Leafy green vegetables
-
ఈ ఆకుకూరలు తిన్నారా..! ఇకపై మీ ఆరోగ్యానికి
'ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే ఇంచుమించు అందరూ ఆకుకూరలు తింటారు. అయితే కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి సమృద్ధిగా పోషకాలు సమకూరి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చుననే విషయం మాత్రం అందరికీ తెలియదు. అందుకే ఏయే వ్యాధులకు ఏయే ఆకుకూరలు తినడం మంచిదో తెలుసుకుందాం. కొన్ని రకాల అనారోగ్య లక్షణాలకు కొన్ని రకాల ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో చూద్దాం..' అవిసె ఆకుకూర అవిసె ఆకులు రుచికి కారంగా... కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి ∙ఏకాదశి, శనివారం, శివరాత్రి వంటి ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా తినాలి. దానివల్ల ఉపవాసం మూలంగా వచ్చిన నీరసాన్ని బాగా తగ్గించి, ఉత్సాహాన్నిస్తుంది. గాయాలకు, దెబ్బలకు ఇది మంచి మందు. దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా వేస్తే తొందరగా తగ్గుతాయి. జలుబు, రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి ఇస్తే మంచిది. కరివేపాకు కరివేపాకును మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం, వాతం సమతుల్యంలో ఉంటాయి. విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు కూడా కరివేపాకు తినడం వల్ల తగ్గుతాయి. కరివేపాకును ముద్దలా చేసి విషజంతువుల కాట్లకు, దద్దుర్లకు బ్యాండేజీలా కడితే సులువుగా తగ్గుతాయి. కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాధిని నివారిస్తుంది. కామంచి ఆకు కూర చాలా చిన్న సైజులో అంటే కందిగింజంత సైజులో ఉండే కామంచి పళ్లని చాలామంది తింటారు. అయితే దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరం ఉబ్బుతో కూడి ఉన్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరిస్తుంది. గుంటగలగర జుట్టు సమస్యలకు వాడే మందుగా మాత్రమే ఇది అందరికీ తెలుసు కానీ, దీనిని లోపలికి తీసుకోవడం వల్ల శరీరంలోని వాత, కఫాలను పోగొడుతుంది. దంతాలకు, చర్మానికి చాలా మంచిది. తలనొప్పి, వాపు, దురదలని నివారిస్తుంది. హెర్నియా, ఆయాసం, పొట్టలోని క్రిములు రుమాటిజం, భయంకరమైన రక్తక్షీణత, గుండెజబ్బు, చర్మరోగం వంటి వాటికి బాగా పని చేస్తుంది. గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు. గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది. గోంగూర గోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు. రేజీకటి రోగం కలవారికి ఈ కూర చాలా మేలు చేస్తుంది. గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి. గోంగూరను నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి. బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది. గంగపాయల కూర రుచికి పుల్లగా ఉండే ఈ ఆకు పాలకంటే, వెన్నకంటే మంచిది. దీనిలో ఎ, బి విటమినులు సమృద్ధిగా ఉన్నాయి. పాలకంటే, వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉందని పరిశోధనలలో తేలింది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అధికం. ఈ కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. రక్తహీనత ఉన్న వారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే దుష్టపదార్థాలను తొలగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు. ఎముకలు, దంతాల పెరుగుదలకు అది అత్యంత అవసరం. కుష్టు, మూత్రాశయంలో రాళ్లు వంటి సమస్యలతో బాధ పడేవారు ఈ కూరని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది. కొత్తిమీర కొత్తిమీర కషాయంలో పాలు, పంచదార కలిపి సేవిస్తే రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, ఆకలి మందగించడం, కడుపులో గ్యాస్.. వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి. కొత్తిమీరను వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరుతుంది. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది. నోరు పూసినప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది. చామాకు చామ ఆకు కూర చాలా మంచిది. జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. పైల్స్‌తో బాధపడేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. మూత్రవ్యాధులున్న వారికి మంచి మందు. నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి. -
పీజీ చదివినా.. ఆకుకూరల సాగుతోనే తృప్తిగా ఉన్నా.
-
ఇంటి పరిసరాల్లోనే పెంపకం.. రోజు కనీసం 500 వరకు ఆదాయం!
సాక్షి,దుమ్ముగూడెం(భద్రాద్రి): ఆకుకూరలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. చక్కటి ఆరోగ్యం కావాలి అంటే ఎక్కువగా ఆకుకూరలు తీసుకోవడం మంచిదని వైద్యులు చెప్పేమాట. ప్రకృతి ఇచ్చిన వరం ఆకు కూరలు వీటిని తీసుకోవడంతో శరీరంలో ఆరోగ్య పరంగా చేసే అద్భుతాలు చాలా ఉన్నాయి. ఈ విషయాన్ని గుర్తించిన మహిళలు తమకున్న కొద్దిపాటి పొలంలో ఆకుకూరల సాగు చేస్తున్నారు. ప్రతీ రోజు మండలంలోని ప్రధాన గ్రామాలకు తీసుకువచ్చి వాటిని విక్రయించి స్థిరమైన ఆదాయం పొందుతున్నారు. ఇలా కుటుంబాలకు ఆర్థిక ఆసరాగా మారి మండలంలోని బండిరేవు గ్రామస్తులు, మహిళలు ఆదర్శంగా నిలుస్తున్నారు. ఇంటి పరిసరాల్లోనే పెంపకం... మండలంలోని బండిరేవు గ్రామంలో 300కు పైగా కుటుంబాలున్నాయి. వీరిలో దాదాపు 15 నుండి 20 కుటుంబాల వారు తమకు ఉన్న ఉన్న కొద్దిపాటి ఇంటి ఆవరణలో తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలి కూర, కొత్తిమేర, పాలకూర, చుక్కకూర, తోట కూరలో వివిధ రకాలు, గోంగూరలో వివిధ రకాలను సాగుచేస్తున్నారు. నెల రోజుల వ్యవధిలోనే చేతికందే ఆకుకూరల సాగుతో బండిరేవు గ్రామస్తులు ఆర్థిక లాభం వస్తుండటంతో సాగులో ముందుకు వెళ్తున్నారు. గ్రామస్తులకు ఉన్న అర ఎకరం స్థలం నుండి, పది సెంట్ల వరకు ఉన్న స్థలంలో ఆకుకూరలకు కేటాయిస్తున్నారు. ఆ స్థలాన్ని సిద్ధం చేసి విత్తనాలను చల్లడంతో నెల రోజుల వ్యవధిలోనే అది కోతకొస్తుంది. కోసి కట్టలుగా కట్టి లక్ష్మీనగరం, దుమ్ముగూడెం, ములకపాడు, చర్ల సంతకు తరలించి విక్రయిస్తున్నారు. ప్రతీ రోజు కనీసం ప్రతీ ఒక్కరు 400నుండి 500 వరకు ఆదాయం సంపాదిస్తున్నారు. పండించిన ఆకు కూరలను మహిళలే వివిధ గ్రామాల్లో తిరుగుతూ వాటిని విక్రయించి ఆర్థికంగా కుటుంబాలకు చేదోడు వాదోడుగా ఉంటున్నారు. ఆకుకూరల్లో పోషక విలువలు.. మంచి ఆరోగ్యం కోసం వేలకు వేలు ఖర్చు పెట్టాల్సిన పని లేకుండా ప్రజలు ప్రతి రోజు ఏదో ఒక ఆకు కూర తమ వంటకంలో ఉంచుకోవడం వలన ఎన్నో లాభాలు ఉన్నాయి. అతి తక్కువ కాలంలోనే చేతికందే ఈ స్వల్పకాలిక పంటలు మంచి ఆదాయాన్ని అందజేస్తున్నాయి. ప్రజలు నిత్యం తినే ఆకుకూరల్లో ఎన్నో బలవర్థకమైన పోషక పదార్థాలు ఉన్నాయని వైద్యులు చెప్పుతుంటారు. ఆకు కూరల్లో తక్కువ కొవ్వుశాతం ఉండడమే కాకుండా శరీరీనికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను, విటమిన్లను, ప్రోటీన్లను అందిస్తాయి. ఆకుకూరల్లో విటమిన్ సీ, ఏ, మెగ్నిషియం, ఫోలిక్ యాసిడ్స్ వంటి ఖనిజ లవణాలు ఎక్కువగా ఉంటాయి. ఆకు కూరలను ఎక్కువగా తీసుకోవడం వలన షుగర్ కంట్రోల్లో ఉంటుంది,కళ్ల ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. అంతేకాక మనిషి అధిక బరువు పెరగకుండా ఈ ఆకు కూరలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇల్లు గడుస్తోంది.. ఆకు కూరల సాగుతో పాటు విక్రయాలతో రోజు కొద్దిపాటి ఆదాయం చేతికి వస్తుండటంతో కుటుంబ అవసరాలకు ఎంతగానో ఉపయోగకరంగా ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో ఆకు కూరల సాగును చేయడం ఆనంధంగా ఉంది. కోతుల బెడదతో కొంచెం ఇబ్బంది పడుతున్నాం. పంచాయతీ అధికారులు స్పందించి కోతుల బెడద లేకుండా చూడాలి.. – మేకల కమలమ్మ సహకారం అందిస్తే ఎక్కువ సాగు ఆకు కూరల సాగుకు అధికారులు సహయ సహకారాలు అందచేస్తే ఇంకా ఎక్కువ స్థలంలో ఆకు కూరల సాగు చేసే అవకాశాలు ఉన్నాయి.ఉన్న కొద్దిపాటి స్థలంలో ప్రస్తుతం ఆకు కూరల సాగుచేస్తున్నాం. నిత్యం ఆదాయం వస్తుండటంతో ఇంటి అవసరాలకు ఉపయోగకరంగా ఉంది. సంవత్సరాంతం ఆకుల కూరల సాగు చేసున్నాం. కోతుల సమస్యపై అధికారులు సహకరించాలి. – ఉప్పు పద్మ -
దొగ్గలి కూర గుడ్డుతో సమానం
స్త్రీకి పరిసరాలను ఉపయోగించుకోవడం తెలుసు. అవసరం ఉన్నదానిని అవసరం లేనిదానిని కూడా ఎలా ఉపయోగంలోకి తేవాలో వారు తెలుసుకుంటారు. ఇక మహిళా రైతులంటే మాటలా? వారికి చెట్టూ చేమా పుట్టా పొద.., అన్నింటి గురించి అవగాహన ఉంటుంది. వాటిని ఇంటి అవసరానికి ఎలా ఉపయోగించాలో తెలిసి ఉంటుంది. జహీరాబాద్ మండలానికి చెందిన మహిళా రైతులు కొందరు ప్రకృతిని సమర్థంగా ఉపయోగించుకుంటూ ఆదర్శంగా అబ్బురంగా నిలుస్తున్నారు. తమ పరిసరాల నుంచి బలవర్థకమైన ఆహారాన్ని గుర్తించి సేకరిస్తున్నారు. స్వీకరిస్తున్నారు. ఫలితంగా వారు ఇంతవరకు ఒక్కనాడు కూడా దవాఖానాకు వెళ్లలేదు. ఒక్కనాడు జ్వరం వచ్చిందనో, జలుబు చేసిందనో ముసుగు వేసుకుని పడుకోలేదు. అంతేనా పేరు రాసుకోవడం తెలియని, ముఖాలు అద్దంలో కూడా చూసుకోవడం తెలియని ఈ మహిళలు వాళ్ల కార్యక్రమాలను వారే వీడియోలలో బంధిస్తున్నారు. అదీ ఈ మహిళలు సాధించిన విజయం. డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో ఏర్పాటైన ‘ఫెస్టివల్ ఆఫ్ అన్కల్టివేటెడ్ ఫుడ్స్’ కార్యక్రమానికి వారు తయారుచేసిన వంటకాలను ప్రదర్శించి, రుచి చూపడానికి వచ్చిన సందర్భంగా సాక్షి వారిని పలకరించింది. ‘మేం మొత్తం ఐదు వేల మంది మహిళా రైతులం. అందరం ఎవరికి వారుగా వ్యవసాయం చేస్తూనే సంఘం వారి సమావేశానికి హాజరైనప్పుడు అక్క, చెల్లి, వదిన, అవ్వ, అత్త, బిడ్డా అంటూ ఒకరిని ఒకరు ఆప్యాయంగా పలకరించుకుంటాం. ఒకరు చేసిన వంటలు ఒకరికి రుచి చూపిస్తాం’ అంటారు డెబ్బై సంవ్సరాల చంద్రమ్మ.నున్నటి బుగ్గలతో, కళ్ల జోడు అవసరం లేని కంటిచూపుతో, అదురుబెదురు లేని మాటలతో అందరినీ ఆకర్షిస్తారు చంద్రమ్మ. ఆహార యోగ్యమైన ఆకుకూరలను గుర్తించడంలో ఈమెది అందె వేసిన చేయి. ‘‘అందరము కలిసి/ ఆడోళ్లము కలిసి/ ఆకుకూరలు తెస్తిమి వజ్రమ్మా’’ అంటూ గొంతెత్తి పాడారామె. ఈ పాట మీరే రాసుకున్నారా అని ప్రశ్నిస్తే ‘మాకు అక్షరంగా రాయడం చేతకాదు, మేము చేసే పనిని పాడుకునేలా మా మాటలలో రాసుకున్నాం’ అందామె. మొత్తం 30 రకాల ఆకుకూరలు వీరు ఆహారంగా తీసుకుంటారు. ఇవి సాగు చేస్తే పండే ఆకుకూరలు కాదు. ప్రకృతి పండించేవి. చేల గట్ల మీద, మట్టి దిబ్బల మీద మొలిచే ఆకుకూరలు ఇవి. చాలామంది వీటిని పిచ్చి మొక్కలు అని అనుకుంటారు తెలియక. విత్తనం నాటకుండా స్వయంగా పుట్టి పెరుగుతాయి ఈ మొక్కలు. వీటిని ఎలా గుర్తిస్తారు అని అడిగితే ‘చిన్ననాటి నుంచి ఈ మొక్కల మధ్యనే పుట్టి పెరిగాం. మా పెద్దోళ్లు వీటి గురించి మాట్లాడతంటే ఇనెటోళ్లం. వండి పెడితే సక్కగ తినెటోళ్లం’ అంటారు మొగులమ్మ. ‘మేం ఇత్తులు నాటక్కర్లే. వాన బడితే అట్లనే సక్కగ మొలుస్తయి. పొలంల పని చేసుకొని, ఇంటికాడకి పోయెటేళ, ఆ దినానికి సరిపోయేట్ల మొక్కలు పెరుక్క పోతం. సక్కగ వండుకుని రొట్టెల్ల నంజుకు తింటం’ అంటారు అర్జూ నాయక్ తండాకి చెందిన చక్రీబాయి. ‘‘మేం దినాము జొన్నరొట్టెలు, లేకంటే సజ్జ రొట్టెలు తింటం. పొలం కాడ నుంచి తెచ్చుకున్న వాటితో కూర లు సేస్తం. రొట్టెల్లో కలిపి తింటం’’ అంటున్న వీరు అనీమియా వంటి రోగాల బారిన పడకుండా ఆరోగ్యంగా ఉంటున్నారు. వినాయక చవితికి విస్తారంగా పండే తుమ్మి కూరతో శరీరానికి కావలసిన ఇనుము దొరికి వీరి శరీరాలు ఉక్కులా తయారవుతున్నాయి. ఏ పంటనూ ఇబ్బంది పెట్టకుండా స్వయంశక్తితో పెరిగే ఆకుకూరలుగా వీటì గురించి చెబుతారు ఈ మహిళా రైతులు.‘దొగ్గలి కూర, ఉడికించిన కోడిగుడ్డుతో సమానం. రోజుకో ఆకుకూర తింటే దవాఖానా (ఆసుపత్రి)కు పోయ్యేటి అవుసరం ఉండదు’ అంటారు చంద్రమ్మ. దొగ్గలి కూర తింటే ఇనుములా తయారవుతారని, మోకాలినొప్పులు రావని, ఉత్తరేణి తింటే తెల్లమచ్చలు దూరమవుతాయని, జీవితంలో ఒక్కసారైనా తినాలనీ అంటారు వీరు. ‘మా వంటి వారిని అడిగి తెప్పించుకోవాల. మాకులాగనే సక్కగ అవుతారు’ అంటారు చక్రీబాయి.పప్పుకూర తింటే మధుమేహ వ్యాధి బారిన పడకుండా ఉంటారని, బర్రేకుల కూర తింటే అమ్మపాలు పసిబిడ్డకు సమృద్ధిగా అందుతాయని, ఈ మొక్కలన్నీ దేవుడు ఇచ్చిన వరాలని చెబుతారు మొగిలమ్మ.‘మాకు ఇయ్యే మాంసం కూర లెక్క’ అంటారు చక్రీబాయి.వ్యవసాయం చేయడంలో మాత్రమే కాదు, వీరు వీడియోలు తీయడం చూస్తే ఎంతటివారికైనా ఆశ్చర్యం కలగక మానదు. సుమారు ఏడాదిపాటు వీడియోగ్రఫీ నేర్చుకుని, వారి కార్యక్రమాలు ఎక్కడజరుగుతున్నా వారి వీడియోలు వారే తీసుకునే స్థాయికి ఎదిగారు ఈ మహిళా రైతులు. రొట్టెలు దాసిపెడతం ‘రోజూ రొట్టెలు చేసకుంటం. అందల నాలుగు రొట్టెలు దాసిపెడతం. ఇంటికి ఎవురైనా అస్తే ఆళ్లకి పెడతం. ఒకరికి పెట్టి మనం తింటే మంచిగుంటది. ఇంకా మిగిలితే ఆవులకి పెడతం. – చంద్రమ్మ – వైజయంతి పురాణపండ -
పిచ్చి మొక్కే కదా అని పీకేస్తే...
దొగ్గలి ఆకు... తెల్ల గర్జల ఆకు... చెన్నంగి ఆకు... పప్పు కూర ఆకు... గునుకు ఉత్తరేణి ఆకు... వీటి పేర్లు విన్నారా? తోటకూర, గోంగూర, పాలకూర ఇవి మాత్రమే ఆకు కూరలని, వీటిని మాత్రమే తినాలని అనుకోవడం వల్ల వచ్చిన చిక్కు ఇది!ప్రకృతిలో చాలా ఆకుకూరలున్నాయి. తెలిసిన వారికి అవి మంచి కూరలు. తెలియని వారికి పిచ్చి కూరలు. ఈ ‘పిచ్చి’ మొక్కలకు ఉన్న రుచి ఏమిటో చూడండి. పప్పు కూర పకోడీ కావలసినవి: పప్పు కూర – రెండు కప్పులు; సెనగ పిండి – ఒక కప్పు; ఉప్పు – తగినంత; ధనియాల పొడి – అర టీ స్పూను; మిరప కారం – ఒక టీ స్పూను; అల్లం + వెల్లుల్లి + ఉల్లి పేస్ట్ – ఒక టీ స్పూను; నూనె – డీప్ ఫ్రైకి సరిపడా తయారీ: ∙పప్పుకూరను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙ఒక పాత్రలో తరిగిన పప్పు కూర వేసి, నూనె మినహా మిగిలిన పదార్థాలన్నీ జత చేసి పకోడీల పిండిలా కలుపుకోవాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె బాగా కాగిన తరవాత ఈ పిండిని పకోడీల మాదిరిగా వేసి పేపర్ న్యాప్కిన్ మీదకు తీసుకోవాలి ∙వేడి వేడి పప్పు కూర పకోడీ సిద్ధమైనట్లే. గునుగు/ ఉత్తరేణి కిచిడీ కావలసినవి: గునుగు/ఉత్తరేణి ఆకు కూర – ఒక కట్ట (రెండు కప్పుల ఆకు); మెంతి కూర – పావు కప్పు; పాల కూర – పావు కప్పు; కరివేపాకు – 3 రెమ్మలు; కొత్తిమీర – అర కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 6; పచ్చి మిర్చి – 5; పెసర పప్పు – ఒక కప్పు; పుదీనా – అర కప్పు; ఉల్లి తరుగు – పావు కప్పు; పల్లీలు – అర కప్పు; బియ్యం – ఒక కప్పు; ఉప్పు – తగినంత; టొమాటో తరుగు – ఒక కప్పు; నీళ్లు – తగినన్ని తయారీ: ∙ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙బియ్యాన్ని శుభ్రంగా కడగాలి ∙ఒక పాత్రలో బియ్యం, పప్పులు, పల్లీలు, ఆకు కూరల తరుగు, పచ్చి మిర్చి తరుగు, కరివేపాకు, ఉల్లి తరుగు, ఉప్పు, తగినన్ని నీళ్లు జత చేసి కుకర్‌లో ఉంచి మూత పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక దింపేయాలి ∙మూత తీసి, కొత్తిమీరతో అలంకరించాలి ∙ఉల్లిపాయ పెరుగు పచ్చడితో అందించాలి. చెన్నంగి పచ్చడి కావలసినవి: చెన్నంగి ఆకు – మూడు కప్పులు; చింతపండు – నిమ్మకాయంత; ఉప్పు – తగినంత; ఎండు మిర్చి – 10; పచ్చి సెనగ పప్పు – ఒక టేబుల్ స్పూను; మినప్పప్పు – ఒక టేబుల్ స్పూను; ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; నూనె – 3 టీ స్పూన్లు; కొత్తిమీర – కొద్దిగా తయారీ: ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక తరిగి ఉంచుకున్న చెన్నంగి ఆకు వేసి పచ్చి దనం పోయేవరకు వేయించి తీసి పక్కన ఉంచాలి ∙అదే బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరసగా వేసి దోరగా వేయించి తీసి చల్లారనివ్వాలి ∙చల్లారిన పోపును మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి ∙వేయించి ఉంచుకున్న ఆకు, ఉప్పు జత చేసి మరోమారు మెత్తగా గ్రైండ్ చేసి గిన్నెలోకి తీసుకోవాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙రొట్టెలు, అన్నంతో కలిపి తింటే రుచిగా ఉంటుంది. గురుమడి ఆకు వేపుడు కావలసినవి: గురు మడి ఆకు – రెండు కప్పులు; పెసర పప్పు – అర కప్పు (రెండు గంటలు నానబెట్టాలి); కరివేపాకు – రెండు రెమ్మలు; ఉల్లి తరుగు – పావు కప్పు; పసుపు – కొద్దిగా; ఉప్పు – తగినంత; నూనె – ఒక టేబుల్ స్పూను తయారీ: ∙గురుమడి ఆకును ఉప్పు వేసిన గోరు వెచ్చని నీటిలో శుభ్రంగా కడగాలి ∙సన్నగా తరగాలి ∙ స్టౌ మీద బాణలిలో నూనె వేడయ్యాక గురుమడి ఆకు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ కొద్దిసేపయ్యాక నానబెట్టిన పెసరపప్పు, ఉప్పు వేసి బాగా కలిపి మూత పెట్టాలి ∙ ఆకు బాగా వేగిందనిపించాక ఉల్లి తరుగు, కరివేపాకు, పసుపు వేసి బాగా కలిపి మగ్గిన తరవాత దింపేయాలి. ఆకుకూర సజ్జ/జొన్న రొట్టె కావలసినవి: మనకు ఇష్టమైన ఆకు కూర తరుగు – రెండు కప్పులు; జొన్న పిండి లేదా సజ్జ పిండి – నాలుగు కప్పులు; ఉప్పు – తగినంత; నూనె – రొట్టెలు కాల్చడానికి తగినంత తయారీ: ∙ముందుగా ఆకుకూరలను శుభ్రంగా కడిగి సన్నగా తరగాలి ∙స్టౌ మీద బాణలిలో కొద్దిగా నూనె వేసి కాగాక ఆకు కూర వేసి పచ్చి వాసన పోయేవరకు వేయించి, ఒక పాత్రలోకి తీసుకోవాలి ∙ఆకు కూర బాగా చల్లారాక సజ్జ పిండి లేదా జొన్న పిండి, ఉప్పు జత చేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి ∙కొద్దికొద్దిగా పిండి తీసుకుంటూ చేతితో రొట్టె మాదిరిగా తయారుచేసి, పెనం మీద వేసి కాల్చాలి. తెల్ల గలిజేరు ఆకు పప్పు కావలసినవి: తెల్ల గలిజేరు ఆకు – ఒక కప్పు; కందిపప్పు లేదా పెసర పప్పు – రెండు కప్పులు; పచ్చి మిర్చి – 6; ఉప్పు – తగినంత; పసుపు – కొద్దిగా; ఉల్లి తరుగు – పావు కప్పు; వెల్లుల్లి రెబ్బలు – 5; ఇంగువ – కొద్దిగా. పోపు కోసం... ఆవాలు – ఒక టీ స్పూను; జీలకర్ర – ఒక టీ స్పూను; మెంతులు – పావు టీ స్పూను; పచ్చి సెనగ పప్పు – ఒక టీ స్పూను; మినప్పప్పు – ఒక టీ స్పూను; ఎండు మిర్చి – 4 (ముక్కలు చేయాలి); నూనె – ఒక టేబుల్ స్పూను; కొత్తిమీర – కొద్దిగా. తయారీ: ∙ముందుగా తెల్ల గలిజేరు కూర ఆకును శుభ్రంగా కడిగి, సన్నగా తరిగి పక్కన ఉంచాలి ∙ కంది పప్పు లేదా పెసర పప్పును శుభ్రంగా కడిగి తగినన్ని నీళ్లు జత చేసి మెత్తగా ఉడికించాలి ∙స్టౌ మీద బాణలిలో నూనె కాగాక ఇంగువ, పచ్చి సెనగ పప్పు, మినప్పప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండు మిర్చి వరుసగా వేసి వేయించాలి ∙వెల్లుల్లి రెబ్బలు వేసి మరోమారు వేయించాలి ∙తరిగి ఉంచుకున్న తెల్ల గలిజేరు కూర ఆకు, ఉప్పు వేసి బాగా కలిపి మూత ఉంచాలి ∙ఆకు కూర బాగా మగ్గిన తరవాత ఉడికించిన పెసర పప్పు/కందిపప్పు, పసుపు, కరివేపాకు వేసి బాగా కలిపి దించేయాలి ∙కొత్తిమీరతో అలంకరించాలి ∙వేడి వేడి అన్నంలోకి, జొన్న రొట్టెలు, సజ్జ రొట్టెలలోకి ఈ పప్పు రుచిగా ఉంటుంది. దీనినే పునర్నవ అని కూడా అంటారు. - నిర్వహణ వైజయంతి పురాణపండ -
చెక్క పిరమిడ్ ఇంటిపంటల కల్పవల్లి!
- తక్కువ స్థలంలోనే పలు రకాల మొక్కల పెంపకం - అన్ని రకాల మొక్కల పెంపకానికి అనుకూలం తక్కువ స్థలంలోనే వివిధ రకాల ఆకుకూరలు, కాయగూర మొక్కలను కలిపి ఎక్కువ సంఖ్యలో పెంచుకునేందుకు అనువైన బహుళ ప్రయోజనాలు గల చెక్క పిరమిడ్ (మల్టీ ప్లాంటర్)ను విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన కర్రి రాంబాబు (95508 18297) రూపొందించారు. ఇందులో ఒకేసారి 200-300 మొక్కలను పెంచవచ్చు. దీని తయారీలో అంగుళం మందం గల చెక్కలను రాంబాబు వాడారు. దీని తయారీకి రూ. 500 ఖర్చయింది. మొత్తం ఐదు అరలుగా దీన్ని రూపొందించారు. అట్టడుగున ఉన్న అర 4 అడుగుల పొడవు వెడల్పుతో ఉంటుంది. తర్వాత నిర్మించే ప్రతి అరను 4 అంగుళాల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. ఆఖరు అర అడుగు పొడవు అడుగు వెడల్పు ఉంటుంది. ముందుగా ఇంటిపై గచ్చు బండను ఏర్పాటు చేసి వర్మికంపోస్టు, కోకోపిట్ల మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపై చెక్క పిరమిడ్‌ను ఉంచాలి. వేర్లు తక్కువగా పెరిగే కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలను కింది అరల్లోను, ఎక్కువ వేరు వ్యవస్థ ఉండి ఎత్తు పెరిగే బెండ, వంగ విత్తనాలను పై రెండు అరల్లోను వేసుకోవాలి. స్థలం ఎక్కువగా ఉండటం వల్ల వేర్లు ఎక్కువ దూరం విస్తరించి మొక్క పోషకాలను గ్రహిస్తుంది. దృఢంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తాయి. వివిధ రకాల మొక్కలు కలిపి పెంచటం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. బెండ, మిరప, వంగ వంటి మొక్కల నీడన ఆకుకూరల పెరుగుదల బావుంటుంది. నీటిని పొదుపు చేయవచ్చు. 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నీరుపోసి డ్రిప్పు ద్వారా రోజంతా నీటిని సరఫరా చేయవచ్చు. ఇందులో సాగు చేసిన బెండ, వంగ, మిరప వంటి చెట్లు రెండు నుంచి మూడేళ్ల పాటు దిగుబడినిస్తాయి. స్థలం కలిసి వస్తుంది. కుండీలకయ్యే ఖర్చు ఆదా అవుతుంది. ఇంటిపంటలు పెంచేవారు తమకు కావాలసిన కొలతలోను ఈ చెక్క పిరమిడ్లను తయారు చేసుకోవచ్చు. - ఇంటిపంట డెస్క్ -
పాలకూర... కంటిపాప...
పరిపరి శోధన ఆకుకూరలు కంటికి మేలు చేస్తాయని తాజా పరిశోధనలో మరోసారి తేలింది. పాలకూర, తోటకూర వంటి ఆకుకూరలను రోజూ తినే వారిలో గ్లకోమా (కళ్లలో నీటికాసులు) వచ్చే అవకాశాలు ముప్పయి శాతం మేరకు తగ్గుతాయని హార్వర్డ్ మెడికల్ స్కూల్ నిపుణులు నిర్వహించిన పరిశోధనలో తేలింది. ఆకుకూరల్లో పుష్కలంగా లభించే నైట్రేట్లు కళ్లకు శక్తినిస్తాయని, వాటి ప్రభావం వల్ల కళ్లలో నీటికాసులు ఏర్పడే ముప్పు గణనీయంగా తగ్గుతుందని ఈ పరిశోధనకు నేతృత్వం వహించిన డాక్టర్ జే కాంగ్ వెల్లడిస్తున్నారు. లక్ష మందికి పైగా రోగులపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ విషయం రుజువైందని ఆయన చెబుతున్నారు.