assam tea gardens
-
వేలంలో రికార్డ్ ధర పలికిన అస్సాం మనోహరి టీ పొడి.. కిలో ఎంతంటే..
దిస్పూర్: అమ్మాయిలు-అబ్బాయిలు, పేదవారు-ధనికులు, చిన్న- పెద్దవాళ్లు అనే ఏ తేడా లేకుండా అందరూ ఇష్టపడి తాగేది చాయ్(టీ).. మిగతా దేశాలతో పోలిస్తే భారతీయులకు టీ మీదున్న మక్కువ అంతా ఇంతా కాదు.. ఏ పనిలో ఉన్నా ఎక్కడున్న కచ్చితంగా రోజుకు ఒకసారైనా కప్పు టీ తాగాల్సిందే. టీ అనగానే గుర్తొచ్చిది అస్సాం రాష్ట్రం. ఎందుకంటే అక్కడ ఉత్పత్తయ్యే టీ పొడి ఎంతో ప్రత్యేకం. అస్సాంలో ఉత్పత్తి అయిన టీ పొడికి భలే డిమాండ్ ఉంటుంది. అందుకే ఏటా పలు సంస్థలు అరుదైన రకానికి చెందిన కొన్ని టీ పొడులను వేలం వేస్తాయి. ఈ క్రమంలో తాజాగా మనోహరి గోల్డ్ టీ తన రికార్డును తానే బద్దలు కొట్టి మరోసారి చరిత్ర సృష్టించింది. గువాహతి టీ ఆక్షన్ సెంటర్లో జరిగిన వేలంలో మనోహరి గోల్డ్ టీ కిలో టీ పొడి రూ. 99,999కు అమ్ముడుపోయింది. గతేడాది వేలంలో ఈ ధర రూ.75,000గా ఉంది. సౌరవ్ టీ ట్రేడర్స్అనే సంస్థ మంగళశారం ఉదయం కిలో టీ పొడిని రూ. 99,999కు కొనుగోలు చేసింది. చదవండి: షాకింగ్: బార్లో సీక్రెట్ రూమ్.. అద్దం పగలగొడితే 17 మంది యువతులు.. ఈ సందర్భంగా మనోహరి టీ ఎస్టేట్ యాజమాని రాజన్ లోహియామాట్లాడుతూ.. టీ వేలంలో మరోసారి చరిత్ర సృష్టించామన్నారు. టీ పొడి నాణత్యలో రాజీపడమని స్పష్టం చేశారు. అస్సాం టీకి కీర్తిని తెచ్చినందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. కాగా ప్రస్తుతం అస్సాంలో మొత్తం 800కి పైగా టీ తోటలు ఉన్నాయి. ఏటా 650 మిలియన్ కిలోల టీని అసోం ఉత్పత్తి చేస్తుంది. ఇది దేశంలోని టీ ఉత్పత్తిలో 52 శాతం. చదవండి: రోడ్డు ప్రమాదానికి గురైన ఆరోగ్యశాఖ మంత్రి .. ఆసుపత్రికి తరలింపు -
డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ 21 మంది
-
డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో దారుణం..!
గువాహటి : అసోంలోని టియోక్ టీ ఎస్టేట్‌లో డాక్టర్ అందుబాటులో లేకపోవడంతో సోమ్రా మాఝి (33) అనే మహిళా కార్మికురాలు మృతి చెందింది. దాంతో ఆమె కుటుంబ సభ్యులు, తోటి కార్మికులు సదరు మహిళ మృతికి డాక్టరే కారణమంటూ ఆగ్రహావేశాలకు లోనయ్యారు. డాక్టర్ దేవెన్ దత్తా (73) ఆస్పత్రికి చేరుకోగానే దాదాపు 250 మంది మూకుమ్మడిగా దాడికి తెగబడ్డారు. అయితే, టీతోటలో ఘర్షణపూరిత వాతావరణం నెలకొందని తెలుసుకున్న పోలీసులు ఆయనకు రక్షణ కల్పించారు. కానీ, అప్పటికే సమయం మించిపోయింది. మూక దాడిలో ఆయన తీవ్రంగా గాయపడ్డారు. ఆస్పత్రికి తరలిస్తుండగా డాక్టర్ దేవెన్ దత్తా మార్గమధ్యంలో మృతి చెందారు. ఈ ఘటన గత శనివారం జోర్హాత్ జిల్లాలో చోటుచేసుకుంది. డాక్టర్‌పై దాడికి పాల్పడ్డ 21 మందిని అరెస్టు చేశామని పోలీసులు తెలిపారు. డాక్టర్ దేవెన్ దత్తాపై జరిగిన అమానుష దాడితో వైద్య సంఘాలు భగ్గుమన్నాయి. రిటైర్ అయ్యాక కూడా ప్రజలకు సేవ చేస్తున్న సీనియర్ డాక్టర్‌కు ఇలాంటి గతి పట్టించారని ఆగ్రహం వ్యక్తం చేశాయి. ఘటనను తీవ్రంగా ఖండిస్తూ ఇండియన్ మెడికల్ అసోషియేషన్ మంగళవారం బంద్‌కు పిలుపునిచ్చింది. అత్యవసర సేవల్ని కూడా నిలుపుదల చేస్తున్నామని ప్రకటించింది. -
అటవీ జంతువుల ఆత్మీయ క్షేత్రం!
వన్యప్రాణులతో సామరస్యపూర్వక జీవనానికి ఈ క్షేత్రం నిలువుటద్దం. పండించే పైరు, నేలలో జీవరాశిని ఇన్నాళ్లు రైతు నేస్తాలంటున్నారు. సమీప జనావాసాలపై విరుచుకుపడే అటవీ జంతువులు కూడా ప్రకృతిసేద్యం పుణ్యమాని ఇప్పుడు రైతు మిత్రులుగా మారాయి. ప్రకృతి సేద్యం గొప్పతనాన్ని ఇదీ అని ప్రపంచానికి ఎలుగెత్తి చాటుతున్నాయి. ప్రకృతిసేద్యంలో నేల బాగుపడటమే కాదు పర్యావరణ వ్యవస్థ యావత్తూ పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనటానికి ప్రత్యక్ష సాక్ష్యం ఈ తేయాకు క్షేత్రం. అటవీ జంతువులకు ముఖ్య విహారయాత్రా స్థలంగా మారిన ఆ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని సృష్టించిన ఆ అభ్యుదయ రైతు టెన్జింగ్ బోడోసా. అస్సాంలోని ఉదలగురి జిల్లా కచిబారీ అతని స్వగ్రామం. ప్రకృతి సేద్యంలో పర్యావరణ వ్యవస్థ సమతుల్యత ఏర్పడుతుందనటానికి తన పొలాన్ని ప్రత్యక్ష ఉదాహరణగా నిలిపాడు. తండ్రి చనిపోవటంతో ఆరో తరగతిలో చదువు మానేసి మలేసియాకు చెందిన కన్స్ట్రక్షన్ కంపెనీలో పనికి కుదిరాడు. 2006లో తిరిగి ఇల్లు చేరి రసాయన సేద్యంలో టీ తోటల సాగు చేపట్టాడు. పురుగుమందుల పిచికారీతో తరచూ అస్వస్థతకు గురవ్వటం, కుంటలోని చేపలు చనిపోవటం అతన్ని ఆలోచనలో పడేశాయి. ప్రతి ఒక్కరూ టీతోనే తమ రోజును ప్రారంభిస్తారు. అలాంటి వారికి టీతో పాటు కాస్త విషం కూడా ఇస్తున్నామా అని అంతరాత్మ నిలదీసినట్టనిపించేది. కొంత అంతర్మథనం తరువాత సేంద్రియ పద్ధతుల్లో టీ తోటలను సాగు చేయాలని నిర్ణయించుకున్నాడు. 2007లో సేంద్రియ తేయాకు తోటల పెంపకాన్ని ప్రారంభించి అనతికాలంలోనే నాణ్యమైన పంటను అధిక దిగుబడిని సాధించాడు. అస్సాం రాష్ట్రంలోనే తొలి సేంద్రియ తేయాకు రైతుగా గుర్తింపు పొందాడు. శ్రమకోర్చి అమెరికా, జర్మనీ వంటి పలు దేశాలకు సేంద్రియ తేయాకును ఎగుమతి చేశాడు. ఏటా రూ. 60–70 లక్షల ఆదాయం ఆర్జించే స్థాయికి చేరుకున్నాడు. 30 వేల మంది రైతులకు సేంద్రియ తేయాకు తోటల సాగులో టెన్జింగ్ శిక్షణ ఇచ్చారు. అంతేకాదు ప్రపంచంలోనే తొట్టతొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రాలుగా టñ న్జింగ్ టీ తోటలు గుర్తింపు పొందాయి. అటవీ జంతువులకు ఆటపట్టు అక్కడ తేయాకు తోటల రైతులు ఏనుగుల మందలను పొలాల్లోకి రాకుండా బెదర గొట్టేందుకు చెట్లను నరికి మంటలు వేయటం, కంచె వేయటం చేసేవారు. టెన్జింగ్ పొలం అటవీ ప్రాంతాన్ని ఆనుకొని ఉంది. అతను అటవీ జంతువులతో వైరానికి బదులు చెలిమిని పెంచుకున్నాడు. 7 ఎకరాల్లో సేంద్రియ తేయాకుతో పాటు రకరకాల పండ్లు, కూరగాయ పంటలను కలిపి మిశ్రమ పంటలుగా సాగుచేయటం ద్వారా పర్యావరణ సమతుల్యం ఏర్పడింది. అనుకూలమైన వాతావరణం ఏర్పడటంతో అనేక అటవీ జంతువులు, పక్షులకు అతని పొలం ఆవాసంగా మారింది. అడవి పందులు, నెమళ్లు, జింకలకు అది ఇష్టమైన విహార స్థలం. అక్కడ జంతువులు అడవిలో ఉన్నట్టే ప్రవర్తిస్తాయి. తోటలో స్వేచ్ఛగా సంచరిస్తాయి. వచ్చిపోయే అటవీ జంతువులతో పొలం కళకళలాడుతుంది. బారులు తీరుతున్న పర్యాటకులు ఏనుగులకయితే టెన్జింగ్ పొలం ముఖ్య విహార యాత్రా స్థలం గా మారింది. అవి ఇష్టంగా తినే వెదురు చెట్లను పొలం చుట్టూ నాటాడు. అక్కడ గడపటాన్ని ఏనుగులు అమితంగా ఇష్టపడతాయి. కొన్నిసార్లు 70–80 ఏనుగుల మందలు గుంపులు గుంపులుగా కలసి తోటలో తిరుగుతుంటాయి. అప్పుడప్పుడు వాటి తొక్కిసలాటల్లో కొంతమేర పంట నష్టం జరుగుతుంది. ఒకసారి అవి ఇంటిని కూడా నాశనం చేశాయి. ‘అయితే అడవి జంతువుల కోసం కూడా నేను పంటలను సాగు చేస్తున్నానని భావిస్తా.. అవి నా జీవితంలో సంతోషం నింపాయి’ అని మురిసిపోతారాయన. ఈ అద్భుతాన్ని వీక్షించేందుకు ప్రపంచ దేశాల నుంచి ఏటా వందల మంది పర్యాటకులు వస్తారు. కొందరు నెలల తరబడి అక్కడే ఉంటారు. రెండేళ్ల క్రితం పొలంలో ఏనుగులమధ్య పోట్లాట జరిగింది. ఒక ఏనుగు చనిపోవటంతో టెన్జింగ్ పొలం వార్తల్లోకి వచ్చింది. ‘వరల్డ్ వైల్డ్ లైఫ్ ఫండ్’ సంస్థ అధికారులు పొలాన్ని సందర్శించి.. ఆ తోటలో ఏనుగులు స్వేచ్ఛగా సంచరించటాన్ని చూసి సంతోషించారు. ప్రపంచంలోనే తొలి ఏనుగుల స్నేహపూర్వక వ్యవసాయ క్షేత్రంగా టెన్జింగ్ తేయాకు తోటను ధ్రువీకరించారు. మనుషుల సుఖసంతోషాలకు దగ్గరి దారి ప్రకృతిని గౌరవించటం మాత్రమే అని టెన్జింగ్ తరచూ చెబుతుంటారు. ఆయన నమ్మకాన్ని అక్కడి అటవీ జంతువులు అనుక్షణం నిజం చేస్తుండటం ప్రకృతి సాక్షిగా ఒక అద్భుతం! – సాగుబడి డెస్క్ . -
బ్రిటన్ దేహంలో జపాన్ ఆత్మ
జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి. హరూకీ మురకామీ(జపాన్), గూగీ వా థియోంగ్(కెన్యా) లాంటివారిని వెనక్కు నెట్టి, జపాన్ మూలాలున్న బ్రిటన్ రచయిత కజువో ఇషిగురోను ఈ యేడు నోబెల్ వరించింది. బాగా అమ్ముడుపోయే పుస్తకాలు రాసి వాటికి పురస్కారాల్ని సైతం పొందే రచయితలు కొద్ది మందే ఉంటారు. అలాంటివారిలో కజువో ఇషిగురో ఒకరు. 1986, 1989, 2000, 2005లలో నాలుగు సార్లు బుకర్ ప్రైజ్ గెలుచుకున్న 62 ఏళ్ల కజువో ఇషిగురో ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు బాధిత నగరమైన జపాన్‌లోని నాగసాకిలో జన్మించాడు (8 నవంబరు 1954). ఇషిగురో అంటే శిల లేదా నలుపు అని అర్థం. ఆయన తండ్రి షిజువో ఇషిగురో సముద్ర విజ్ఞానంలో ప్రవీణుడు. అణుబాంబు విధ్వంసాన్ని యుక్త వయస్సులో తట్టుకుని బ్రతికింది తల్లి షిజుకో. తన ప్రావీణ్యత మీద నమ్మకంతో ఇషిగురో తండ్రి జపాన్ను వదిలి, మరో ఇద్దరు కుమార్తెలతో బాటు, 5 ఏళ్ల పసివాడైన కజువోను వెంటబెట్టుకుని, 1960లో దక్షిణ ఇంగ్లాండ్‌లో ఒక చిన్న పట్టణమైన గిల్డ్ ఫోర్డ్ సర్రేకు వలస వచ్చాడు. తాత్కాలిక ఉద్యోగమే అయినా, పొడిగింపులతో సాగడంతో వారి కుటుంబం అక్కడే స్థిరపడింది. 9–10 ఏళ్ల వయస్సులో స్థానిక గ్రంథాలయంలో ఇష్టంగా చదువుకున్న షెర్లాక్ హోమ్స్ పుస్తకాలే ఇషిగురోకు సాహిత్యంలో అభిరుచికి కారణమైనాయి. 1970 నాటికి నిరాశ్రయులకు గృహ నిర్మాణ హక్కుల కోసం ఆదర్శ సామాజిక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 15వ సంవత్సరం నుండీ ఒక హాబీగా మొదలైన పాటలు రాయడం నవలా ప్రక్రియకు బాగా పనికొచ్చిందని ఇషిగురో నమ్మకం. ఉత్తమ పురుషలో శ్రోతలను ఉద్దేశించి పాడటాన్ని నవలల్లో సైతం కొనసాగించాడు. ‘ద పేల్ వ్యూ ఆఫ్ హిల్స్’ ఆయన తొలి నవల. ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న ఒక మధ్య వయస్కురాలైన జపానీ వితంతువు, నాగసాకీలోని తన జీవితం, కుటుంబపు ఆలోచనలతో నెమ్మదిగా తన కూతురు ఆత్మహత్య తెలుసుకునే వరకూ సాగే నవల. సర్వసమ్మతంగా అందరి ప్రశంసలు పొందింది. 27 సంవత్సరాల వయస్సులో ప్రచురించబడ్డ ఈ మొదటి నవలకు వచ్చిన ఆదరణ ఫలితంగా గ్రాంటా సంస్థ 1983లో అప్పటి యువ బ్రిటిష్ రచయితలతో తెచ్చిన ప్రత్యేక కథల సంకలనంలో కజువో ఇషిగురోను కూడా చేర్చింది. జులియన్ బార్నెస్, పాట్ బార్కర్, సల్మాన్ రష్ది లాంటి వారి రచనలు అందులో ఉండటం ఇషిగురో సాహిత్య ప్రయాణానికి ఎంతగానో పనికొచ్చింది. అప్పటినుండీ ఏర్పడిన అనుబంధంతో ఇషిగురోకు నోబెల్ ప్రకటించిన వెంటనే అభినందనలు తెలిపిన వారిలో సల్మాన్ రష్దీ ముందున్నారు. అది మొదలు ప్రతీ అయిదేళ్లకు ఇషిగురో పుస్తకాలు రావడం మొదలయింది. రెండవ నవల 1986లో వచ్చిన ‘ఏన్ ఆర్టిస్ట్ ఆఫ్ ద ఫ్లోటింగ్ వరల్డ్’. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌లోని ఒక వయస్సు మళ్ళిన చిత్రకారుడు తన పూర్వ అతిక్రమణల మూలంగా కుమార్తె వివాహంలో పడుతున్న కష్టాల్ని వివరించడం అందులోని వృత్తాంతం. నాగసాకి నేపథ్యంతో వచ్చిన మొదటి రెండు నవలలూ తన జ్ఞాపకాల నుండి అందులోని విషయాలు చెరగిపోకముందే రాశానని ఆయనే చెప్పుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అవి తమ జీవిత చరిత్రలు కావనీ, తాను తూర్పు పడమరల వారధిగా చెప్పుకునే డాంబికుడ్ని కాదనీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ నవల విడుదలయిన ఏడాదే తనతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పనిచేసిన లోర్నా మక్డొగల్ను పెళ్లి చేసుకున్నాడు. వారికొక కూతురు. నవోమీ. 32 ఏళ్ల వయస్సులో కేవలం నాలుగు వారాల్లో పూర్తి చేసిన నవల ‘ద రిమైన్స్ ఆఫ్ ద డే’ ఇషిగురోకు బుకర్ ప్రైజ్‌తో పాటు అత్యంత పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టింది. అదే పేరుతో అద్భుతమైన చలనచిత్రంగా కూడా 1993లో రూపొందింది. ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో బట్లర్ గా పనిచేసిన స్టీవెన్స్ తన అనుభవాల్ని వివరించిన కథనం అది. పదిలక్షల కాపీలకు పైగా అమ్ముడుపోవడం నవల పాఠకాదరణను తెలియజేస్తుంది. కలలా సాగే అధివాస్తవిక నవల ‘ద అన్ కన్సోల్డ్’ను 1995లో రాశాడు. యూరప్‌లో పేరు చెప్పని ఒక నగరంలో ఒక వారాంతంలో పియానో వాయించే వ్యక్తి వృత్తాంతం ఇది. 500 పేజీలకు మించిన, చైతన్యస్రవంతిలో సాగిన అసాధారణ కథ. అలాగే 20వ శతాబ్దం ప్ర«థమార్థంలో షాంఘైలో మొదలై ప్రాంతాలు, కాలాలు మారుతూ సాగే ఒక ప్రయోగాత్మక డిటెక్టివ్ నవల 2000 సంవత్సరంలో వచ్చిన ‘వెన్ వియ్ వెర్ ఆర్ఫన్స్’. 1990 ప్రాంతపు ఇంగ్లాండ్‌లోని స్థానభ్రంశం చెందిన వసతి విద్యాలయంలోని ప్రేమికుల విషాద స్థితుల్ని సైన్స్ ఫిక్షన్ రూపంలో రాసిన నవల 2005లో వచ్చిన ‘నెవర్ లెట్ మీ గో’. ఇది కూడా చలనచిత్రంగా రూపొందింది. 1923 నుండి 2005 వరకూ వచ్చిన వంద గొప్ప ఆంగ్ల నవలల్లో ఇదీ ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2008లో టైమ్స్ పత్రిక 1945 నుండీ ఎన్నుకున్న 50 మంది బ్రిటిష్ మహా రచయితల్లో 32వ రచయితగా ఇషిగురోను గుర్తించింది. తెరమరుగన్నది ఎలా ఇప్పటివరకూ చరిత్ర, కల్పన, వాస్తవాలను జోడించుకుంటూ సాగుతుందో తెలియజెప్పే నవల 2015లో వచ్చిన ‘ద బరీడ్ జెయింట్’. తప్పిపోయిన కొడుకు కోసం తమ గ్రామాన్ని వదిలి, ఆశగా వెతుకుతూ వెళ్లే వృద్ధ దంపతుల ఫాంటసీ కథ ఇది. ఇషిగురో రచనలు మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న ఊహలను అద్భుతమైన భావోద్వేగాల సమ్మిశ్రమంతో వెల్లడి చేస్తాయని నోబెల్ బహుమతి ప్రదాతలు కొనియాడారు. ఉద్వేగాలు ఉండటం బలహీనత కాదు, ఉద్వేగాల్ని నియంత్రించుకునే సామర్థ్యం ఉండటం గౌరవంగానూ, లక్షణమైనదిగానూ బ్రిటిష్ జపాన్ సమాజాలు భావిస్తాయని ఆయనే వెల్లడించారు. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి. అమెరికా ప్రసిద్ధ జాజ్ గాయకురాలు స్టాసీ కెంట్కు ఆయన గీతాలు రాసిచ్చేవారు. గిటార్ వాయించే నేర్పు కూడా ఉంది. వారి భాగస్వామ్యంలో వచ్చిన ‘బ్రేక్ ఫాస్ట్ ఆన్ ద మార్నింగ్ ట్రామ్’ అన్న ఆల్బమ్ ఫ్రాన్స్‌లో కూడా విశేషంగా అమ్ముడుపోయింది. 2016లో నోబెల్ బహుమతి వరించిన బాన్ డిలాన్ను ఈ రంగంలో తన హీరోగా చెప్పుకుంటాడు. తన అనుభవాలను ఎక్కువగా పాటల్లోనే నిక్షిప్తం చేస్తాడు. ప్రదర్శన సమయాల్లో పదాలు, సంగీతం మధ్య సంబంధాల సజీవత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేడు. సినిమాలకూ, టీవీకీ స్క్రిప్ట్ రచయిత కూడా. మనసంతా నిండి ఉన్న అవే భావాలతో ఆయన నవలలు ఉంటాయని ఒక విమర్శ ఉంది. జ్ఞాపకాల భ్రమ, మృత్యువు, కాలపు చెమర్చే స్వభావం ఇవన్నీ పునరావృతమవుతూనే ఉంటాయి. ఆయన రచనలు జేన్ ఆస్టిన్, ఫ్రాంజ్ కాఫ్కాల మిశ్రమం అనీ, దానికి మార్సెల్ ప్రూస్ట్‌ను కొద్దిగా అద్దాలనీ నోబెల్ ప్రదాతలు వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ వాస్తవంలోకి ఆయన పాఠకుడిని తీసుకుపోతాడు. అది భవిష్యత్తు కావచ్చు, వర్తమానం కావచ్చు, లేదా గతం కావచ్చు, ఆ ప్రాంతం సమస్తం పాఠకులు నిజం అనుకుంటారు. అవి వింతైనవి అయినా సరదాగా గడిపేవీ కావు, ఉండేవీ కావు, వేటికో జోడించుకునేవీ కావు, అయినా అందులోని పాత్రలతో అమితంగా మమేకమవుతారు. అస్సామీ చాయ్ అంటే ఇషిగురోకు అమితమైన ఇష్టం. జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది. తల్లి ఇప్పటికీ పాతకాలపు జపాన్ స్త్రీలానే ఉంటుంది. ఇంటిలో ఉన్న వాతావరణం మూలంగా జపాన్ను తల్లిదండ్రుల కళ్లతో ఎప్పుడూ చూడగలుగుతుంటాడు. - ముకుంద రామారావు 9908347273 -
టీ తోటల కూలీలకూ బ్యాంకుల్లోనే జీతాలు!
పెద్దనోట్ల రద్దు ప్రభావం అసోంలోని టీ తోటల మీద కూడా గట్టిగానే పడింది. ఇన్నాళ్లూ అక్కడ కూలీలకు వారానికి ఒకసారి జీతాలు నగదురూపంలోనే చెల్లించగా.. ఇప్పుడు వాళ్లందరికీ ఆన్లైన్ చెల్లింపులు చేయబోతున్నారు. అసోంలో ఉన్న మొత్తం 850 టీ తోటలలో దాదాపు 10.5 లక్షల మంది పనిచేస్తుంటారు. వాళ్లందరికీ ఇప్పుడు జనధన యోజన అకౌంట్లు తెరిపించారు. గోలాఘాట్ జిల్లాలో తొలిసారిగా టీ కార్మికులకు బ్యాంకుల ద్వారా జీతాలు ఇస్తున్నారు. దాంతో వాళ్లంతా తమ జీతాలు డ్రా చేసుకోడానికి ఏటీఎంలకు వెళ్లాల్సి ఉంటుంది. ఇప్పటివరకు బ్యాంకు ముఖం కూడా చూడని తమకు అక్కడ అకౌంట్లు ఇవ్వడం చాలా సంతోషంగా ఉందని.. అయితే, ప్రస్తుత పరిస్థితుల్లో డబ్బులు చేతిలో లేకపోతే ఎలాగని టీ తోటల కార్మికులు అంటున్నారు. దాదాపు 200 ఏళ్లుగా వాళ్లు ప్రతి శనివారం ఆ వారానికి సంబంధించిన జీతం తీసుకుని సంతలో సరుకులు కొనుక్కుని ఇళ్లకు వెళ్తారు. మళ్లీ సోమవారం తెల్లవారుజామునే 5 గంటలకు పనికి వస్తారు. వీళ్లందరికీ కూడా ఖాతాలు తెరిపించాలని అసోం సీఎం సర్బానంద సోనోవాల్ బ్యాంకర్లకు సూచించారు. వాళ్లంతా ఇబ్బంది పడకుండా డబ్బులు డ్రా చేసుకోడానికి వీలుగా తగినన్ని ఏటీఎంలు కూడా ఏర్పాటు చేయాలన్నారు. అన్ని బ్యాంకులూ ఇప్పుడు టీ తోటల సమీపంలోనే ఏటీఎంలు ఏర్పాటుచేస్తాయని, అందువల్ల అక్కడ వాళ్లు మాత్రమే డబ్బులు తీసుకునే అవకాశం ఉంటుందని స్టేట్‌బ్యాంక్ చీఫ్ జనరల్ మేనేజర్ పీవీఎస్ఎన్ఎల్ మూర్తి చెప్పారు. దాంతోపాటు బ్యాంకింగ్ కరస్పాండెంట్ల ద్వారా స్వైపింగ్ మిషన్ల సాయంతో కూడా వాళ్లు డబ్బులు ఇప్పిస్తామన్నారు. ప్రత్యేక శిబిరాల్లో కార్మికులకు బ్యాంకు ఖాతాలు తెరుస్తున్నామన్నారు. టీ కార్మికులకు రోజుకు 115-130 రూపాయల వరకు కూలీ ఉంటుంది. అయితే వీళ్లందరికీ సరిపడ సొమ్మును ఏటీఎంలు, స్వైపింగ్ మిషన్లతో ఇప్పిస్తారా అనేది ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది.