దుక్కి అవసరం లేదు!
అన్నపూర్ణ పంటల నమూనా ప్రకారం ప్రకృతి వ్యవసాయం చేసే అరెకరం పొలం నిండా మట్టి పరుపులు, వాటి మధ్య కాలువలు ఉంటాయి. అందువల్ల ట్రాక్టరు లేదా నాగళ్లతో దుక్కి చేయడం వీలు కాదు.. కాబట్టి మానవ శ్రమ ఎక్కువగా చేయవలసి వస్తుందేమో కదా?
చాలా మంది రైతులు ఇదే ప్రశ్న అడుగుతున్నారు. ఈ నమూనాలో సాగు పనులు ఎక్కువగా మనుషులే చేసుకోవాల్సి ఉంటుంది. కేవలం అర ఎకరం భూమిలో వ్యవసాయం చేసుకొని, తమ కుటుంబానికి కావలసిన అన్ని రకాల సహజ ఆహార పదార్థాలను సమకూర్చుకోవడానికి సిద్ధపడిన కుటుంబానికి ఇది పెద్ద పని కాదు. రోజూ రెండు, మూడు గంటలు ఆడుతూ పాడుతూ పనిచేసుకోవడం సులభమే.. ఈ మాత్రం శారీరక శ్రమ ఆరోగ్యానికీ మంచిదే.. అర ఎకరం కంటే ఎక్కువ విస్తీర్ణంలోని మట్టిపరుపుల్లో పంటలు పండించాలనుకునే రైతులు అదనంగా కూలీలను పెట్టుకోవలసి ఉంటుంది. మట్టి పరుపుల్లో సాగు చేపట్టిన తర్వాత ట్రాక్టర్లతో దున్నడానికి అవకాశం లేదు. కానీ, చిన్న చిన్న పవర్ వీడర్‌లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. అదేవిధంగా ఇంధనం అవసరం లేని చిన్న చిన్న వీడర్‌లను కూడా వాడొచ్చు. మరో ముఖ్య విషయమేమంటే.. అన్నపూర్ణ నమూనా వ్యవసాయంలో దుక్కి కూడా అవసరం లేదు. ప్రకృతి వ్యవసాయంలో మూలసూత్రం ఇదే. పెద్ద యంత్రాలతో వ్యవసాయం చేయడం వలన వ్యవసాయానికి దోహదపడే మిత్ర కీటకాలు నాశనం అవుతాయి. అదేవిధంగా యంత్రాలతో వ్యవసాయం చేస్తే మట్టి పరుపులు, కాలువలు, కందకాలు చెదిరిపోతాయి కాబట్టి వాటిని మళ్లీ మళ్లీ ఏర్పాటు చేసుకోవలసి వస్తుంది. దీని వల్ల శ్రమ కూడా పెరుగుతుంది. చేతితో తవ్వే బొరిగెలు, పారలు, కొడవళ్ల సహాయంతో వ్యవసాయ పనులు చేసుకోవడం మేలు.
- డి.పారినాయుడు (94401 64289),
‘జట్టు’ సంస్థ వ్యవస్థాపకులు, ‘అన్నపూర్ణ’ నమూనా రూపశిల్పి