బ్రిటన్‌ దేహంలో జపాన్‌ ఆత్మ | Nobel winner Kazuo Ishiguro likes Assam tea | Sakshi
Sakshi News home page

బ్రిటన్‌ దేహంలో జపాన్‌ ఆత్మ

Published Mon, Oct 9 2017 12:36 AM | Last Updated on Mon, Oct 9 2017 8:47 AM

Nobel winner Kazuo Ishiguro likes Assam tea

2017 నోబెల్‌ సాహిత్య పురస్కార గ్రహీత కజువో ఇషిగురో

జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి.

హరూకీ మురకామీ(జపాన్‌), గూగీ వా థియోంగ్‌(కెన్యా) లాంటివారిని వెనక్కు నెట్టి, జపాన్‌ మూలాలున్న బ్రిటన్‌ రచయిత కజువో ఇషిగురోను ఈ యేడు నోబెల్‌ వరించింది. బాగా అమ్ముడుపోయే పుస్తకాలు రాసి వాటికి పురస్కారాల్ని సైతం పొందే రచయితలు కొద్ది మందే ఉంటారు. అలాంటివారిలో కజువో ఇషిగురో ఒకరు.

1986, 1989, 2000, 2005లలో నాలుగు సార్లు బుకర్‌ ప్రైజ్‌ గెలుచుకున్న 62 ఏళ్ల కజువో ఇషిగురో ప్రపంచంలో మొట్టమొదటి అణుబాంబు బాధిత నగరమైన జపాన్‌లోని నాగసాకిలో జన్మించాడు (8 నవంబరు 1954). ఇషిగురో అంటే శిల లేదా నలుపు అని అర్థం. ఆయన తండ్రి షిజువో ఇషిగురో సముద్ర విజ్ఞానంలో ప్రవీణుడు. అణుబాంబు విధ్వంసాన్ని యుక్త వయస్సులో తట్టుకుని బ్రతికింది తల్లి షిజుకో. తన ప్రావీణ్యత మీద నమ్మకంతో ఇషిగురో తండ్రి జపాన్‌ను వదిలి, మరో ఇద్దరు కుమార్తెలతో బాటు, 5 ఏళ్ల పసివాడైన కజువోను వెంటబెట్టుకుని, 1960లో దక్షిణ ఇంగ్లాండ్‌లో ఒక చిన్న పట్టణమైన గిల్డ్‌ ఫోర్డ్‌ సర్రేకు వలస వచ్చాడు. తాత్కాలిక ఉద్యోగమే అయినా, పొడిగింపులతో సాగడంతో వారి కుటుంబం అక్కడే స్థిరపడింది.

9–10 ఏళ్ల వయస్సులో స్థానిక గ్రంథాలయంలో ఇష్టంగా చదువుకున్న షెర్లాక్‌ హోమ్స్‌ పుస్తకాలే ఇషిగురోకు సాహిత్యంలో అభిరుచికి కారణమైనాయి. 1970 నాటికి నిరాశ్రయులకు గృహ నిర్మాణ హక్కుల కోసం ఆదర్శ సామాజిక ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నాడు. 15వ సంవత్సరం నుండీ ఒక హాబీగా మొదలైన పాటలు రాయడం నవలా ప్రక్రియకు బాగా పనికొచ్చిందని ఇషిగురో నమ్మకం. ఉత్తమ పురుషలో శ్రోతలను ఉద్దేశించి పాడటాన్ని నవలల్లో సైతం కొనసాగించాడు. ‘ద పేల్‌ వ్యూ ఆఫ్‌ హిల్స్‌’ ఆయన తొలి నవల. ఇంగ్లాండ్‌లో నివసిస్తున్న ఒక మధ్య వయస్కురాలైన జపానీ వితంతువు, నాగసాకీలోని తన జీవితం, కుటుంబపు ఆలోచనలతో నెమ్మదిగా తన కూతురు ఆత్మహత్య తెలుసుకునే వరకూ సాగే నవల. సర్వసమ్మతంగా అందరి ప్రశంసలు పొందింది.

27 సంవత్సరాల వయస్సులో ప్రచురించబడ్డ ఈ మొదటి నవలకు వచ్చిన ఆదరణ ఫలితంగా గ్రాంటా సంస్థ 1983లో అప్పటి యువ బ్రిటిష్‌ రచయితలతో తెచ్చిన ప్రత్యేక కథల సంకలనంలో కజువో ఇషిగురోను కూడా చేర్చింది. జులియన్‌ బార్నెస్, పాట్‌ బార్కర్, సల్మాన్‌ రష్ది లాంటి వారి రచనలు అందులో ఉండటం ఇషిగురో సాహిత్య ప్రయాణానికి ఎంతగానో పనికొచ్చింది. అప్పటినుండీ ఏర్పడిన అనుబంధంతో ఇషిగురోకు నోబెల్‌ ప్రకటించిన వెంటనే అభినందనలు తెలిపిన వారిలో సల్మాన్‌ రష్దీ ముందున్నారు.

అది మొదలు ప్రతీ అయిదేళ్లకు ఇషిగురో పుస్తకాలు రావడం మొదలయింది. రెండవ నవల 1986లో వచ్చిన ‘ఏన్‌ ఆర్టిస్ట్‌ ఆఫ్‌ ద ఫ్లోటింగ్‌ వరల్డ్‌’. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత జపాన్‌లోని ఒక వయస్సు మళ్ళిన చిత్రకారుడు తన పూర్వ అతిక్రమణల మూలంగా కుమార్తె వివాహంలో పడుతున్న కష్టాల్ని వివరించడం అందులోని వృత్తాంతం. నాగసాకి నేపథ్యంతో వచ్చిన మొదటి రెండు నవలలూ తన జ్ఞాపకాల నుండి అందులోని విషయాలు చెరగిపోకముందే రాశానని ఆయనే చెప్పుకున్నాడు. అయితే అందరూ అనుకున్నట్టు అవి తమ జీవిత చరిత్రలు కావనీ, తాను తూర్పు పడమరల వారధిగా చెప్పుకునే డాంబికుడ్ని కాదనీ కూడా చెప్పుకోవాల్సి వచ్చింది. ఈ నవల విడుదలయిన ఏడాదే తనతోపాటు సామాజిక కార్యక్రమాల్లో పనిచేసిన లోర్నా మక్డొగల్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికొక కూతురు. నవోమీ.

32 ఏళ్ల వయస్సులో కేవలం నాలుగు వారాల్లో పూర్తి చేసిన నవల ‘ద రిమైన్స్‌ ఆఫ్‌ ద డే’ ఇషిగురోకు బుకర్‌ ప్రైజ్‌తో పాటు అత్యంత పేరు ప్రతిష్టల్ని తెచ్చి పెట్టింది. అదే పేరుతో అద్భుతమైన చలనచిత్రంగా కూడా 1993లో రూపొందింది. ప్రపంచ యుద్ధాల మధ్యకాలంలో బట్లర్‌ గా పనిచేసిన స్టీవెన్స్‌ తన అనుభవాల్ని వివరించిన కథనం అది. పదిలక్షల కాపీలకు పైగా అమ్ముడుపోవడం నవల పాఠకాదరణను తెలియజేస్తుంది.

కలలా సాగే అధివాస్తవిక నవల ‘ద అన్‌ కన్సోల్డ్‌’ను 1995లో రాశాడు. యూరప్‌లో పేరు చెప్పని ఒక నగరంలో ఒక వారాంతంలో పియానో వాయించే వ్యక్తి వృత్తాంతం ఇది. 500 పేజీలకు మించిన, చైతన్యస్రవంతిలో సాగిన అసాధారణ కథ. అలాగే 20వ శతాబ్దం ప్ర«థమార్థంలో షాంఘైలో మొదలై ప్రాంతాలు, కాలాలు మారుతూ సాగే ఒక ప్రయోగాత్మక డిటెక్టివ్‌ నవల 2000 సంవత్సరంలో వచ్చిన ‘వెన్‌ వియ్‌ వెర్‌ ఆర్ఫన్స్‌’.

1990 ప్రాంతపు ఇంగ్లాండ్‌లోని స్థానభ్రంశం చెందిన వసతి విద్యాలయంలోని ప్రేమికుల విషాద స్థితుల్ని సైన్స్‌ ఫిక్షన్‌ రూపంలో రాసిన నవల 2005లో వచ్చిన ‘నెవర్‌ లెట్‌ మీ గో’. ఇది కూడా చలనచిత్రంగా రూపొందింది. 1923 నుండి 2005 వరకూ వచ్చిన వంద గొప్ప ఆంగ్ల నవలల్లో ఇదీ ఒకటిగా పేరు తెచ్చుకుంది. 2008లో టైమ్స్‌ పత్రిక 1945 నుండీ ఎన్నుకున్న 50 మంది బ్రిటిష్‌ మహా రచయితల్లో 32వ రచయితగా ఇషిగురోను గుర్తించింది. తెరమరుగన్నది ఎలా ఇప్పటివరకూ చరిత్ర, కల్పన, వాస్తవాలను జోడించుకుంటూ సాగుతుందో తెలియజెప్పే నవల 2015లో వచ్చిన ‘ద బరీడ్‌ జెయింట్‌’. తప్పిపోయిన కొడుకు కోసం తమ గ్రామాన్ని వదిలి, ఆశగా వెతుకుతూ వెళ్లే వృద్ధ దంపతుల ఫాంటసీ కథ ఇది.

ఇషిగురో రచనలు మనుషుల్లో అంతర్లీనంగా ఉన్న ఊహలను అద్భుతమైన భావోద్వేగాల సమ్మిశ్రమంతో వెల్లడి చేస్తాయని నోబెల్‌ బహుమతి ప్రదాతలు కొనియాడారు. ఉద్వేగాలు ఉండటం బలహీనత కాదు, ఉద్వేగాల్ని నియంత్రించుకునే సామర్థ్యం ఉండటం గౌరవంగానూ, లక్షణమైనదిగానూ బ్రిటిష్‌ జపాన్‌ సమాజాలు భావిస్తాయని ఆయనే వెల్లడించారు. సరస్సు స్థిర ఉపరితలం చూసి దాని అడుగున అల్లకల్లోలాల్ని అంచనా వేయలేనట్టుగా ఆయన రచనలు ఉంటాయి.

అమెరికా ప్రసిద్ధ జాజ్‌ గాయకురాలు స్టాసీ కెంట్‌కు ఆయన గీతాలు రాసిచ్చేవారు. గిటార్‌ వాయించే నేర్పు కూడా ఉంది. వారి భాగస్వామ్యంలో వచ్చిన ‘బ్రేక్‌ ఫాస్ట్‌ ఆన్‌ ద మార్నింగ్‌ ట్రామ్‌’ అన్న ఆల్బమ్‌ ఫ్రాన్స్‌లో కూడా విశేషంగా అమ్ముడుపోయింది. 2016లో నోబెల్‌ బహుమతి వరించిన బాన్‌ డిలాన్‌ను ఈ రంగంలో తన హీరోగా చెప్పుకుంటాడు. తన అనుభవాలను ఎక్కువగా పాటల్లోనే నిక్షిప్తం చేస్తాడు. ప్రదర్శన సమయాల్లో పదాలు, సంగీతం మధ్య సంబంధాల సజీవత్వాన్ని మెచ్చుకోకుండా ఉండలేడు. సినిమాలకూ, టీవీకీ స్క్రిప్ట్‌ రచయిత కూడా.

మనసంతా నిండి ఉన్న అవే భావాలతో ఆయన నవలలు ఉంటాయని ఒక విమర్శ ఉంది. జ్ఞాపకాల భ్రమ, మృత్యువు, కాలపు చెమర్చే స్వభావం ఇవన్నీ పునరావృతమవుతూనే ఉంటాయి. ఆయన రచనలు జేన్‌ ఆస్టిన్, ఫ్రాంజ్‌ కాఫ్కాల మిశ్రమం అనీ, దానికి మార్సెల్‌ ప్రూస్ట్‌ను కొద్దిగా అద్దాలనీ నోబెల్‌ ప్రదాతలు వ్యాఖ్యానించారు. ప్రత్యామ్నాయ వాస్తవంలోకి ఆయన పాఠకుడిని తీసుకుపోతాడు. అది భవిష్యత్తు కావచ్చు, వర్తమానం కావచ్చు, లేదా గతం కావచ్చు, ఆ ప్రాంతం సమస్తం పాఠకులు నిజం అనుకుంటారు. అవి వింతైనవి అయినా సరదాగా గడిపేవీ కావు, ఉండేవీ కావు, వేటికో జోడించుకునేవీ కావు, అయినా అందులోని పాత్రలతో అమితంగా మమేకమవుతారు.

అస్సామీ చాయ్‌ అంటే ఇషిగురోకు అమితమైన ఇష్టం. జపాన్‌తో బలీయమైన భావోద్వేగ బంధనాలు ఉన్న కారణంగా, వెనక్కి తిరిగి వెళ్లిపోయి ఉంటే ఏమయ్యేది అనే విషయం ఆయన్ని ఒక నీడలా వెన్నాడుతూ ఉంటుంది.  తల్లి ఇప్పటికీ పాతకాలపు జపాన్‌ స్త్రీలానే ఉంటుంది. ఇంటిలో ఉన్న వాతావరణం మూలంగా జపాన్‌ను తల్లిదండ్రుల కళ్లతో ఎప్పుడూ చూడగలుగుతుంటాడు.

- ముకుంద రామారావు
9908347273

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement