- సైకిల్‌పై 6వేల కి.మీ యాత్ర
– 16 రాష్ట్రాల్లో పర్యటన
– కెమెరాతో వేలాదిగా ప్రకృతి చిత్రాలు
– కర్నూలు యువకుని ప్రతిభ
కర్నూలు(హాస్పిటల్): ప్రకృతిలో ఎన్నెన్నో వింతలు..వాటిని రెండు కళ్లతో చూడటం అందరికీ సాధ్యం కాదు. అందుకే కెమెరా కళ్లను కూడా మనిషి జతచేసుకున్నాడు. ఆ ‘కళ్ల’తో ఈ ప్రకృతిని మరింత అందంగా చూపించాలనే ప్రయత్నం నిత్యం చేస్తూనే ఉన్నాడు. ఆ కెమెరా కళ్ల ద్వారా వచ్చిన దృశ్యాలు నిత్యం మనకు మేగజైన్లు, పత్రికల్లో, టీవీ చానళ్లు, సినిమాలలో అద్భుతంగా కనిపిస్తుంటాయి. కర్నూలుకు చెందిన కుర్రాడు తేజేశ్వర్ ఇదే పని చేస్తున్నాడు. కెమెరా భుజాన వేసుకుని దేశంలోని 16 రాష్ట్రాల్లో సైకిల్‌పై సాహస యాత్ర చేశాడు. సుమారు 6వేల కిలోమీటర్లు ప్రయాణించి అద్భుత చిత్రాలు బంధించాడు.
కర్నూలు నగరంలోని నెహ్రూనగర్‌కు చెందిన ప్రభుత్వ ఉద్యోగులు శ్రీనివాసులు, పార్వతికి ఇద్దరు కుమారులు. వారిలో పెద్ద కుమారుడైన మద్దికెర తేజేశ్వర్ బీటెక్‌లో మెకానికల్ ఇంజనీరింగ్‌ను హైదరాబాద్‌లోని జేబీఐఈటీ కాలేజిలో చదివాడు. తనకు చిన్నతనం నుంచి ఫొటోగ్రఫీ, ప్రయాణం అంటే ఇష్టం. ఆ ఇష్టంతోనే చదువు మధ్యలో మూడు నెలల పాటు ముంబయిలోని ఫ్యాషన్ ప్రో సంస్థలో శిక్షణ తీసుకున్నాడు. ఫైన్ ఆర్ట్స్ ఫొటోగ్రఫి, సెల్ఫ్ న్యూడ్ ఫొటోగ్రఫి, స్ట్రీట్ ఫొటోగ్రఫి, నేచర్ ఫొటోగ్రఫిలో తర్ఫీదు పొందాడు. ఆ సమయంలో అక్కడి అధ్యాపకురాలు ప్రాచీ చపేకర్ సూచనలు ఆయనకు ఎంతో స్ఫూర్తినిచ్చాయి. శిక్షణ తర్వాత కొన్నాళ్ల పాటు మోడరన్ ఇండియా మేగజైన్‌లో ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్‌గా పనిచేశాడు.
ప్రకృతి అందాల ఫోటోల కోసం సైకిల్ యాత్ర
ఈ ప్రకృతి, అందమైన ప్రపంచాన్ని తన కెమెరాలో బంధించాలని తేజేశ్వర్ కలలు కనేవాడు. ఆ కలలకు రూపాన్ని కల్పించేందుకు గత సంవత్సరం ఆగష్టు 6వ తేదిన ముంబయి నుంచి సైకిల్ యాత్ర ప్రారంభించాడు. అక్కడ నుంచి గుజరాత్, మహారాష్ట్ర, రాజస్తాన్, హర్యానా, హిమాచల్‌ప్రదేశ్, ఢిల్లీ, జమ్మూ కాశ్మీర్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, తెలంగాణా, పూణే, కర్నాటక, గోవా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో సైకిల్ యాత్ర చేశాడు. తనకు చిన్నతనం నుంచి ఇష్టమైన ప్రయాణం, ఫొటోగ్రఫి అనే ఇష్టాలను ఆయన ఈ విధంగా తీర్చుకున్నాడు. యాత్రలో కనిపించిన ప్రతి అందమైన దృశ్యాన్ని తన కెమెరాలో బంధించాడు. ఇప్పటి వరకు 6వేలకు పైగా కిలోమీటర్లు సైకిల్ యాత్ర చేశాడు. నేచర్ ఫోటోగ్రఫి కోసం, సోషల్ డాక్యుమెంటరీ కోసం ఈ యాత్ర చేపట్టినట్లు ఆయన తెలిపాడు.
‘జాంటీ’ తోడుగా కష్టం ఇష్టంగా...!
–తేజేశ్వర్, నేచర్ ఫొటోగ్రాఫర్
సైకిల్ యాత్ర చేస్తున్న సమయంలో ఒకానొక సమయంలో తీవ్ర అలసట, అయిష్టం ఏర్పడేది. కొన్నిసార్లు ముందుకు సాగబుద్ధి అయ్యేది కాదు. నా కష్టాన్ని ఇష్టంగా మార్చుకోవాలంటే తోడు అవసరమని భావించాను. ఈ మేరకు జైపూర్‌లో రూ.8వేలు వెచ్చించి జర్మన్ షెప్పర్డ్ అనే జాతి కుక్కపిల్లను కొనుగోలు చేశాను. దానిని వెంట బెట్టుకుని యాత్ర ప్రారంభించాను. ఆ మరునాడు జైపూర్ రోడ్డుపై దక్షిణాఫ్రికా మాజీ క్రికెటర్ జాంటిరోడ్స్ కనిపించాడు. ఆయన స్నేహితురాలు సమంత నాలాగే ఒక మంచి ఉద్దేశంతో 8వేల కిలోమీటర్ల పరుగు చేస్తోంది. వారిద్దరూ జైపూర్ రోడ్డుపై నన్ను చూసి ఆపారు. నా గురించి, నేను చేస్తున్న పని గురించి తెలుసుకున్నారు. నా వద్ద ఉన్న కుక్కపిల్లను చూసి ముచ్చటపడ్డారు. దీనికి ఏం పేరు పెట్టావని అడిగారు. ఇంకా పేరు పెట్టలేదన్నాను. వెంటనే సమంత దీనికి ‘జాంటిరోడ్స్’ అని పేరు పెట్టాలని సూచించారు. వారి సూచన మేరకు కుక్కపిల్లకు ఆ పేరే పెట్టాను. అప్పటి నుంచి ఆ కుక్కపిల్ల నన్ను విడిచి ఒక్క నిమిషం కూడా ఉండలేకపోతోంది.