పచ్చని ప్రపంచం కోసం...
ప్రకృతి కోసం...
‘ప్రణామం ప్రణామం ప్రణామం... సమస్త ప్రకృతికే ప్రణామం’ అని ఇటీవలి సినిమాలో ఓ హిట్ పాట. ప్రతి ఏటా జూన్ 5న వచ్చే ‘ప్రపంచ పర్యావరణ దినోత్సవం’ కూడా ఈ మాటనే అంటుంది. దానిని మొదలెట్టిన ఐక్యరాజ్య సమితి తన సభ్యులైన 143 దేశాలతో అదే మాటను అనిపిస్తుంది. సముద్ర జల కాలుష్యం, అధిక జనాభా, వన్యమృగాల పట్ల క్రూరత్వం తదితర అంశాలతో 1974లో మొదటిసారిగా మొదలైన పర్యావరణ దినోత్సవం ఏ ఏడాదికా ఏడాది ప్రపంచ దేశాల చైతన్యంతో పర్యావరణం పట్ల విశిష్ణ స్పృహను కలిగేలా చేస్తోంది.
ప్రతి సంవత్సరం ఒక థీమ్‌తో సాగే ఈ దినోత్సవానికి ఈ సంవత్సరం ఆతిథ్య దేశం కెనడా ‘కనెక్టింగ్ పీపుల్ టు నేచర్’ అనే థీమ్‌ను నిర్థారించింది. ఈ థీమ్‌ను అనుసరించి వివిధ దేశాలతో పాటు భారతదేశంలో కూడా సోమవారం అనేక కార్యక్రమాలు జరిగాయి.ముఖ్యంగా యువత ఉత్సాహంగా మొక్కలు నాటడం, ప్రదర్శనలు ఇవ్వడం చేసింది. పశ్చిమ బెంగాల్‌లో ఈ సందర్భంగా పర్యావరణ స్పృహను కలిగించే పోస్టల్ ఎన్వలప్‌ను విడుదల చేశారు. ఉత్తర ప్రదేశ్‌లోని మురాదాబాద్‌లో కాలేజీ యువతీ యువకులు పార్కులో లతలూ తీగలతో యోగా చేసి ఆకట్టుకున్నారు. గౌహతీ సమీపంలో ఉన్న దీవుల్లో కొత్తగా మొక్కలు నాటారు. గాలి, నీరు, నింగి అన్నీ మనిషి జీవనానికి ముఖ్యమైనవి. వాటిని కాపాడుకోవడానికి ఏదో ఒక రోజు చైతన్యంతో పని చేయడం కాదు... అనునిత్యం అనుక్షణం చేయాలి. అప్పుడు భవిష్యత్ తరాలకు ఈ అందమైన భూమిని అందివ్వగలం.