పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే... | There are many greens in nature | Sakshi
Sakshi News home page

పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే...

Published Sat, Aug 11 2018 12:12 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

There are many greens in nature - Sakshi

దొగ్గలి ఆకు... తెల్ల గర్జల ఆకు... చెన్నంగి ఆకు...  పప్పు కూర ఆకు... గునుకు ఉత్తరేణి ఆకు... వీటి పేర్లు విన్నారా? తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఆకు కూరలని, వీటిని మాత్రమే తినాలని అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది!ప్రకృతిలో చాలా ఆకుకూరలున్నాయి. తెలిసిన వారికి అవి మంచి కూరలు. తెలియని వారికి పిచ్చి కూరలు. ఈ ‘పిచ్చి’ మొక్కలకు ఉన్న రుచి ఏమిటో చూడండి.

పప్పు కూర పకోడీ
కావలసినవి:  పప్పు కూర – రెండు కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి + ఉల్లి పేస్ట్‌ – ఒక టీ స్పూను; నూనె – డీప్‌ ఫ్రైకి సరిపడా
తయారీ:  ∙పప్పుకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో తరిగిన పప్పు కూర వేసి, నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసి పేపర్‌ న్యాప్‌కిన్‌ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పప్పు కూర పకోడీ సిద్ధమైనట్లే.

గునుగు/ ఉత్తరేణి కిచిడీ
కావలసినవి:  గునుగు/ఉత్తరేణి ఆకు కూర – ఒక కట్ట (రెండు కప్పుల ఆకు); మెంతి కూర – పావు కప్పు; పాల కూర – పావు కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; పచ్చి మిర్చి – 5; పెసర పప్పు – ఒక కప్పు; పుదీనా – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – అర కప్పు; బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని
తయారీ:  ∙ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో బియ్యం, పప్పులు, పల్లీలు, ఆకు కూరల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. మూడు విజిల్స్‌ వచ్చాక దింపేయాలి ∙మూత తీసి, కొత్తిమీరతో అలంకరించాలి ∙ఉల్లిపాయ పెరుగు పచ్చడితో అందించాలి.

చెన్నంగి పచ్చడి
కావలసినవి:  చెన్నంగి ఆకు – మూడు కప్పులు; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్‌ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్‌ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా
తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న చెన్నంగి ఆకు వేసి పచ్చి దనం పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి ∙చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్‌ చేయాలి ∙వేయించి ఉంచుకున్న ఆకు, ఉప్పు జత చేసి మరోమారు మెత్తగా గ్రైండ్‌ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙రొట్టెలు, అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది.

గురుమడి ఆకు వేపుడు
కావలసినవి:  గురు మడి ఆకు – రెండు కప్పులు; పెసర పప్పు – అర కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్‌ స్పూను
తయారీ: ∙గురుమడి ఆకును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి ∙సన్నగా తరగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక గురుమడి ఆకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ కొద్దిసేపయ్యాక నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఆకు బాగా వేగిందనిపించాక ఉల్లి తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మగ్గిన తరవాత దింపేయాలి.

ఆకుకూర సజ్జ/జొన్న  రొట్టె
కావలసినవి:  మనకు ఇష్టమైన ఆకు కూర తరుగు – రెండు కప్పులు; జొన్న పిండి లేదా సజ్జ పిండి – నాలుగు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – రొట్టెలు కాల్చడానికి తగినంత
తయారీ: ∙ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆకు కూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆకు కూర బాగా చల్లారాక సజ్జ పిండి లేదా జొన్న పిండి, ఉప్పు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో రొట్టె మాదిరిగా తయారుచేసి, పెనం మీద వేసి కాల్చాలి.

తెల్ల గలిజేరు ఆకు పప్పు
కావలసినవి:   తెల్ల గలిజేరు ఆకు – ఒక కప్పు; కందిపప్పు లేదా పెసర పప్పు – రెండు కప్పులు; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; ఇంగువ – కొద్దిగా. పోపు కోసం... ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్‌ స్పూను; కొత్తిమీర – కొద్దిగా.
తయారీ: ∙ముందుగా తెల్ల గలిజేరు కూర ఆకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙ కంది పప్పు లేదా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి ∙తరిగి ఉంచుకున్న తెల్ల గలిజేరు కూర ఆకు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙ఆకు కూర బాగా మగ్గిన తరవాత ఉడికించిన పెసర పప్పు/కందిపప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙వేడి వేడి అన్నంలోకి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీనినే పునర్నవ అని కూడా అంటారు.
- నిర్వహణ  వైజయంతి పురాణపండ
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement