రైతు మిత్ర పంటలు! | Farmers crops allies! | Sakshi
Sakshi News home page

రైతు మిత్ర పంటలు!

Published Tue, Jul 12 2016 4:21 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

రైతు మిత్ర పంటలు! - Sakshi

రైతు మిత్ర పంటలు!

- పప్పు ధాన్య పంటలకు పెరుగుతున్న ఆదరణ   
- ఏకపంటల రసాయనిక సేద్యమే పప్పుధాన్య పంటలకు శాపం
- మిశ్రమ పంటల ప్రకృతి లేదా సేంద్రియ సేద్యంతోనే పప్పుధాన్యాలకు పెద్దపీట
- మెట్ట పొలాల్లో పక్కపక్కన సాళ్లలో చిరుధాన్యాలతోపాటు పప్పుధాన్యాల సాగే ఉత్తమం
 
 హరిత విప్లవం పేరిట ఏకపంటల రసాయనిక వ్యవసాయం ముఖ్యంగా వరి, గోధుమ పంటల సాగుపైనే పాలకుల దృష్టి కేంద్రీకృతమైన తర్వాత పప్పు ధాన్యాల పంటలు నిర్లక్ష్యానికి గురయ్యాయి. ఆహారంలో బియ్యం, గోధుమల తర్వాత అత్యధిక ప్రాథాన్యం కలిగినప్పటికీ పప్పు ధాన్యాల సాగు తగ్గిపోతూ వచ్చింది. అందువల్లనే పప్పుధాన్యాల సాగు ప్రాధాన్యాన్ని చాటుతూ ఐక్యరాజ్యసమితి 2016ను ‘అంతర్జాతీయ పప్పుధాన్యాల సంవత్సరం’గా ప్రకటించింది.

 ఇంతకీ, పప్పుధాన్యాల సాగులో ఏ పద్ధతి మేలైనది?
 కంది నారును పెంచి, మొక్కలను పొలంలో నాటి డ్రిప్ ద్వారా ఏకపంటగా రసాయనిక వ్యవసాయం చేయడం ఇటీవల అక్కడక్కడా కనిపిస్తోంది.

 అయితే, దేశ విదేశాల్లో పర్యావరణ హితమైన ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయ పద్ధతులు విరాజిల్లుతున్న పొలాలు, పండ్ల తోటల్లో అంతర పంటలుగా పప్పుధాన్య పంటలకు పెద్ద పీట వేస్తున్నారు.

 మెట్ట ప్రాంతాల్లో ఏక దళ పంటలైన సజ్జ, జొన్న, కొర్ర, రాగి వంటి చిరుధాన్య పంటలతోపాటు.. కందులు, మినుములు, పెసలు, ఉలవలు, అలసందలు తదితర ద్విదళ పంటలను పక్క పక్క సాళ్లలో రసాయనిక ఎరువులు వాడకుండా సాగు చేయడం ఉత్తమమని వివిధ దేశాల్లో ప్రకృతి వ్యవసాయదారుల అనుభవాలు చాటి చెబుతున్నాయి.

 మొక్కలు సాధారణంగా ఆకుల ద్వారా వాతావరణం నుంచి, వేళ్ల ద్వారా భూమి నుంచి ప్రాణావసరమైన పోషకాలను తీసుకొని పెరుగుతాయి. అయితే, పప్పుధాన్య పంట మొక్కల పరిస్థితి వేరు. భూమి నుంచి తీసుకున్న దాని కన్నా ఎక్కువ పోషకాలను తిరిగి భూమికి ఇస్తాయి.

 గాలిలో 97% నత్రజని ఉంది. నత్రజని పంటల సాగులో కీలకపాత్ర కలిగిన పోషకం. నత్రజనిని గాలి నుంచి గ్రహించి వేళ్ల ద్వారా భూమిని సారవంతం చేయడం పప్పుధాన్య పంట మొక్కల ప్రత్యేకత.

 ఐతే రసాయనిక ఎరువులు వేసిన పొలంలో పప్పుధాన్య పంట మొక్కల వేళ్ల ద్వారా నత్రజనిని భూమికి అందించే సహజ ప్రక్రియకు విఘాతం కలుగుతుంది. ఎందుకంటే.. గాలిలో నుంచి నత్రజనిని గ్రహించి భూమికి అందించే పనిని చూసుకునేది ప్రధానంగా రైజోబియం, బ్రాడీ రైజోబియం రకాల సూక్ష్మజీవులే. రసాయనిక ఎరువులు, కలుపుమందులు వంటి రసాయనాలు వాడటం వల్ల మట్టిలో నివసించే సూక్ష్మజీవరాశి దుంపనాశనమవుతోంది.

 అందుకే, ప్రకృతి లేదా సేంద్రియ వ్యవసాయంలో పప్పుధాన్య పంటలు తమ సహజ లక్షణాలతో విరాజిల్లుతూ చక్కని పంట దిగుబడులనివ్వడమే కాకుండా భూమిని సారవంతం చేస్తున్నాయి. జొన్న, సజ్జ, కొర్ర, రాగులు వంటి చిరుధాన్య పంటలతో పాటు అదే పొలంలో పక్క పక్కన సాళ్లలోనే పప్పుధాన్య పంటలను మిశ్రమ పంటలుగా సాగు చేయడమే ఇందుకు కారణం.

 వాతావరణ మార్పులకు వజ్రకవచం..
 ఆహారోత్పత్తి, ఆహార భద్రత, వాతావరణ మార్పులు అనేవి పరస్పర ఆధారితాలు. పప్పుధాన్యాల సంవత్సరం -2016 సందర్భంగా ఐక్యరాజ్య సమితికి చెందిన ఆహార, వ్యవసాయ సంస్థ (ఎఫ్.ఎ.ఓ.) చెబుతున్న విషయాల్లో రైతులు, పాలకులు గమనించాల్సినవి  ఇవీ..
వాతావరణ మార్పుల ప్రభావంతో ప్రపంచ ఆహార భద్రత పెను సవాళ్లను ఎదుర్కొంటోంది. ఈ క్లిష్ట పరిస్థితులను అధిగమించే శక్తి పప్పుధాన్యాల సాగుతో ఒనగూడుతుంది  విశ్వవ్యాప్తంగా 47 కోట్ల ఎకరాల్లో సాగవుతున్న పప్పుధాన్యపు పంటల వల్ల భూమిలో 70 లక్షల టన్నుల నత్రజని స్థిరీకరణ జరుగుతోంది.

ఆమేరకు రసాయన ఎరువుల వాడకం తగ్గి పరోక్షంగా ఉద్గారాల కాలుష్యం తగ్గుతున్నది  ఏకపంటల విధానంలో కన్నా అంతర పంటలు, పంట మార్పిడి వంటి పద్ధతుల్లో పప్పు ధాన్యాలను సాగు చేస్తే నేలలో ఎక్కువ కర్బన స్థిరీకరణ జరుగుతుంది. నేలలో రకరకాల సూక్ష్మజీవుల సంఖ్య పెరుగుతుంది  పప్పుధాన్యపు మొక్కల వేళ్లు భూమిలో లోతుకు వెళ్లటం వల్ల బెట్ట పరిస్థితులను తట్టుకుంటాయి. వీటి వేర్లు లోతుకు వెళతాయి.  మిశ్రమ పంటలుగా సాగు చేసినప్పుడు ఇవి నీటి కోసం ఇతర పంటలతో పోటీ పడవు  మాంసకృత్తులను, పోషకాలతో కూడిన పప్పుధాన్యాల సాగు సుస్థిర ఆహారోత్పత్తికి, పోషకాహారంతో కూడిన ఆహార భద్రతకు భరోసా ఇస్తుంది.  

 బ్రిటిష్ కొలంబియాలోని సాల్ట్ స్ప్రింగ్‌ఐస్‌ల్యాండ్‌కి చెందిన డాన్ జాసన్ గత 30 ఏళ్లుగా సేంద్రియ వ్యవసాయం చేస్తున్నారు. జన్యుమార్పిడి
 చే సిన విత్తనాల కన్నా సంప్రదాయ విత్తనాలతోనే  పలు ప్రయోజనాలున్నాయని ఆయన నమ్ముతున్నారు. మిశ్రమ పంటలుగా అపరాల సాగుతోనే భూతాపాన్ని తగ్గించగలమని జాసన్ అంటున్నారు.
 - సాగుబడి డెస్క్‌చీ

సేంద్రియ పశుపోషణపై 17న రైతులకు శిక్షణ
 సేంద్రియ పద్ధతిలో పశుపోషణ, పశువుల యాజమాన్యం, పునరుత్పత్తి వంటి అంశాలపై రైతునేస్తం ఫౌండేషన్ ఈనెల 17న శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తోంది. గుంటూరు జిల్లా పుల్లడిగుంట దగ్గరలోని కొర్నెపాడు గ్రామంలో ఉ. 9:30 గంటల నుంచి సా. 5 గంటల వరకు శిక్షణా కార్యక్రమం జరుగుతుంది. నిష్ణాతులైన శాస్త్రవేత్తలు, పశువైద్యులు శిక్షణ ఇస్తారు. ఆసక్తిగల పాడి రైతులు 0863-2286255, 83744 22599 నంబర్లలో సంప్రదించవచ్చు.
 
 29న గుంటూరులో దేశీ విత్తన సంబరం
 దేశీ విత్తనాల పరిరక్షణకు కృషి చేస్తున్న హరిత భారతి ట్రస్టు ఆధ్వర్యంలో ఈనెల 29న ద్వితీయ ఆంధ్రప్రదేశ్ దేశీ విత్తన సంబరం నిర్వహిస్తున్నది. గుంటూరు కూరగాయల మార్కెట్ సమీపంలోని శ్రీవెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఈ కార్యక్రమం జరుగుతుంది. తెలుగు రాష్ట్రాల రైతులు ఈ కార్యక్రమంలో పాల్గొని వివిధ పంటల దేశీ విత్తనాలు పొందవచ్చు. గత సంవత్సరం దేశీ విత్తనాలు తీసుకున్న రైతులు రెట్టింపు పరిమాణంలో తీసుకొచ్చి ఈ విత్తన సంబరంలో ఇతర రైతులకు అందిస్తారు. వివరాలకు నిర్వాహకుడు సీహెచ్ త్రినాథులును 0866-2550688, 81252 46688 నంబర్లలో సంప్రదించవ చ్చు. ప్రవేశం ఉచితం.
 
 30-31 తేదీల్లో తిరుచిరాపల్లిలో దేశవాళీ విత్తనోత్సవం
 తమిళనాడులోని తిరుచిరాపల్లిలో ఈ నెల 30-31 తేదీల్లో దేశీ విత్తనోత్సవం జరగనుంది. దేశవాళీ పప్పుధాన్యాలు, కూరగాయలు, చిరుధాన్యాల విత్తనాలను అందుబాటులో ఉంచుతారు. దేశీ వంగడాల పరిరక్షణకు కృషి చేస్తున్న పసుమాయ్ శిగరం నేచర్ ట్రస్ట్, క్రియేట్ (తమిళనాడు), సహజ సమృద్ధ (కర్నాటక) వంటి పలు స్వచ్ఛంద సంస్థలు కలిసి ఈ విత్తన ప్రదర్శన, అమ్మకం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాయి. తిరుచిరాపల్లి థిల్లాయ్ నగర్‌లోని ‘మక్కల్ మంద్రం’లో 30వ తేదీ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది.  ప్రవేశం ఉచితం. వసతి, భోజన ఏర్పాట్ల కోసం ముందుగా పేర్లు రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. వివరాల కోసం  ప్రవీణ్ (తమిళం, కన్నడ, ఇంగ్లిష్) - 080507 43047, యోగనాథన్ (తమిళం, హిందీ) - 094449 46489లను ఫోన్ ద్వారా లేదా praveendspc@gmail.com ద్వారా సంప్రదించవచ్చు.
 
 31 నుంచి పర్మాకల్చర్‌పై 14 రోజుల శిక్షణ
 పొలాల్లో సేంద్రియ పంటలు పండించే రైతైనా, పెరట్లో లేదా మేడపైన సేంద్రియ ఇంటిపంటల సాగుదారులైనా పర్యావరణహితమైన సేద్యానికి సంబంధించిన మౌలిక అంశాలపై లోతైన అవగాహన కలిగి ఉండటం అవసరం. పర్మాకల్చర్ (పర్మినెంట్ + అగ్రికల్చర్ = శాశ్వత వ్యవసాయం) అందుకు ఉపకరిస్తుంది. శాశ్వత వ్యవసాయ నిపుణులు జి .సాయి ప్రసన్న కుమార్ పర్మాకల్చర్ పద్ధతులపై  రెండు వారాల డిజైన్ సర్టిఫికెట్ (రెసిడెన్షియల్) కోర్సును నిర్వహిస్తున్నారు. ప్రతి రోజూ 5-7 గంటల పాటు తరగతులు జరుగుతాయి. జూలై 31 నుంచి ఆగస్టు 13 వరకు 14 రోజుల పాటు హైదరాబాద్‌లోని నాగోల్‌లో తరగతులు జరుగుతాయి.
 వివరాలకు.. సాయిని 99514 52345 నంబర్‌లో సంప్రదించవచ్చు.
 
 ఉల్లి రైతు శ్రమ తగ్గించే ఆవిష్కరణ
 - ఉల్లి నారు నాటే పరికరాన్ని తయారుచేసిన మహారాష్ట్ర రైతు శాస్త్రవేత్త
 - మొక్కలు నాటడంతోపాటు ఒకేసారి ఎరువు వేయడం, బోదెలు కూడా చేయొచ్చు
 - ఎకరంలో మూడు గంటల్లో ఈ పనులన్నీ పూర్తి చేయొచ్చు  
 
 సమస్యలను సరికొత్త ఆలోచనలతో ఎప్పటికప్పుడు అధిగమించగలిగితేనే వ్యవసాయంలో రాణించగలం అనే తత్వాన్ని ఒంటబట్టించుకున్న ఆధునిక రైతు శాస్త్రవేత్త పండరినాథ్ సర్జేరావ్ మోరే. మహారాష్ట్ర అహ్మద్‌నగర్ జిల్లాలోని సంఘవి భూసర్ ఆయన స్వస్థలం. ఉల్లి నారును నాటేందుకు అదునులో కూలీలు దొరక్క రైతులు ఇబ్బందులు పడటం కద్దు. దీన్ని అధిగ మించేలా.. ఉల్లి నారును నాటటం, ఎరువులు వేయటం, నీటి బోదెల ఏర్పాటు వంటి మూడు పనులను ఒకేసారి పూర్తిచేసే పరికరాన్ని పండరీనాథ్ రూపొందించారు. దీని వల్ల అధిక శ్రమ,  సమయం వృథాను నివారించవచ్చు. ఈ ఆవిష్కరణకుగాను నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ జాతీయ అవార్డుతో ఆయన్ను సత్కరించింది. ఈ పరికరం 1.5 మీ. వెడల్పు ఉంటుంది. బరువు 3.5 టన్నులు. 8 గొర్రులు ఉంటాయి. 25 హెచ్. పి. సామర్థ్యం గల ట్రాక్టర్‌తో ఇది పనిచేస్తుంది. ట్రాక్టర్ ముందుకు కదులుతుంటే విత్తే పరికరానికి బిగించి ఉన్న పళ్ల చక్రం కదులుతూ పెట్టెలో ఉన్న ఎరువు తగు మోతాదులో పైపుల ద్వారా సాళ్లలో పడుతుంది. పరికరానికి వెనుక అమర్చిన గొర్రుల ద్వారా నీటి బోదెలు పూర్తవటంతో పాటు సాళ్లలో కలుపు మొక్కలు ధ్వంసమవుతాయి.

  పరికరంపై నలుగురు కూలీలు కూర్చొని నారును నాళికల్లో వేస్తే భూమిలో 1 సెం. మీ. లోతులో నాటుతుంది. సాళ్లమధ్య 18, మొక్కల మధ్య 9 సెం. మీ. ఎడం ఉంటుంది. నారు సమాన లోతులో పడేందుకు రెండు వైపులా రెండు చక్రాలను అమర్చారు. మామూలుగా నాటితే మొక్కల సాంధ్రత ఎకరాకు 1.50 లక్షలు కాగా ఈ పరికరంతో విత్తితే 2 లక్షలకు పైగా ఉంటుంది. నారు మొక్కలు చక్కగా వేళ్లూనుకుంటాయి. నారు నాటేందుకు నలుగురు కూలీలు సరిపోతారు. ఎకరంలో విత్తనం, ఎరువు వేసుకోవటం, నీటి బోదెలు చేయటం వంటి అన్ని పనులు మూడు గంటల్లో పూర్తవుతాయి. తృణధాన్యాలు, అపరాల విత్తనాలను ఈ పరికరంతో విత్తుకోవచ్చు. ఎరువులు వేసే పరికరంతో కలిపి దీని ధర రూ. 70 వేలు. 15 రోజుల్లో తయారు చేసి ఇస్తారు. పండరీనాథ్‌ను 099608 68195 ఫోను నంబరులో లేదా ఈమెయిల్ : ఞ్చఛీజ్చిటజ్చ్టీజిఝౌట్ఛఃట్ఛఛీజీజజఝ్చజీ.ఛిౌఝ ద్వారా సంప్రదించవచ్చు.  
 - దండేల కృష్ణ, సాగుబడి డెస్క్
 
 జీరో బడ్జెట్ ‘జిబ్బర్లిక్ యాసిడ్’!
 ఉద్యాన తోటల్లో దిగుబడులు పెంపొందించుకునేందుకు ప్రపంచ వ్యాప్తంగా రసాయన వ్యవసాయంలో రైతులు జిబ్బర్లిక్ యాసిడ్‌ను విస్త్రృతంగా వాడుతున్నారు. దీని ధర కిలో రూ.15 - 25 వేల వరకు ఉంది. సేంద్రియ, ప్రకృతి సేద్యం చేసే రైతులు రసాయనాలను పిచికారీ చేయరు. దీనివల్ల వారు జిబ్బర్లిక్ ఆసిడ్‌తో కలిగే  ప్రయోజనాలను కోల్పోవలసిందేనా అనే ప్రశ్న తలెత్తుతుంది. అలాంటి అవసరమే లేదంటున్నారు పంజాబ్‌లోని హోషియాపూర్‌కు చెందిన ప్రకృతి వ్యవసాయ దారులు. రైతులు రసాయనాల్లేకుండానే జిబ్బర్లిక్ ఆసిడ్‌ను సులభంగా తయారు చేసుకునే విధానాన్ని వారు కనుగొని, వినియోగిస్తున్నారు.

పశువుల పేడతో తయారు చేసిన 5 కిలోల పిడకలను తీసుకోవాలి. ప్లాస్టిక్ డ్రమ్ము లేదా నీడన ఉన్న తొట్టిలో 18-20 లీటర్ల నీరు పోసి ఈ పిడకలను నీటిలో వేసి 4-5 రోజులు నానబెట్టాలి. వడపోసిన ఆ ద్రావణం మొత్తాన్నీ 100 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేసుకుంటే చక్కని గ్రోత్ ప్రమోటర్‌గా పనిచేస్తుంది. ఇది ఖర్చు లేనిదే కాకుండా పర్యావరణ హితమైనది కూడా. అంతగా ఖర్చు లేకుండా రైతులే స్వంతంగా దీన్ని తయారు చేసుకొని వాడుకొని ప్రయోజనం పొందవచ్చని హోషియాపూర్ రైతులు తమ అనుభవంగా చెబుతున్నారు. మనమూ తొలుత కొన్ని చెట్లపై ప్రయత్నించి చూద్దామా?
 
 ప్రకృతి సేద్యంపై కోర్సు
 ప్రకృతి వ్యవసాయంపై నార్వేజియన్ లైఫ్ సెన్సైస్ యూనివర్శిటీతో కలిసి కోల్‌కతా విశ్వవిద్యాలయానికి చెందిన సెంటర్ ఫర్ పొలినేషన్ స్టడీస్ ఆర్నెల్ల సర్టిఫికెట్ కోర్సును నిర్వహిస్తున్నది. శిక్షార్థులకు పలు అంశాలపై అవగాహన కల్పించడంతోపాటు స్వయంగా ప్రకృతి వ్యవసాయ పనులు చేయిస్తారు. గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సైన్స్ డిగ్రీ కలిగిన వారు అర్హులు. సెప్టెంబర్ 1 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కోర్సుకు సంబంధించిన పూర్తి వివరాల కోసం http://cpscu.in/?p=846 వెబ్‌సైట్ చూడవచ్చు. ఆసక్తిగల వారు  తమ దరఖాస్తును agroecology.cps @gmail.com ద్వారా జూలై 15లోగా పంపాలి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement