
 ప్రకృతి సేద్య పద్ధతుల్లో సాగవుతున్న పండ్ల తోటల్లో చెట్ల మధ్య పెరిగే గడ్డి మొక్కలను దున్నకూడదంటారు గౌతమ్. పెరిగిన గడ్డి వల్ల ఆచ్ఛాదన ఏర్పడి భూమిలో ఎక్కువ కాలం తేమ నిల్వ ఉంటుంది. తేమను ఆధారంగా చేసుకొని పంటకు మేలు చేసే సూక్ష్మజీవులు భూమి పై పొరలో నివశిస్తాయి. శిలీంధ్రాల బారి నుంచి చెట్లను కాపాడే సహజ రక్ష క కవచాలుగా ఇవి పని చేస్తాయి. వీటిని కాపాడుకోవాలంటే భూమిని దున్నకూడదంటారాయన. ప్రకృతి సేద్యం చేస్తున్న కొందరు పండ్ల తోటల రైతులు జీవామృతాన్ని అందిస్తున్నా... దిగుబడులు ఆశించిన రీతిలో పెరగటం లేదని బాధపడుతుంటారు. తోటను తరచూ దున్నటమే దీనికి కారణం అంటారు గౌతమ్. బత్తాయి తోటలో అంతర పంటగా ఎకరాకు 300 మునగ మొక్కలను పెంచుతున్నారు. మునగ మొక్కలు ఇప్పుడు పూత దశలో ఉన్నాయి.

 ఖర్చు 80% తగ్గింది.. పంట పండింది..
 ప్రకృతి సేద్యంలో 80 శాతం ఖర్చు తగ్గిందని గౌతమ్ తెలిపారు. 18 ఎకరాల తోటకు రసాయన సేద్యంలో ఎరువులు, పురుగుమందులకు ఏటా రూ. 6-7 లక్షల వరకు ఖర్చయ్యేది. అయితే, జీవామృతం తయారీకి అవసరమైన శనగపిండి, బెల్లం కొనుగోలుకు మాత్రమే రూ. లక్ష వరకు ఖర్చవుతోంది. రసాయన సేద్యంలో ఎకరాకు 10-12 టన్నుల దిగుబడి వచ్చేది. ప్రకృతి సేద్యం ప్రారంభించిన ప్పటి నుంచి 9-10 టన్నులకు తగ్గకుండా దిగుబడి వస్తోంది. పంట నాణ్యత బాగుండటంతో గతేడాది రూ. 33 లక్షలకు వ్యాపారులు తోటను  కొనుగోలు చేశారు.
 - శ్రీకర్, గద్వాల న్యూటౌన్, మహబూబ్‌నగర్ జిల్లా  
 
 ప్రకృతి సేద్యం తోనే బత్తాయి రైతుకు మనుగడ!
 18 ఎకరాల్లో బత్తాయి తోటకు రసాయనిక ఎరువులు, పురుగుమందుల వాడకానికి రూ. 6-7 లక్షలు ఖర్చయ్యేది. పురుగుమందుల పిచికారీ వల్ల ఖర్చే తప్ప ఉపయోగం లేదు. ప్రకృతి సేద్యంలో ఖర్చు తగ్గి భూమి సారవంతమవుతున్నది. మంచి నాణ్యమైన పంట దిగుబడి వస్తోంది. ప్రకృతి సేద్యంతోనే బత్తాయి రైతుకు మనుగడ.  రైతులంతా ప్రకృతి సేద్యాన్ని ఆచరించాలి.
 - గోట్ల గౌతమ్ (99480 50031), కొత్తపల్లి, గద్వాల్ మండలం, మహబూబ్‌నగర్ జిల్లా.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement