గిరిజన దంపతుల ఏకలవ్య సేద్యం! | Eklavya tribal farming couple! | Sakshi
Sakshi News home page

గిరిజన దంపతుల ఏకలవ్య సేద్యం!

Published Mon, Apr 11 2016 10:41 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

గిరిజన దంపతుల ఏకలవ్య సేద్యం! - Sakshi

గిరిజన దంపతుల ఏకలవ్య సేద్యం!

♦ ప్రత్యక్ష శిక్షణ పొందకుండానే ప్రకృతి వ్యవసాయంలోకి..
♦ మిత్రుడు ఫోన్‌లో చెప్పిన సమాచారంతోనే ప్రకృతి సేద్యం ప్రారంభం
♦ రెండేళ్లుగా విజయవంతంగా వరి సాగు చేస్తున్న సోమ్లా నాయక్ దంపతులు
♦ ఎకరానికి 50 బస్తాల దిగుబడి సాధించిన వైనం..
 
 ప్రకృతి వ్యవసాయంపై శిక్షణ  పొందిన తర్వాత కూడా ప్రకృతి సేద్యం చేపట్టలేని పరిస్థితులు ఉన్నాయి.  అయితే, ఓ కుగ్రామానికి చెందిన గిరిజన రైతు దంపతులు సోమ్లా నాయక్, కోమటి బాయి విజయగాథ మాత్రం అందుకు భిన్నమైనది. ప్రకృతి సేద్యంపై వారు ఎక్కడా శిక్షణ పొందలేదు. కానీ, రసాయనిక సేద్యంతో అప్పులపాలైన సోమ్లానాయక్‌కు ఆయన మిత్రుడొకరు పాలేకర్ సేద్యాన్ని పరిచయం చేశారు. మిత్రుడు ఫోన్‌లో చెప్పిన మాటలే వారి ప్రకృతి సేద్యపు నావకు చుక్కాని అయ్యాయి. విజయవంతంగా ప్రకృతి వ్యవసాయంలోకి నడిపించాయి. మొదటి పంటలోనే ప్రకృతి వ్యవసాయ సూత్రాలన్నిటినీ శ్రద్ధగా అనుసరించడంతో ఎకరానికి 50 బస్తాల ధాన్యం దిగుబడి వచ్చింది! రసాయనిక అవశేషాల్లేని ధాన్యాన్ని బంధుమిత్రులే పోటీపడి కొనుక్కెళ్తున్నారు.. ఈ గిరిజన దంపతుల ఆదర్శ సేద్యానికి వెన్నుదన్నుగా నిలుస్తున్నారు..
 
 రసాయన సేద్యం చేసి అప్పులతో కుదేలైన రైతును ప్రకృతి సేద్యం ఆదుకొంది. జీవామృతాన్ని ఆసరాగా చేసుకొని వరిలో కళ్లు చెదిరే దిగుబడులు సాధిస్తున్నాడు మూఢావత్ సోమ్లా నాయక్. గుంటూరు జిల్లా దాచేపల్లి మండలం భట్రుపాలెం గ్రామానికి చెందిన నాయక్‌కు ఎకరం 20 సెంట్ల భూమి ఉంది. అందులో ప్రకృతి సేద్యం చేస్తూ ఎకరాకు 50 బస్తాల ధాన్యం దిగుబడి సాధించాడు. వచ్చిన ఆదాయంతో అప్పుల కష్టాలకు స్వస్తి పలికాడు.

 సోమ్లా నాయక్ గతంలో రసాయనిక ఎరువులు, పురుగుమందులు వాడుతూ వ్యవసాయం చేసేవారు. ఆ పద్ధతుల్లోనే బత్తాయి తోటను సాగు చేశారు. తోటను ఆరేళ్లు పెంచినా సరైన దిగుబడి రాకపోవడంతో చెట్లను నరికేసి.. మిరప తోట వేశారు.. మళ్లీ నష్టాల పాలయ్యాడు. నష్టాలు రాని వ్యవసాయం చేయలేమా? అని అన్వేషిస్తున్న ఆ రోజుల్లోనే వెన్నుపూస సమస్య రావడంతో మంచం పట్టారు.

 స్నేహితుడి ద్వారా తెలుసుకొని..
 ఆ సమయంలో సుభాష్ పాలేకర్ ప్రచారంలోకి తెస్తున్న పెట్టుబడి లేని ప్రకృతి సేద్యం గురించి మిత్రుడి ద్వారా తెలిసింది. అనారోగ్యం వల్ల పాలేకర్ శిక్షణా తరగతులకు హాజరుకాలేకపోయారు.  అయితే, భీమవరానికి చెందిన మిత్రుడు వెంకటేశ్వరరావు ద్వారా సోమ్లా నాయక్ ప్రకృతి వ్యవసాయ మూలసూత్రాలను అనేక సార్లు ఫోన్‌లో విని, ఆకళింపు చేసుకున్నారు. వరి సాగులో అనుసరించాల్సిన ప్రకృతి వ్యవసాయ పద్ధతులను తెలుసుకున్నారు. మిత్రుడు ఫోన్‌లో చెప్పిన సలహాలతోనే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించడం విశేషం.

 తాను మంచంలో నుంచి లేవలేని స్థితిలో భార్య కోమటి బాయికి అతికష్టంపై నచ్చజెప్పి  ప్రకృతి వ్యవసాయం ప్రారంభింపజేశారు. 2014 ఖరీఫ్‌లో 65 సెంట్లలో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో వరి సాగు చేయగా.. 33 బస్తాల దిగుబడి వచ్చింది. దీంతో ఈ గిరిజన దంపతులకు ప్రకృతి సేద్యంపై గట్టి గురి కుదిరింది. ఉత్సాహం పెల్లుబికింది. 2015 ఖరీఫ్‌లో తమకున్న మొత్తం (1.20 ఎకరాల్లో) పొలంలోనూ ప్రకృతి సేద్యం చేశారు. ఏకంగా 60 బస్తాల (బస్తా 75 కేజీలు) దిగుబడి వచ్చింది. ధాన్యం బస్తా రూ.2,500 చొప్పున తెలిసిన వాళ్లే అడ్వాన్స్‌గా బుక్ చేసుకొని మరీ కొనుక్కెళ్తున్నారు. ఖర్చులన్నీ పోను రూ. 50 వేల నికరాదాయం వచ్చింది. ప్రస్తుతం రబీలోనూ వరి సాగు చేస్తున్నారు.

 పంటకు జీవం జీవామృతం..
 సోమ్లానాయక్ తన పొలంలో నాట్లు వేయటానికి 40 రోజుల ముందుగా పచ్చిరొట్ట పైర్లను సాగు చేసి దమ్ములో కలియదున్నుతారు. నారు మడులు పోసేముందు విత్తనాలను, నాట్లు వేసేముందు నారును బీజామృతంతో శుద్ధి చేస్తారు. తద్వారా మొక్కల్లో రోగ నిరోధక శక్తి పెరిగి చీడపీడలను సమర్థవంతంగా తట్టుకుంటాయని ఆయన చెప్పారు. పోషకాలను అందించేందుకు 200 లీటర్ల జీవామృతాన్ని 10 రోజులకు ఒకసారి బోరు నీటి ద్వారా పంటకు అందిస్తారు. 10 లీటర్ల జీవామృతాన్ని 100 లీటర్ల నీటిలో కలిపి 15 రోజులకోసారి పంటపై పిచికారీ చేస్తారు. 10 లీటర్ల నీటికి 2.5 లీటర్ల చొప్పున అగ్ని అస్త్రం, బ్రహ్మాస్త్రం కషాయాలను కలిపి అదొకసారి, ఇదొకసారి మార్చి పిచికారీ చేయడం ద్వారా దోమ, పురుగును నివారిస్తున్నారు.

 నేలకు, వినియోగదారులకు ఆరోగ్యదాయకమైన ఆహారాన్ని పండిస్తున్న సోమ్లానాయక్‌కు మార్కెటింగ్ సమస్య లేనే లేదు. బంధుమిత్రులు, స్నేహితులు నూర్పిడి సమయంలోనే ధాన్యానికి మంచి ధర ఇచ్చి కొనుక్కెళ్తున్నారు. సోమ్లానాయక్ తన పొలం చుట్టూ గట్లపైన టేకు చెట్లు పెంచుతున్నారు. ఆయన పొలానికి ఇప్పుడు ప్రకృతి వ్యవసాయం కొత్త ఆకర్షణను తెచ్చిపెట్టింది. సాగు పద్ధతిని ప్రకృతికి అనుగుణంగా మార్చుకుంటే వ్యవసాయాన్ని గిట్టుబాటుగా మార్చుకోవచ్చని సోమ్లానాయక్ దంపతులు రుజువు చేశారు. వీరి విజయగాథ ఆ ప్రాంత రైతుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.
 - వినుకొండ అజయ్‌కుమార్, సాక్షి, దాచేపల్లి, గుంటూరు జిల్లా
 
 కష్టం అనుకోకుండా చేశాం..
 రసాయనిక ఎరువుల ద్వారా వ్యవసాయం చేసి అప్పుల పాలయ్యాను. గడ్డి తప్ప ఏమీ మిగల్లేదు. అప్పుల పాలయ్యాను. భూసారం నాశనం అయ్యింది. ఇల్లు గడవక ఇబ్బంది పడ్డాను. ప్రకృతి వ్యవసాయంతో భూమికి బలం వచ్చింది. పాత అప్పులు తీర్చాను. ప్రకృతి సేద్యంలో అప్పులు చేయవలసిన అవసరం లేదు. ఎకరాకు 50 బస్తాల దిగుబడి వచ్చింది. కష్టం అనుకోకుండా పాలేకర్ చెప్పిన పద్ధతులను పాటిస్తే రైతులకు మేలు కలుగుతుంది. స్నేహితుడు ఎన్నోసార్లు ఫోన్‌లో చెప్పింది విని అర్థం చేసుకున్నాను. భార్య తోడ్పాటుతో ఆచరణలో పెట్టాను. మంచి ఫలితాలు సాధిస్తున్నాం. భూసారం పెరిగింది. నికరాదాయం పెరిగింది. రసాయనిక అవశేషాల్లేని బియ్యం తినే వారి ఆరోగ్యమూ మెరుగవుతోంది.
 - మూఢావత్ సోమ్లానాయక్ (99087 40156), భట్రుపాలెం, దాచేపల్లి మండలం, గుంటూరు జిల్లా
 
 13న శాశ్వత వ్యవయసాయంపై శిక్షణ
 పొలంలో మట్టి తీరు, ఎత్తు పల్లాలను బట్టి వాన నీటి సంరక్షణ అనుసరించాల్సిన పద్ధతులు.. పంటలతోపాటు గట్లపైన నాటాల్సిన చెట్ల ఎంపిక, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు తెలుసుకోవడానికి.. వ్యవసాయ సంక్షోభానికి మూల కారణాలను అర్థం చేసుకొని, వాటి పరిష్కారం దిశగా నిర్మాణాత్మక కృషి చేయడానికి పర్మాకల్చర్ (శాశ్వత వ్యవయసాయ) రైతులకు ఉపకరిస్తుంది. దీనిపై పరిచయ కార్యక్రమం ఈ నెల 13వ తేదీన నిజామాబాద్ జిల్లా వర్నిలో జరుగుతుంది. అరణ్య అగ్రికల్చరల్ ఆల్టర్నేటివ్స్ వ్యవస్థాపకుడు కొప్పుల నరసన్న శిక్షణ ఇస్తారు. ఫయాజ్ 85006 40590.
 
 అరటి, కూరగాయలు, మిరప పంటల ప్రకృతి సేద్యంపై శిక్షణ
 గత కొన్నాళ్లుగా రైతునేస్తం ఫౌండేషన్ పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయంపై... రైతులకు వారంలో ఒక రోజు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈనెల 17న ప్రకృతి వ్యవసాయంలో అరటి, కూరగాయలు, మిరప పంటల సాగులో అనుసరించాల్సిన మెళకువలపై రైతులకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నారు. గుంటూరు జిల్లా వట్టి చెరుకూరు మండలం పుల్లడిగుంటలోని రైతు శిక్షణ కేంద్రంలో శిక్షణనిస్తారు. హాజరవ్వాలనుకునే రైతులు     0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు.
 
 కేరళ బడుల్లో సేంద్రియ పంటలపై పాఠాలు
 వ్యవసాయంలో వాడే విష రసాయనాల దుష్ఫలితాలను చవిచూసిన కేరళ రాష్ట్రం.. రేపటి తరానికి మట్టివాసనను, ఆకు పచ్చని పైరు నులివెచ్చని స్పర్శను పరిచయం చేస్తోంది. 2017 కల్లా సేంద్రియ రాష్ట్రం గుర్తింపు సాధన దిశగా కేరళ వ్యవసాయ శాఖ అడుగులేస్తోంది. ఈ లక్ష్యసాధన కృషిలో భాగంగా 200 పాఠశాలల్లో విద్యార్థులకు సేంద్రియ సేద్యంపై శిక్షణ ఇస్తోంది. కొల్లాం సమీపంలోని అంచలుమూదు గ్రామంలోని ప్రభుత్వ ప్రాథమికోన్నత పాఠశాల అందుకు మచ్చుతునక. ఈ పాఠశాల విద్యార్థులు కుండీల్లో బాసుమతి వరిని సేంద్రియ పద్ధతుల్లో సాగు చేశారు. గతేడాది జూన్ 17న పాఠ శాల ఆవరణలో 50 మట్టి కుండీల్లో బాసుమతి వరి మొక్కలను నాటారు. వారి కృషి ఫలించింది. నూర్పిడి కార్యక్రమాన్ని పాఠశాల విద్యార్థులంతా పండగలా జరుపుకున్నారు. ఉత్తరాది పంటగా భావించే బాసుమతి వరిని కూడా సాగు చేయవచ్చని పాఠశాల విద్యార్థులు నిరూపించి చూపించారు! రైతుల్లో అమితాసక్తిని రేకెత్తించింది. ఈ అనుభవం విద్యార్థుల మనోఫలకంపై మధుర స్మృతిగా నిలిచిపోయింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement