ప్రకృతి సేద్యానికి పెట్టని ‘కోట’ | Gangadharam gives the new berth to the natural farming | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యానికి పెట్టని ‘కోట’

Published Mon, Aug 29 2016 11:44 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

ప్రకృతి సేద్యానికి పెట్టని ‘కోట’ - Sakshi

ప్రకృతి సేద్యానికి పెట్టని ‘కోట’

- సత్తువుడిగిన సాగు భూమికి ఊపిరులూదిన ఉద్యమకారుడు గంగాధరం
- సేంద్రియ, ప్రకృతి సేద్యాల ప్రచారంలో రెండు దశాబ్దాల అలుపెరగని పయనం
 
 ఇప్పుడంటే చిన్న పట్టణాల్లో కూడా సేంద్రియ ఆహారోత్పత్తులు విక్రయించే షాపులు ఉన్నాయి. కొందరు వినియోగదారులు సేంద్రియ ఉత్పత్తులకు మాత్రమే ప్రాథాన్యం ఇస్తున్నారు. రసాయన సేద్యం చేసే రైతులు కూడా కుటుంబానికి సరిపడా ఆహారోత్పత్తులను సేంద్రియ లేదా ప్రకృతి సేద్య పద్ధతుల్లో పండించుకొని తింటున్నారు. రసాయన అవశేషాల్లేని ఆహారంపై నేడు తెలుగు గడ్డపై వెల్లివిరుస్తున్న చైతన్యానికి నారు పోసి నీరు పెట్టి పోషించిన తొలితరానికి చెందిన ఒకానొక పట్టువదలని విక్రమార్కుడు గంగాధరం..

 ఇరవై ఏళ్ల క్రితం.. సేంద్రియం అనే పదం తెలుగు నేలకు తెలియని రోజులవి. రసాయన సేద్యంతో కూనారిల్లుతున్న తెలుగు రైతుకు ఆనాడే సేంద్రియ పద్ధతులను పరిచయం చేశారు డాక్టర్ కోట గంగాధరం. చిత్తూరు జిల్లా పిచ్చాటూరు వుండలం చెంచురాజు కండ్రిగ ఆయన స్వగ్రామం. పశువుల సంఖ్య తగ్గి సేంద్రియ ఎరువుల లభ్యత తగ్గింది. రసాయన ఎరువులు విచ్చలవిడిగా వాడడంతో భూములు సారహీనమౌతున్నాయి. పురుగుమందుల వాడకంతో పంటలు విషతుల్యమై రైతులు, వినియోగదారుల జీవితాలు అతలాకుతలమౌతున్నాయి. ఆ దశలో ఆర్థిక శాస్త్రంలో పీహెచ్‌డీ (1992)  పూర్తిచేసిన ఆయన.. ఉద్యోగంలో చేరేకన్నా  రైతులకు ఉపయోగపడే పనేదైనా చేస్తే బాగుంటుందనుకున్నారు.

 తెలుగు నేలపై సేంద్రియ విప్లవానికి నాంది..
  ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలను కలిసిన ప్పుడు పంజాబ్ రైతులు వర్మికంపోస్టును వాడి మంచి ఫలితాలను సాధిస్తున్న విషయాన్ని వారు గంగాధరానికి చెప్పారు. దీంతో తను వెతుకుతున్న దారి ఇదేనని ఆయనకు అనిపించింది. కానీ గ్రామాల్లోకి వెళ్లి రైతులకు వివరించి చెప్పే ప్రయత్నం చేస్తే.. రైతులు సవాలక్ష ప్రశ్నలు వే సి విసిగించేవారు. కొన్నింటికి సమాధానం తెలియక రైతుల ముందు తెల్లమొహం వేయాల్సి వచ్చేది. వర్మీకంపోస్టుపై తొలి శిక్షణా శిబిరం 1994లో తిరుపతి ఎస్వీ వ్యవసాయ కాలేజ్‌లో ఏర్పాటు చేశారు. హాజరయిన 90 మందిలో 10 మంది రైతులు మాత్రమే యూనిట్లు ఏర్పాటు చేసుకున్నారు. వారిలో 5గురు మంచి దిగుబడులు పొందారు. పంట ఉత్పత్తులు రుచికరంగా ఉండటంతో పాటు నిల్వ ఉండే కాలం పెరిగింది. రసాయన ఎరువుల వాడకం తగ్గి రైతుకు ఖర్చు ఆదా అయ్యింది.

 ఆ తరువాత మండలానికి ఒక గ్రామం చొప్పున ఎంపిక చేసి రైతులకు వర్మికంపోస్టు తయారీపై శిక్షణనిచ్చేవారు. అక్కడికి ఈ ఐదుగురు సీనియర్ సేంద్రియ రైతులను వెంటబెట్టుకెళ్ల్లేవారు. రైతులు అడిగే సందేహాలను వారితోనే నివృత్తి చేయించేవారు. వర్మీ కంపోస్టు తయారీ, ఉపయోగాలను తెలిపే పుస్తకాలను ముద్రించి ఇచ్చేందుకు, యూనిట్ల ఏర్పాటుకు రుణాలను ఇచ్చేందుకు ఖాదీ కమిషన్ ముందుకువచ్చింది. క్రమంగా స్వచ్ఛంద సంస్థలు, రైతు నాయకులు శిక్షణనిచ్చేందుకు ఆహ్వానించాయి. ఈ నేపధ్యంలో గంగాధరం 1996లో వర్డ్ (వెల్ఫేర్ ఆర్గనైజేషన్ ఫర్ రూరల్ డెవలప్‌మెంట్) అనే స్వచ్ఛంద సంస్థను ఏర్పాటు చేసి రాష్ట్రమంతా తిరుగుతూ శిక్షణనిచ్చారు.

 1999లో ఆప్కాబ్ సహకారంతో రైతులకు శిక్షణ అందించారు. 2005లో ‘కపార్ట్’ ఆధ్వర్యంలో తిరుపతిలో 30 మందికి శిక్షణనిచ్చారు. అలా పదేళ్లలో సేంద్రియ వ్యవసాయం ప్రతి గ్రామాన్నీ స్పృశించింది. 2006 కల్లా వర్మీకంపోస్టు తయారీ, విక్రయం పెద్ద వ్యాపారంగా మారింది. వ్యాపారస్తులే వర్మికంపోస్టు లాభాల గురించి రైతులకు వివరించి, విక్రయించేవారు. ఇంక అందులో అందుకోవలసిన ఎత్తులేవీ లేవని గంగాధరం భావిస్తున్న సమయం అది.

 ఈ పూర్వరంగంలో 2007లో మహారాష్ట్ర నుంచి ప్రకృతి వ్యవసాయ పవనాలు కొత్తగా తెలుగు నేలకు తాకాయి.  అయితే, వర్మీ కంపోస్టు వాడకంపై పాలేకర్‌కు సదభిప్రాయం లేకపోవటంతో ‘వర్డ్’ ఆధ్వర్యంలో రైతులకు శిక్షణనిచ్చేందుకు తొలుత ఒప్పుకోలేదు. అయినా పట్టువిడువకుండా మూడురోజుల పాటు హైదరాబాద్‌లోనే ఉండి పాలేకర్‌ను ఒప్పించారు. 2007లో తిరుపతిలోని వెటర్నరీ కాలేజి ఆడిటోరియంలో రైతులకు మూడు రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. గంగాధరం కృషితో 500 మంది రైతులు హాజరయ్యారు. అప్పటికే గంగాధరానికి పదేళ్లుగా రైతులు, వ్యవసాయాధికారులతో ఉన్న పరిచయాల వల్ల ప్రకృతి వ్యవసాయం తెలుగు నేలలో వేళ్లూనుకుంది. సెప్టెంబర్ 11 నుంచి జరగబోయే పాలేకర్ శిక్షణా శిబిరంలోనూ గంగాధరం కీలకపాత్ర నిర్వహిస్తుండడం విశేషం.  

 ప్రకృతి వ్యవసాయ పాఠశాల..
 ఇప్పటికీ.. ఒక్కగంట ఖాళీ సమయం ఉన్నా గంగాధరం దగ్గర్లో ఉన్న కళాశాలకో.. పాఠశాలకో వెళతారు. అధ్యాపకుల అనుమతి తీసుకొని ప్రకృతి వ్యవసాయం గురించి విద్యార్థులకు వివరిస్తారు. ప్రకృతి వ్యవసాయంపై  శిక్షణనిచ్చేందుకు ఆయనే స్వయంగా ప్రకృతి వ్యవసాయ పాఠశాలను ఏర్పాటు చేశారు. నెలకు 30 మంది రైతులకు శిక్షణనిస్తున్నారు. రాష్ట్రంలోని ఆలయ భూవుుల్లో ప్రభుత్వం ప్రకృతి వ్యవసాయూనికి శ్రీకారం చుట్టింది. దీనికోసం ఆలయూల తరపున ఉద్యానవన శాఖకు చెందిన అధికారులకు గంగాధరమే శిక్షణనిచ్చారు.
 ఎక్కువ రోజులు స్వగ్రామంలో ఉండలేకపోవటంతో తన ఆరెకరాల పొలాన్ని  గంగాధరం కౌలుకు ఇచ్చేవారు. అయితే కౌలు రైతులు రసాయన సేద్యం చేస్తుండటంతో.. మూడేళ్లుగా ప్రకృతి సేద్యం ప్రారంభించారు. అయితే నిర్వహణ సులభంగా ఉండే పెసర, మినుము, సజ్జ వంటి పంటలను సాగు చేస్తున్నారు.  ప్రస్తుతం సాగు చేస్తున్న సజ్జలో ఎకరాకు 10 క్వింటాళ్ల దిగుబడి రావచ్చని భావిస్తున్నారు.            
 -  గురుస్వామి సాక్షి, పిచ్చాటూరు, చిత్తూరు జిల్లా
 
కుటుంబం అంతా కలిస్తేనే ప్రకృతి సేద్యం పండుగ...
 బీజామృతంతో విత్తనశుద్ధి, దుక్కిలో ఘన జీవామృతం వాడకం, రెండువారాలకోసారి నీటిద్వారా జీవామృతం అందించటం, అంతర పంటల సాగు, వాఫ్స వంటి విధానాలను ప్రకృతి సేద్యంలో తప్పనిసరిగా పాటించాలి. ఇవన్నీ చేయాలంటే తన కుటుంబ సభ్యుల సహకారం రైతుకు తప్పనిసరి. అందుకే ముందు కుటుంబ సభ్యులకు అవగాహన కల్పించాలి.
 - డాక్టర్ కోటపాటి గంగాధరం (98490 59573), ప్రకృతి వ్యవసాయ నిపుణులు,చెంచురాజు కండ్రిగ, పిచ్చాటూరు మండలం, చిత్తూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement