నులి పురుగులతో పెను కష్టం! | Huge trouble with Nematodes worm | Sakshi
Sakshi News home page

నులి పురుగులతో పెను కష్టం!

Published Mon, Apr 10 2017 11:59 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

నులి పురుగులతో పెను కష్టం! - Sakshi

నులి పురుగులతో పెను కష్టం!

నులిపురుగులు.. మట్టి జీవులు. కంటికి కనిపించవు. సూక్ష్మదర్శిని (మైక్రోస్కోప్‌)లో చూస్తే.. ఏమీ ఎరుగని సన్నని దారాల్లా ఉంటాయి.. కానీ, అదీ ఇదని లేకుండా అన్ని రకాల పంటలనూ నాశనం చేస్తున్నాయి. రైతుల నోటి దాకా వచ్చిన పంటను నిలువునా ఎండగడుతున్నాయి. నులిపురుగులు పంట మొక్కలు, పండ్ల చెట్ల వేళ్లను ముక్కుతో పొడిచి రసం పీల్చుకుంటూ.. ఆ వేళ్ల చుట్టూ తెగ బలిసిపోతాయి. అవి పెరిగేకొద్దీ నేలపైన ఎంత ఎత్తున ఉన్న పండ్ల చెట్టయినా, మొక్కయినా, తీగయినా.. నీళ్లు, పోషకాలు అందక వాడిపోయి.. కొద్ది నెలల్లోనే నిలువునా ఎండిపోవాల్సిందే! అది వాటి పవర్‌!!

ఈ నులిపురుగులను చంపే రసాయనిక మందును ఇప్పటివరకూ కనిపెట్టలేదు. కానీ, విషగుళికలు వాడి కొంత అదుపు చేయగలుగుతున్నారంతే. పోషకాలు చాలడం లేకనో, నీరు చాలడం లేకనో పంటలు ఇలా అయిపోతున్నాయని భ్రమింపజేసి.. తలపండిన రైతులను, సీనియర్‌ శాస్త్రవేత్తలను సైతం బోల్తా కొట్టించడంలో నులిపురుగులు ఆరితేరిపోయాయి.

చెల్క/ మెట్ట పొలాల్లో ఆరుతడి పంటలు వేసుకొని పొట్టపోసుకునే చిన్న, సన్నకారు రైతులే కాదు.. లక్షలకు లక్షలు పెట్టుబడి పెట్టి పాలీహౌస్‌లు ఏర్పాటు చేసుకున్న హైటెక్‌ రైతులు కూడా విలవిల్లాడిపోతున్నారు. పెట్టుబడులు ఎక్కువైనా వెచ్చించి కార్నేషన్, జెర్బర వంటి ఖరీదైన పూలు, అనేక రకాల కూరగాయ పంటల్లో అధికోత్పత్తి సాధించాలనుకున్న పాలీహౌస్‌ రైతుల భారీ ప్రణాళికలన్నీ నులిపురుగుల ధాటికి తల్లకిందులైపోతున్నాయి. ఒకటి, రెండు పంటలయ్యే సరికి ఆ పాలీహౌస్‌లలో బెడ్లతోపాటు వాటి కింది నేల కూడా పంటల సాగుకు సుతరామూ పనికిరానంతగా పాడైపోతోంది. దారీ తెన్నూ తెలీక కొంత మంది రైతులు పాలీహౌస్‌లలో సేద్యం అంటేనే భయపడిపోతున్నారు.

అధికోత్పత్తిని ఆశించి తైవాన్, థాయ్‌లాండ్, చైనా, బంగ్లాదేశ్‌ దేశాల నుంచి పింక్, వైట్‌ పెద్ద జామ రకాల మొక్కలు పశ్చిమ బెంగాల్‌ మీదుగా య«థేచ్ఛగా దిగుమతి అవుతున్నాయి. కోటి ఆశలతో వీటిని సాగు చేస్తున్న రైతుల జామ తోటలు అనేక జిల్లాల్లో కునారిల్లుతున్నాయి లేదా నిలువునా ఎండిపోతున్నాయి. గోరు చుట్టుపై రోకటిపోటులా.. ఈ మొక్కలతోపాటు మనకు తెలియని విదేశీ జాతి నులిపురుగులు కూడా దిగుమతి అయ్యాయి కూడా. స్పెయిన్‌ నుంచి కార్నేషన్‌ అంట్లతోపాటు మరో రకం విదేశీ జాతి నులిపురుగులు వచ్చి మన భూముల్లోకి చేరిపోయాయి. ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో ముందస్తు పరీక్షలు చేసే నెమటోడ్‌ నిపుణుల కొరతతో క్వారంటైన్‌ నిబంధనలను అధికారులు పెద్దగా పట్టించుకోకపోవడమేనని చెబుతున్నారు.

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల్లోని అనేక జిల్లాల్లో గత మూడేళ్లుగా నులిపురుగులు విజృంభిస్తుండడంతో రైతుల ఆశలు అడియాసలవుతున్నాయి. సుమారు 300 మంది రైతుల పొలాలు, పాలీహౌస్‌ల నుంచి డాక్టర్‌ సునంద నమూనాలు సేకరించి, ఉచితంగా పరీక్షలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్‌ రాజేంద్రనగర్‌లోని జాతీయ వృక్షారోగ్య యాజమాన్య సంస్థ (ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.)లో నులిపురుగులపై జాతీయ సమన్వయ పరిశోధనా స్థానం కొద్ది నెలల క్రితమే ఏర్పాటైంది. ఈ స్థానం సారథిగా డా. సునంద సేవలందిస్తున్నారు. తెలుగు రాష్ట్రాల్లో పంటలను ఆశించే నులిపురుగులపై పనిచేస్తున్న పరిశోధనా స్థానం ఇదొక్కటే. దేశవ్యాప్తంగా ఏటా జామ సహా ఉద్యాన తోటల్లో నులిపురుగుల వల్ల 10–12 శాతం దిగుబడి దెబ్బతింటున్నట్లు అధికారిక గణాంకాలు చెబుతున్నాయి. రూ. 2,100 కోట్ల మేర రైతులకు ఆర్థిక నష్టం కలుగుతోంది. ఐ.సి.ఏ.ఆర్‌. – ఎ.ఐ.సి.ఆర్‌.పి. సర్వే ప్రకారం తాజాగా రూపొందించిన నెమటోడ్స్‌ అట్లాస్‌లో ఈ వివరాలు పొందుపరిచారు. ఈ నేపథ్యంలో ‘సాగుబడి’ పాఠకుల కోసం నులిపురుగుల బెడదపై కొన్ని సంగతులు..

విదేశాల నుంచి పశ్చిమ బెంగాల్‌ మీదుగా తైవాన్, వి.ఎన్‌.ఆర్‌. బిహి జామ రకాల దిగుమతి..
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో ప్రధాన పండ్ల జాతుల్లో జామ ముఖ్యమైనది. తాజా అంచనాల ప్రకారం 12 వేల హెక్టార్లకన్నా ఎక్కువ విస్తీర్ణంలోనే జామ తోటలున్నాయి. అయితే, గత రెండేళ్లుగా జామ తోటల్లో కొన్ని మొక్కలు నిలువునా ఎండిపోతున్నాయి. రంగారెడ్డి, సంగారెడ్డి, మెదక్, నల్లగొండ, తూర్పు, పశ్చిమ గోదావరి, ప్రకాశం జిల్లాల్లో ఈ సమస్య తీవ్రంగా ఉంది. పోషకాల లోపమా? నీరు లోపమా? అని తర్జన భర్జన పడే లోపే జామ తోటలు పూర్తిగా ఎండిపోతున్నాయి. నులిపురుగుల బారిన పడిన జామ తోటల్లో పంట నష్టం 30 నుంచి 60 శాతం వరకు ఉందంటే.. తీవ్రత ఎంత ఎక్కువగా ఉందో అర్థం అవుతుంది.

కొన్ని నర్సరీల్లో అయితే నులిపురుగుల సోకిన జామ మొక్కల శాతం 90 నుంచి 100% వరకూ ఉందని ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.లో నెమటోడ్స్‌ విభాగం సారధి డా. సునంద అన్నారు. విదేశాల నుంచి జామ మొక్కలను దిగుమతి చేసుకునేటప్పుడు ఎయిర్‌పోర్టులు, సీపోర్టుల్లో తెగుళ్లు, పురుగులతోపాటు నులిపురుగుల సమస్య లేదని పరీక్షల ద్వారా నిర్ధారించుకోవాలి. అయితే, నులిపురుగుల నిపుణులు లేకపోవడం వల్ల ఈ పరీక్ష చేయకుండానే యధేచ్ఛగా తైవాన్, చైనా, థాయ్‌లాండ్, ఫ్రాన్స్‌ వంటి దేశాల నుంచి పశ్చిమ బెంగాల్‌ మీదుగా మన దేశంలోకి మొక్కల దిగుమతి జరిగిపోతోంది. ఆ మొక్కలతోపాటు మన దేశంలోకి వచ్చిన మట్టి మిశ్రమం ద్వారా విదేశీ జాతుల నులిపురుగులు మన భూముల్లోకి చేరుతుండటం ఆందోళన కలిగించే విషయం.

ఆ విధంగా.. తైవాన్, వి.ఎన్‌.ఆర్‌. బిహి రకాలకు చెందిన పింక్, వైట్‌ జామ మొక్కలతో పాటు అనే విదేశీ జాతి నులిపురుగులు తెలుగు రాష్ట్రాల పొలాల్లోకి వచ్చేశాయి. ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.లో నులిపురుగుల శాస్త్రవేత్త డా. సునంద తెలుగు రాష్ట్రాల్లోని అనేక జిల్లాల్లో ఎండిపోతున్న తైవాన్, వి.ఎన్‌.ఆర్‌. బిహి రకాల జామ తోటల్లో నమూనాలు సేకరించి పరీక్షించారు. మోలోయిడోగైన్‌ ఎంటెరోలోబి (M్ఛlౌజీఛీౌజyn్ఛ ్ఛn్ట్ఛటౌlౌbజీ) అనే విదేశీ జాతి నులిపురుగు సోకినట్లు గుర్తించారు. తొలుత 2013లో తమిళనాడులోని దిండిగల్‌లో జామ తోటలో దీన్ని కనుగొన్నారు. 2015లో తెలంగాణలో తొలిసారి బయటపడింది. అయితే, దేశీ జామ రకాలైన అలహాబాద్‌ సఫేద్, లక్నో 49 రకాల జామ తోటల్లో ఈ నులిపురుగుల సమస్య లేదని డా. సునంద చెప్పారు.

ఈ విదేశీ జాతి నులిపురుగు జామ ఒక్క పంటనే కాదు.. మట్టి లేదా అంట్ల ద్వారా ఏ పంటనైనా ఆశిస్తుంది. చివరకు గడ్డి మొక్కల వేళ్లపై కూడా బతికేస్తుందన్నారు. తైవాన్, వి.ఎన్‌.ఆర్‌. బిహి వంటి విదేశీ జామ రకాలను దిగుమతి చేసుకొని తూర్పు గోదావరి జిల్లా కడియంలోని నర్సరీ రైతులకు ఇస్తున్నాయని, వీటి ద్వారా విదేశీ జాతి నులిపురుగులు వ్యాప్తి చెందుతున్నాయన్నారు. ఈ నులిపురుగుల వ్యాప్తి వేగంగా జరుగుతున్నందున అరికట్టకపోతే ఇతర ప్రాంతాలకు కూడా విస్తరించి రైతాంగానికి తీవ్ర ఆర్థిక నష్టం కలిగించే ప్రమాదం ఉందని డా. సునంద హెచ్చరిస్తున్నారు.

నాలుగో నెల నుంచే నులిపురుగుల సమస్య ప్రకృతి వ్యవసాయంతోనే తోటను నిలబెట్టుకుంటా!
ప్రకృతి వ్యవసాయదారుడు కొచ్చెర్లపాటి రవికిరణ్‌కు యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం అరూర్‌ గ్రామపరిధిలో నాలుగు ఎకరాల భూమి ఉంది. పాలేకర్‌ శిక్షణ పొంది, పుస్తకాలు చదివి ప్రకృతి వ్యవసాయం చేపట్టారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని తెలిసిన ఒక రైతు వద్ద నుంచి తైవాన్‌ పింక్‌ జామ 1,800 మొక్కలను తెచ్చి.. ఏడాదిన్నర క్రితం నాటారు. కడియం నుంచి సూద మొక్కలు(రూట్‌ స్టాక్‌) తెప్పించి, దానిపై తైవాన్‌ పింక్‌ కొమ్మలను గ్రాఫ్టింగ్‌ చేసిన మొక్కలను ఒక రైతు వద్ద నుంచి కొని నాటారు. 4 నెలలు గడిచేటప్పటికి ఆకులు పసుపు రంగుకు పాలిపోవడం, ఎదుగుదల లేకపోవడం వంటి సమస్యలు కనిపించాయి. ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.కు చెందిన డా. సునందను సంప్రదించారు. పరీక్షలు చేసి నులిపురుగులు సోకాయని నిర్థారించారు.

రసాయనిక మందులు వాడమని సలహా ఇచ్చారు. అయితే, రవికిరణ్‌ మాత్రం ప్రకృతి వ్యవసాయంపై నమ్మకంతో తన మార్గంలోనే ముందుకెళ్తున్నారు. భూమిలో సేంద్రియ పదార్థం పెంచితే మొక్కలు తిరిగి పుంజుకుంటాయని నమ్ముతున్నారు. జీవామృతం, పంచగవ్య, పుల్లమజ్జిగ.. ఇస్తున్నారు. మేకల ఎరువుకు జీవామృతం కలిపి 3 నెలలు పులియబెట్టి, దానికి జీవన ఎరువులను కలిపి మొక్కల చుట్టూ పోసి మల్చింగ్‌ చేస్తున్నారు. జామ మొక్కల దగ్గర్లో బంతి మొక్కలు వేశారు. బంతి మొక్కల వేళ్ల నుంచి వెలువడే స్రావం నులిపురుగుల నియంత్రణకు ఉపయోగపడుతోందన్నారు. తనతోపాటు 30–40 ఎకరాల్లో తైవాన్‌ జామ వేసిన రైతులు రసాయనాలు వాడి, చాలా నష్టపోయి తోటలు పూర్తిగా తీసేశారని రవికిరణ్‌ తెలిపారు. తన పొలంలో ఒక రెండెకరాల్లో జామ పక్కనే మునగ మొక్కలు వేసి, కొమ్మలు నరికి మల్చింగ్‌ చేస్తున్నానని, ఆ ప్రాంతంలో నులిపురుగుల నష్ట తీవ్రత తక్కువగా ఉందన్నారు. ఓపికగా ప్రకృతి వ్యవసాయం కొనసాగిస్తున్న రవికిరణ్‌ (99636 12578) అభినందనీయుడు.

సేంద్రియ సేద్యంలో నులిపురుగుల సమస్య తక్కువే: డా. సునంద
నులిపురుగుల సమస్య తీవ్రత సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో రసాయనిక వ్యవసాయం చేసే పొలాలతో పోల్చినప్పుడు తక్కువగానే ఉంటుందని ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం.లో నులిపురుగుల నిపుణురాలు డా. సునంద తెలిపారు. అయితే, ఇటీవల సంవత్సరాల్లో సేంద్రియ సేద్యం చేపట్టిన పొలాల్లో పెద్ద తేడా కనిపించలేదని, సుదీర్ఘకాలం నుంచి సేంద్రియ సేద్యం చేసే పొలాల్లో కచ్చితంగా ఈ తేడా ఉంటుందన్నారు.

సేంద్రియ వ్యవసాయంలో వినియోగించే జీవన ఎరువుల ప్రభావం వల్ల నులిపురుగులు అదుపులో ఉండే అవకాశం ఉందన్నారు. ప్రధాన పంట మొక్కల పక్కన బంతి మొక్కలు, ఆవాల మొక్కలు సాగు చేయడం ద్వారా నులిపురుగుల బెడదను నివారించవచ్చని ఆమె తెలిపారు. ఈ మొక్కలు వేళ్ల ద్వారా స్రవించే ద్రవాలు నులిపురుగులను నిరోధిస్తాయన్నారు. అనేక రకాల పంటలను కలిపి ఒకే పొలంలో పండించడం, ఎర పంటలను సాగు చేయడం ద్వారా కూడా ఈ సమస్యను అదుపులో ఉంచుకోవడం సులభమవుతుందని డా. సునంద వివరించారు. నులిపురుగుల సమస్య ఎదుర్కొంటున్న రైతులు నమూనాలు తెస్తే ఉచితంగా పరీక్ష చేసి, తగిన సూచనలు ఇస్తామన్నారు.

నులిపురుగుల సమస్యపై రైతులకు ఎన్‌.ఐ.పి.హెచ్‌.ఎం. శిక్షణ
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకు చెందిన రైతులు లేదా రైతు బృందాలు నులిపురుగుల సమస్యపై హైదరాబాద్‌లోని ఎన్‌.ఐ.పి. హెచ్‌.ఎం. 3 రోజుల పాటు ఉచిత శిక్షణ ఇస్తుంది. వసతి ఉచితం. భోజనం ఖర్చు రైతులే భరించుకోవాలి. ఆసక్తి కలిగిన వారు ఎన్‌.ఐ.పి. హెచ్‌.ఎం. డైరెక్టర్‌ జనరల్‌కు ఫ్యాక్స్‌ (040–24015346) ద్వారా లేఖ రాయవచ్చు. శిక్షణకు రావలసిన తేదీలను రైతులకు తదుపరి తెలియ జేస్తారు. డా. సునందను 89787 78707 నంబరులో గాని, ఈమెయిల్‌ patilsunanda722@gmail.com ద్వారా గాని సంప్రదించవచ్చు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement