గ్రామంలో సాగుచేస్తున్న ఆకుకూరల తోట
సాక్షి,దుమ్ముగూడెం(భద్రాద్రి): ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కటి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెప్పేమాట. ప్రకృతి ఇచ్చిన వరం ఆకు కూరలు వీటిని తీసుకోవడంతో శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మహిళలు తమకున్న కొద్దిపాటి పొలంలో ఆకుకూరల సాగు చేస్తున్నారు. ప్రతీ రోజు మండలంలోని ప్రధాన గ్రామాలకు తీసుకువచ్చి వాటిని విక్రయించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ఇలా కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా మారి మండలంలోని బండిరేవు గ్రామస్తులు, మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు.
ఇంటి పరిసరాల్లోనే పెంపకం...
మండలంలోని బండిరేవు గ్రామంలో 300కు పైగా కుటుంబాలున్నాయి. వీరిలో దాదాపు 15 నుండి 20 కుటుంబాల వారు తమకు ఉన్న ఉన్న కొద్దిపాటి ఇంటి ఆవరణలో తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి కూర, కొత్తిమేర, పాలకూర, చుక్కకూర, తోట కూరలో వివిధ రకాలు, గోంగూరలో వివిధ రకాలను సాగుచేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే చేతికందే ఆకుకూరల సాగుతో బండిరేవు గ్రామస్తులు ఆర్థిక లాభం వస్తుండటంతో సాగులో ముందుకు వెళ్తున్నారు.
గ్రామస్తులకు ఉన్న అర ఎకరం స్థలం నుండి, పది సెంట్ల వరకు ఉన్న స్థలంలో ఆకుకూరలకు కేటాయిస్తున్నారు. ఆ స్థలాన్ని సిద్ధం చేసి విత్తనాలను చల్లడంతో నెల రోజుల వ్యవధిలోనే అది కోతకొస్తుంది. కోసి కట్టలుగా కట్టి లక్ష్మీనగరం, దుమ్ముగూడెం, ములకపాడు, చర్ల సంతకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రతీ రోజు కనీసం ప్రతీ ఒక్కరు 400నుండి 500 వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. పండించిన ఆకు కూరలను మహిళలే వివిధ గ్రామాల్లో తిరుగుతూ వాటిని విక్రయించి ఆర్థికంగా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు.
ఆకుకూరల్లో పోషక విలువలు..
మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ప్రజలు ప్రతి రోజు ఏదో ఒక ఆకు కూర తమ వంటకంలో ఉంచుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే చేతికందే ఈ స్వల్పకాలిక పంటలు మంచి ఆదాయాన్ని అందజేస్తున్నాయి. ప్రజలు నిత్యం తినే ఆకుకూరల్లో ఎన్నో బలవర్థకమైన పోషక పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పుతుంటారు. ఆకు కూరల్లో తక్కువ కొవ్వుశాతం ఉండడమే కాకుండా శరీరీనికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ సీ, ఏ, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్‌లో ఉంటుంది,కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అంతేకాక మనిషి అధిక బరువు పెరగకుండా ఈ ఆకు కూరలు ఎంతగానో ఉపయోగపడతాయి.
ఇల్లు గడుస్తోంది..
ఆకు కూరల సాగుతో పాటు విక్రయాలతో రోజు కొద్దిపాటి ఆదాయం చేతికి వస్తుండటంతో కుటుంబ అవసరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆకు కూరల సాగును చేయడం ఆనంధంగా ఉంది. కోతుల బెడదతో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పంచాయతీ అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలి..
– మేకల కమలమ్మ
సహకారం అందిస్తే ఎక్కువ సాగు
ఆకు కూరల సాగుకు అధికారులు సహయ సహకారాలు అందచేస్తే ఇంకా ఎక్కువ స్థలంలో ఆకు కూరల సాగు చేసే అవకాశాలు ఉన్నాయి.ఉన్న కొద్దిపాటి స్థలంలో ప్రస్తుతం ఆకు కూరల సాగుచేస్తున్నాం. నిత్యం ఆదాయం వస్తుండటంతో ఇంటి అవసరాలకు ఉపయోగకరంగా ఉంది. సంవత్సరాంతం ఆకుల కూరల సాగు చేసున్నాం. కోతుల సమస్యపై అధికారులు సహకరించాలి.
– ఉప్పు పద్మ
Comments
Please login to add a commentAdd a comment