
మా కుక్కనే పొయ్యద్దంటావా... డిష్యూం!
ఉత్తరప్రదేశ్‌లోని బరేలి జిల్లాలో చిన్న విషయమై చెలిరేగిన వివాదం కాల్పుల వరకు వెళ్లి.. నలుగురు గాయపడ్డారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పూరన్ లాల్ అనే వ్యక్తి బజరియా పట్టణంలోని అన్నపూర్ణాదేవి గుడికి వెళ్లాడు. అతడు తన స్కూటీని ఆలయం వెలుపల పార్కింగ్ చేశాడు. మున్నాయాదవ్ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క.. అటువైపుగా వెళ్తూ ఆ స్కూటీ మీద మూత్రం పోసింది. దాంతో పూరన్ లాల్ అభ్యంతరం వ్యక్తం చేశారు.
అలా ఎలా చేస్తారంటూ మున్నాను అడిగారు. దాంతో ఇద్దరి మధ్య గొడవ మొదలైంది. దాంతో కోపం వచ్చిన మున్నా, అతడి కొడుకు కలిసి కాల్పులు మొదలుపెట్టారు. ఆ కాల్పులలో పూరన్ లాల్, అతడి కొడుకులు విజయ్ కుమార్, ముకేష్ కుమార్‌లతో పాటు రాంకిశోర్ శర్మ అనే మరో వ్యక్తి గాయపడ్డారు. వాళ్లందరినీ వెంటనే చికిత్స కోసం ఆస్పత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. ఆ నలుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందన్నారు. ఘటన జరిగిన వెంటనే నిందితులు అక్కడినుంచి పరారయ్యారు.