ప్రకృతి సేద్య బాటన ‘ముల్కనూర్’! | Papaya in the shade Ginger cultivation | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్య బాటన ‘ముల్కనూర్’!

Published Mon, Aug 1 2016 10:59 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ప్రకృతి సేద్య బాటన ‘ముల్కనూర్’! - Sakshi

ప్రకృతి సేద్య బాటన ‘ముల్కనూర్’!

డబ్బా మూత తీయటం.. నీటిలో కలిపి పంటలపై పిచికారీ చేయటం సులభంగా ఉండటంతో రైతులు పురుగుమందుల వాడకానికి అలవాటుపడ్డారు. కానీ.. మనసుపెట్టి అవగాహన చేసుకోవాలే గానే ప్రకృతి సేద్యాన్ని అంతే సులభంగా చేయవచ్చంటా రాయన. ఎలాంటి హడావుడి లేకుండా ప్రకృతి సేద్యంలో సునాయాసంగా వివిధ పంటలను సాగు చేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారాయన. బోరు బావిలో ఉన్న కొద్దిపాటి నీళ్లతోనే ప్రకృతి సేద్యం చేస్తూ తీవ్ర కరవు పరిస్థితుల్లోను తోటి రైతులకు స్ఫూర్తిని పంచుతున్న ఆ రైతు పేరు పడాల గౌతమ్.

కరీంనగర్ జిల్లా భీమదేవరపల్లి మండలం ముల్కనూర్ ఆయన స్వగ్రామం. దశాబ్దాలుగా రసాయనిక వ్యవసాయానికి పెట్టిందిపేరైన ముల్కనూర్‌లో ప్రకృతి సేద్యాన్ని తొలుత ప్రారంభించిన ఘనత గౌతమ్‌కే దక్కుతుంది.

తొలి అడుగు వేసిన సీనియర్ రైతు గౌతమ్
బొప్పాయి నీడలో అల్లం సాగు
కరువులోనూ కళకళలాడుతున్న బొప్పాయి
అంతర పంటలతో అధికాదాయం
వివిధ రకాల నూనెల పిచికారీతో తెగుళ్ల నివారణ

 
గౌతమ్ డిగ్రీ వరకు చదివారు. తమకున్న నాలుగెకరాల పొలంలో 2013 వరకు తమ గ్రామంలో మిగతా రైతుల్లానే రసాయన ఎరువులు, పురుగుమందులు వాడుతూ సేద్యం చేసేవారు. 2013లో హైదరాబాద్‌లో సుభాష్ పాలేకర్ నిర్వహించిన పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయం శిక్ష ణా తరగతులకు హాజర య్యారు. ప్రకృతి వ్యవసాయంతో రైతులకు కలిగే ప్రయోజనాలను అవగాహన చేసుకున్నారు. సొంత ఆవులు లేకపోవటంతో పొరుగు రైతుల వద్ద నుంచి గోమూత్రం, పేడను సేకరించి జీవామృతం తయారు చేసుకొని పంటలకు వాడారు.
 

ఎకరా వరితో రూ.54 వేల నికరాదాయం..
తొలి ప్రయత్నంగా 2014 ఖరీఫ్‌లో ఎకరం భూమిలో 1008 (సన్న రకం) వరి పంటను సాగు చేసి 36 బస్తాల దిగుబడి సాధించారు. బియ్యం విక్రయిస్తే రూ. 70 వేల ఆదాయం వచ్చింది. రూ. 16 వేల ఖర్చులు పోను రూ. 54 వేల నికరాదాయం లభించింది. రసాయన సేద్యంలో ఎకరాకు రూ. 10 వేల నికరాదాయం లభించటమే కష్టంగా ఉండేది. అలాంటిది తొలి ఏడాదే రూ. 50 వేలకు పైగా లాభం కళ్లజూడటంతో ప్రకృతి సేద్యంపై గురి కుదిరిందంటారు గౌతమ్.
 
ప్రకృతి సేద్యంలో అరెకరంలో అల్లం పంటను సాగు చేశారు. గతేడాది జూన్‌లో అల్లం దుంపలను బెడ్‌లపై విత్తుకున్నారు. రెండు అల్లం సాళ్ల మధ్యలో నీడ కోసం అలసంద, బొబ్బర్లను అంతర పంటలుగా సాగు చేశారు. ఇంటి అవసరాలకు సరిపడా దిగుబడి వచ్చింది. ఆగస్టులో మొక్కజొన్న, స్వీట్‌కార్న్‌లను అంతర పంటలుగా సాగు చేస్తే క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చింది. మొక్కల నీడలో ఉంటే అల్లం పంట ఎదుగుదల బావుండి, మంచి దిగుబడి వస్తుందని భావించి.. మొక్కజొన్న పంట పూర్తవ్వగానే నీడ కోసం అల్లం తోటలో బొప్పాయి సాగు చేయాలని నిర్ణయించుకున్నారు. తైవాన్ రెడ్ లేడీ బొప్పాయి మొక్కలను అక్టోబర్ మొదటి వారంలో నాటారు. మొక్కల మధ్య ఆరడుగులు, సాళ్ల మధ్య ఎనిమిదడుగుల దూరం ఉంచారు. అరెకరం అల్లం పంటలో 400 బొప్పాయి మొక్కలు నాటారు. న వంబర్‌లో మరో ఎకరంలో ఏక పంటగా బొప్పాయిని సాగు చేశారు.
 
పూత, కాతకు ‘మీనామృతం’!

లీటరు నీటికి 5 ఎం. ఎల్. చొప్పున ప్రత్యేకంగా తయారుచేసిన ‘మీనామృతా’న్ని కలిపి వారానికోసారి పిచికారీ చేసి పూత, పిందె రాలటాన్ని నివారిస్తున్నారు. నీటి పారకం, పిచికారీ ద్వారా పది రోజులకోసారి జీవామృతాన్ని మొక్కలకు అందిస్తారు. దశపత్ర కషాయం, మీనామృతంతో కలిపి వారానికోసారి పిచికారీ చేస్తారు. మొక్కలు నాటుకున్నప్పుడు, మూడు నెలల వయసున్నప్పుడు చెట్టుకు పావుకిలో చొప్పున ఘన జీవామృతం వేశారు.
 
ఈ ఏడాది ఏప్రిల్ నెలలో బొప్పాయిలో తొలి కాపు వచ్చింది. ఇప్పటి వరకు ఎనిమిది కోతలు వచ్చాయి. ఇంకా ఏడాదిన్నర వరకు పంట దిగుబడి వస్తుంది. ఎకరాకు 40 టన్నుల దిగుబడి రావచ్చని గౌతమ్ అంచనా వేస్తున్నారు. ఇప్పుడున్న ధరల ప్రకారం రూ. 2.80 వేల ఆదాయం వస్తుందని ఆయన అంచనా వేశారు. జీవామృతం, కషాయాల  తయారీ... పిచికారీ చేసిన కూలీలకు కలిపి రూ. 80 వేలు అయ్యింది. ఎకరంన్నర బొప్పాయి తోటకు రూ. 3 లక్షల నికరాదాయం వచ్చే అవకాశం ఉందని ఆయన తెలిపారు. కాయలను హైదరాబాద్ నుంచి వచ్చి వ్యాపారులు కొనుగోలు చేస్తున్నారు.

రసాయన సేద్యంలో పండించిన బొప్పాయి కాయకు రూ. 12 చెల్లిస్తుండగా ప్రకృతి సేద్యంలో పండించిన కాయలకు రూ. 20 చెల్లిస్తున్నారు. ప్రకృతి సేద్యంలో తొలి ఏడాది కూడా దిగుబడులు తగ్గకుండా గౌతమ్ జాగ్రత్తపడ్డారు. పాలేక ర్ సూచన మేరకు నాటినప్పుడు మొక్కకు పావు కిలో చొప్పున ఘన జీవామృతం అందించారు. దీంతో తొలి ఏడాదే బొప్పాయిలోనూ మంచి దిగుబడి వచ్చింది. అల్లం దిగుబడి 4 నెలల్లో చేతికొస్తుంది. ఎక్కువ శ్రమ అనే కారణంతో ప్రకృతి సేద్యం చేసేందుకు కొందరు రైతులు ఇష్టపడటం లేదు. అయితే, ప్రణాళిక రూపొందించుకుంటే ద్రావణాలు, కషాయాల తయారీ ఏమంత కష్టం కాదంటారు గౌతమ్.

నెలకు సరిపడా ద్రావణాల తయారీకి అవసరమయ్యే ప్లాస్టిక్ డ్రమ్ములను ముందుగానే కొనుక్కోవాలని, నెలలో ఒక్కరోజు(15 రోజులకో పూట) కేటాయించి ద్రావణాలు, కషాయాలను తయారు చేసుకుంటే చాలని గౌతమ్ సూచిస్తున్నారు. రైతుకు సమయం కలిసివస్తుంది. అవసరమైనప్పుడు వెతుక్కోనవసరం లేకుండా నేరుగా స్ప్రేయర్‌లో పోసుకుని పిచికారీ చేసుకోవచ్చంటారు గౌతమ్.  
- తాళ్ళపల్లి సురేందర్, సాక్షి, భీమదేవరపల్లి, కరీంనగర్ జిల్లా
 
నూనెలతో పల్లాకు తెగులు కట్టడి!
రసాయన సేద్యం చేస్తున్న సాటి రైతుల బొప్పాయి తోటలకు ఎల్లో మొజాయిక్ వైరస్ (పల్లాకు తెగులు)  ఆశించింది. అరికట్టేందుకు ఎన్ని రసాయనిక పురుగు మందులు పిచికారీ చేసినా ఫలితం లేకపోయింది. దిగుబడులు తగ్గి రైతులు తీవ్రంగా నష్టపోయారు. గౌతమ్ సాగు చేస్తున్న బొప్పాయి తోటలో కొన్ని మొక్కలకూ ఈ తెగులు ఆశించింది. అయితే, దశపర్ణి కషాయం, వివిధ రకాల నూనెలను క్రమం తప్పకుండా పిచికారీ చేసి వైరస్‌ను పొలమంతా వ్యాపించ కుండా గౌతమ్ అరికట్టారు.

200 లీటర్ల నీటిలో.. కిలో కొబ్బరి నూనెకు వేప, కానుగ, కొబ్బరి, విప్ప వంటి నూనెలను పావు కిలో చొప్పున కలిపి మూడు నెలలకోసారి ఎకరా తోటపై పిచికారీ చేస్తారు. ఆకులపై జిగటగా నూనె పొర ఏర్పడటం వల్ల రసం పీల్చే పురుగులు, చీడపీడలు ఆశించకుండా వికర్షకంగా పనిచే శాయి. దీని వల్ల పల్లాకు తెగులు ఉధృతి తగ్గింది. తోటి రైతుల తోటల్లో 70 నుంచి 80 శాతం పంటను ఆశించగా.. గౌతమ్ పొలంలో మాత్రం 10 శాతం పంటకే పరిమితమైంది. నూనెల పిచికారీ వల్ల చెట్లకు వివిధ పోషకాలు అందుతాయని ఆయన చెప్పారు.
 
సాగు ఖర్చు తగ్గుతుంది
దిగుబడి పెరుగుతుంది
ప్రకృతి సేద్యంలో పురుగుల కట్టడికి కషాయాలు, పోషకాల కోసం జీవామృతం వాడతాను. మిత్ర పురుగులు అభివృద్ధి చెంది చీడపీడల ఉధృతి తగ్గింది. రసాయన సేద్యంతో పోల్చితే ఖర్చు 75 శాతం మేరకు తగ్గుతుంది. జాగ్రత్తగా చేస్తే ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాదే దిగుబడి తగ్గకపోగా పెరుగుతుంది. ఈ ఉత్పత్తులకు మంచి గిరాకీ కూడా ఉంది. వచ్చే ఏడాది నుంచి బత్తాయిని కూడా ప్రకృతి సేద్యపద్ధతిలో సాగు చేయాలని అనుకుంటున్నాను. నన్ను చూసి మరో ఆరుగురు రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారు.
- పడాల గౌతమ్ (98497 12341), ముల్కనూర్, కరీంనగర్ జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement