వన్యప్రాణులతో సామరస్యపూర్వక జీవనానికి ఈ క్షేత్రం నిలువుటద్దం. పండించే పైరు, నేలలో జీవరాశిని ఇన్నాళ్లు రైతు నేస్తాలంటున్నారు. సమీప జనావాసాలపై విరుచుకుపడే అటవీ జంతువులు కూడా ప్రకృతిసేద్యం పుణ్యమాని ఇప్పుడు రైతు మిత్రులుగా మారాయి. ప్రకృతి సేద్యం గొప్పతనాన్ని ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రకృతిసేద్యంలో నేల బాగుపడటమే కాదు పర్యావరణ వ్యవస్థ యావత్తూ పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ తేయాకు క్షేత్రం.
అటవీ జంతువులకు ముఖ్య విహారయాత్రా స్థలంగా మారిన ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించిన ఆ అభ్యుదయ రైతు టెన్జింగ్ బోడోసా. అస్సాంలోని ఉదలగురి జిల్లా కచిబారీ అతని స్వగ్రామం. ప్రకృతి సేద్యంలో పర్యావరణ వ్యవస్థ సమతుల్యత ఏర్పడుతుందనటానికి తన పొలాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిపాడు. తండ్రి చనిపోవటంతో ఆరో తరగతిలో చదువు మానేసి మలేసియాకు చెందిన కన్‌స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. 2006లో తిరిగి ఇల్లు చేరి రసాయన సేద్యంలో టీ తోటల సాగు చేపట్టాడు. పురుగుమందుల పిచికారీతో తరచూ అస్వస్థతకు గురవ్వటం, కుంటలోని చేపలు చనిపోవటం అతన్ని ఆలోచనలో పడేశాయి. ప్రతి ఒక్కరూ టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అలాంటి వారికి టీతో పాటు కాస్త విషం కూడా ఇస్తున్నామా అని అంతరాత్మ నిలదీసినట్టనిపించేది.
కొంత అంతర్మథనం తరువాత సేంద్రియ పద్ధతుల్లో టీ తోటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2007లో సేంద్రియ తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించి అనతికాలంలోనే నాణ్యమైన పంటను అధిక దిగుబడిని సాధించాడు. అస్సాం రాష్ట్రంలోనే తొలి సేంద్రియ తేయాకు రైతుగా గుర్తింపు పొందాడు. శ్రమకోర్చి అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలకు సేంద్రియ తేయాకును ఎగుమతి చేశాడు. ఏటా రూ. 60–70 లక్షల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. 30 వేల మంది రైతులకు సేంద్రియ తేయాకు తోటల సాగులో టెన్జింగ్ శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ప్రపంచంలోనే తొట్టతొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రాలుగా టñ న్జింగ్ టీ తోటలు గుర్తింపు పొందాయి.
అటవీ జంతువులకు ఆటపట్టు
అక్కడ తేయాకు తోటల రైతులు ఏనుగుల మందలను పొలాల్లోకి రాకుండా బెదర గొట్టేందుకు చెట్లను నరికి మంటలు వేయటం, కంచె వేయటం చేసేవారు. టెన్జింగ్ పొలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. అతను అటవీ జంతువులతో వైరానికి బదులు చెలిమిని పెంచుకున్నాడు. 7 ఎకరాల్లో సేంద్రియ తేయాకుతో పాటు రకరకాల పండ్లు, కూరగాయ పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగుచేయటం ద్వారా పర్యావరణ సమతుల్యం ఏర్పడింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అనేక అటవీ జంతువులు, పక్షులకు అతని పొలం ఆవాసంగా మారింది. అడవి పందులు, నెమళ్లు, జింకలకు అది ఇష్టమైన విహార స్థలం. అక్కడ జంతువులు అడవిలో ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. తోటలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వచ్చిపోయే అటవీ జంతువులతో పొలం కళకళలాడుతుంది.
బారులు తీరుతున్న పర్యాటకులు
ఏనుగులకయితే టెన్జింగ్ పొలం ముఖ్య విహార యాత్రా స్థలం గా మారింది. అవి ఇష్టంగా తినే వెదురు చెట్లను పొలం చుట్టూ నాటాడు. అక్కడ గడపటాన్ని ఏనుగులు అమితంగా ఇష్టపడతాయి. కొన్నిసార్లు 70–80 ఏనుగుల మందలు గుంపులు గుంపులుగా కలసి తోటలో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాటి తొక్కిసలాటల్లో కొంతమేర పంట నష్టం జరుగుతుంది. ఒకసారి అవి ఇంటిని కూడా నాశనం చేశాయి. ‘అయితే అడవి జంతువుల కోసం కూడా నేను పంటలను సాగు చేస్తున్నానని భావిస్తా.. అవి నా జీవితంలో సంతోషం నింపాయి’ అని మురిసిపోతారాయన. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు.
కొందరు నెలల తరబడి అక్కడే ఉంటారు. రెండేళ్ల క్రితం పొలంలో ఏనుగులమధ్య పోట్లాట జరిగింది. ఒక ఏనుగు చనిపోవటంతో టెన్జింగ్ పొలం వార్తల్లోకి వచ్చింది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ సంస్థ అధికారులు పొలాన్ని సందర్శించి.. ఆ తోటలో ఏనుగులు స్వేచ్ఛగా సంచరించటాన్ని చూసి సంతోషించారు. ప్రపంచంలోనే తొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రంగా టెన్జింగ్ తేయాకు తోటను ధ్రువీకరించారు. మనుషుల సుఖసంతోషాలకు దగ్గరి దారి ప్రకృతిని గౌరవించటం మాత్రమే అని టెన్జింగ్ తరచూ చెబుతుంటారు. ఆయన నమ్మకాన్ని అక్కడి అటవీ జంతువులు అనుక్షణం నిజం చేస్తుండటం ప్రకృతి సాక్షిగా ఒక అద్భుతం!
– సాగుబడి డెస్క్
.
Comments
Please login to add a commentAdd a comment