కొండచరియలు పడే ప్రాంతంగా గుర్తింపు
జీఎస్‌ఐ పరిశోధనలో వెల్లడి
రైల్వేకు తరచూ భారీ నష్టం
పర్యాటక రంగంపైనా ప్రభావం
ఐరన్‌మెష్‌లు, రాక్ రివిటింగ్‌తో పరిష్కారం
అందాల అరకులోయకు దేశంలోనే ఓ ప్రత్యేక స్థానం ఉంది. సహజ సౌందర్యం, ప్రకృతి రమణీయతతో పర్యాటకులను తనవైపు ఆకర్షిస్తుంది. ఇప్పుడు ఆ ప్రాంతం ప్రకృతి వైపరీత్యాల ప్రభావిత ప్రాంతాల్లో చేరింది. దేశంలో కొండచరియలు విరిగిపడే ప్రాంతాల్లో ఒకటిగా రికార్డుల్లోకి ఎక్కింది. ఇదే ఇప్పుడు పర్యాటక ప్రియుల్లో ఒకింత అలజడి రేపుతోంది. దీంతో అరకులోయ బెరుకులోయగా మారుతోంది.
విశాఖపట్నం: తూర్పు కనుమల్లో ఉన్న అరకులోయ ప్రాంతం వివిధ రకాల స్వభావాన్ని కలిగి ఉంది. కోండలైట్ రకానికి చెందిన గార్నెట్, సిలిమినేట్, నైస్ వంటి పలచటి రాళ్ల సముదాయంతో ఉంటుంది. ఈ రాళ్లు బలంగా ఉండవు. బండరాళ్ల మధ్య కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం సిలికేటు కలిసి ఉంటాయి. వర్షాలొచ్చినప్పుడు అవి కరిగిపోయి, బండరాళ్లు జారిపోతుంటాయి. వీటిని అడ్డుకోవడం ఎవరి తరమూ కాదు. అరకులోయ ప్రాంతంలో వర్షాకాలంలోనే కాదు.. భారీ వానలు కురిసినప్పుడల్లా కొండచరియలు విరిగిపడడం పరిపాటిగా మారింది. అలాంటి సమయంలో భారీగా ఆస్తి, ప్రాణనష్టాలు సంభవిస్తున్నాయి. పదేళ్ల క్రితం 2006లో అరకు సమీపంలోని కోడిపుంజువలస గ్రామంలో వర్షానికి భారీగా కొండచరియలు విరిగిపడి 18 మంది మృత్యువాతపడ్డారు. 2014లో హుద్‌హుద్ తుపాను సమయంలో అరకు ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి ఐదుగురు దుర్మరణం పాలయ్యారు. ఇంకా చిన్నా చితకా ప్రమాదాలు జరుగుతూనే ఉన్నాయి. మరోపక్క కొత్తవలస-కిరండోల్ (కేకే) లైనుపై ఈ కొండచరియలు తరచూ విరిగిపడుతూ రైల్వేకి పెను నష్టాన్ని తెస్తున్నాయి. రోజుకు సగటున ఈ లైనులో రెండు పాసింజరు రైళ్లు, 50 గూడ్స్‌రైళ్లు ఐరన్ ఓర్ లోడు (రోజంతా లక్షల టన్నుల బరువు)తో రాకపోకలు సాగిస్తున్నాయి.
భారీ వర్షాలు కురిసినప్పుడు వాటి అదురు/ఒత్తిడికి టన్నెల్స్ వద్ద ఉన్న కొండచరియలు రైల్వే లైనుపైన, ఆ సమయంలో ప్రయాణించే రైళ్లపై పడుతున్నాయి. దీంతో లైన్లతో పాటు రైళ్లు దెబ్బతింటున్నాయి. రోజుల తరబడి రైలు సర్వీసులను రద్దు చేయాల్సి వస్తోంది. దీంతో రైల్వే రూ.కోట్లలో నష్టపోతోంది. తాజాగా ఈ నెల 19న బొర్రా-చిముడుపల్లిల మధ్య కొండచరియలు గూడ్స్ రైలుపై పడడంతో మూడు ఇంజన్లు, రెండు బోగీలు ధ్వంసమయ్యాయి. లైను బాగా దెబ్బతింది. అదే పాసింజరు రైలుపై పడితే ఎంతటి ప్రమాదం వాటిల్లేదో? ఇటీవల కాలంలో కొండచరియలు పడడం మునుపటికంటే అధికమవుతోంది. ఇదే ఇప్పుడు అన్ని వర్గాలను ఆందోళనకు గురిచేస్తోంది.
ముప్పు జాబితాలోకి..
దేశంలోని కొండచరియలు విరిగిపడే అవకాశాలున్న ప్రాంతాల్లో మన అరకులోయ కూడా చేరింది. జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (జీఎస్‌ఐ) దేశంలోని వివిధ ప్రాంతాల్లో పరిశోధనలు జరిపింది. దేశంలో 0.42 మిలియన్ చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కొండచరియలు విరిగిపడే ప్రాంతంగా గుర్తించింది. ఇందులో సిక్కిం, హిమాచల్‌ప్రదేశ్, ఉత్తరాఖండ్, జమ్మూకాశ్మీర్, తమిళనాడు, కేరళ, గోవా, మహరాష్ట్రలతో పాటు ఆంధ్రప్రదేశ్‌లోని అరకును కూడా చేర్చింది. అరకు ప్రాంతంలో 0.01 మిలియన్ చదరపు కిలోమీటర్ల వ్యాసార్థంలో కొండచరియలు జారిపడే ప్రదేశం ఉన్నట్టు తొలిసారిగా తేల్చింది.
రైళ్ల మార్గంలోనే కాదు రోడ్డు మార్గంలోనూ కొండచరియలు పడుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాక విదేశీ పర్యాటకులు అరకుతోపాటు మన్యం అందాలను చూడడానికి పోటీ పడతారు. ఇలా ఏటా ... లక్షల మంది పర్యాటక ప్రియులు వస్తుంటారు. వీరిలో అత్యధికులు పాసింజరు రైలులోనే వెళ్లి తిరుగు ప్రయాణంలో మరో వాహనంలో వస్తారు. ఆ సమయంలో కొండచరియలు జారిపడితే వాటిల్లే ప్రమాదాన్ని ఊహించడమే కష్టమవుతుంది.
రివిట్‌మెంట్‌తో పరిష్కారం
కేకే లైన్‌లో కొండచరియలు విరిగిపడడం అధికమవుతోంది. ముఖ్యంగా టన్నెల్స్ వద్ద ఇలాంటివి ఎక్కువగా సంభవిస్తున్నాయి. రాళ్ల మధ్య అంతగా పట్టులేని కాల్షియం, మెగ్నీషియం, అల్యూమినియం సిలికేటు ఉండడం వల్ల భారీ వర్షాల వేళ బండరాళ్లు జారిపడుతున్నాయి. వీటిని అదుపు చేయడానికి రాళ్లతో రివిటింగ్, లేదా ఐరన్ మెష్‌లతో కట్టడి చేయడం ఒక్కటే మార్గం. ఉదాహరణకు విజయవాడలోని కనకదుర్గ అమ్మవారి కొండ నుంచి బండరాళ్లు జారిపడకుండా ఐరన్ మెష్‌లను కట్టారు. కేకే లైన్‌లో దాదాపు 70-80 టన్నెళ్ల వద్ద ఇలాంటి మెష్‌లను ఏర్పాటు చేయాలి. లేదంటే రాళ్లతో రివిటింగ్ చేయాలి. రాబోయే వర్షాకాలంలో ఇలాంటి ప్రమాదాలు మరింత ఎక్కువయ్యే అవకాశం ఉంది. కొండచరియల వల్ల ఎలాంటి ప్రాణ, ఆస్తినష్టం ముందుజాగ్రత్త చర్యలు చేపట్టాలి.
-సంపత్‌కుమార్, జియో ఫిజిక్స్ విభాగాధిపతి, ఏయూ