చెక్క పిరమిడ్ ఇంటిపంటల కల్పవల్లి!
- తక్కువ స్థలంలోనే పలు రకాల మొక్కల పెంపకం
- అన్ని రకాల మొక్కల పెంపకానికి అనుకూలం
తక్కువ స్థలంలోనే వివిధ రకాల ఆకుకూరలు, కాయగూర మొక్కలను కలిపి ఎక్కువ సంఖ్యలో పెంచుకునేందుకు అనువైన బహుళ ప్రయోజనాలు గల చెక్క పిరమిడ్ (మల్టీ ప్లాంటర్)ను విజయనగరం జిల్లా కొత్తవలస గ్రామానికి చెందిన కర్రి రాంబాబు (95508 18297) రూపొందించారు. ఇందులో ఒకేసారి 200-300 మొక్కలను పెంచవచ్చు. దీని తయారీలో అంగుళం మందం గల చెక్కలను రాంబాబు వాడారు. దీని తయారీకి రూ. 500 ఖర్చయింది. మొత్తం ఐదు అరలుగా దీన్ని రూపొందించారు. అట్టడుగున ఉన్న అర 4 అడుగుల పొడవు వెడల్పుతో ఉంటుంది. తర్వాత నిర్మించే ప్రతి అరను 4 అంగుళాల చొప్పున తగ్గించుకుంటూ వచ్చారు. ఆఖరు అర అడుగు పొడవు అడుగు వెడల్పు ఉంటుంది. ముందుగా ఇంటిపై గచ్చు బండను ఏర్పాటు చేసి వర్మికంపోస్టు, కోకోపిట్‌ల మిశ్రమాన్ని వేసుకోవాలి. దానిపై చెక్క పిరమిడ్‌ను ఉంచాలి. వేర్లు తక్కువగా పెరిగే కొత్తిమీర, పాలకూర వంటి ఆకుకూరల విత్తనాలను కింది అరల్లోను, ఎక్కువ వేరు వ్యవస్థ ఉండి ఎత్తు పెరిగే బెండ, వంగ విత్తనాలను పై రెండు అరల్లోను వేసుకోవాలి. స్థలం ఎక్కువగా ఉండటం వల్ల వేర్లు ఎక్కువ దూరం విస్తరించి మొక్క పోషకాలను గ్రహిస్తుంది. దృఢంగా పెరిగి మంచి ఫలసాయాన్నిస్తాయి.
వివిధ రకాల మొక్కలు కలిపి పెంచటం వల్ల చీడపీడల ఉధృతి తగ్గుతుంది. బెండ, మిరప, వంగ వంటి మొక్కల నీడన ఆకుకూరల పెరుగుదల బావుంటుంది. నీటిని పొదుపు చేయవచ్చు. 10 లీటర్ల ప్లాస్టిక్ డబ్బాలో నీరుపోసి డ్రిప్పు ద్వారా రోజంతా నీటిని సరఫరా చేయవచ్చు. ఇందులో సాగు చేసిన బెండ, వంగ, మిరప వంటి చెట్లు రెండు నుంచి మూడేళ్ల పాటు దిగుబడినిస్తాయి. స్థలం కలిసి వస్తుంది. కుండీలకయ్యే ఖర్చు ఆదా అవుతుంది. ఇంటిపంటలు పెంచేవారు తమకు కావాలసిన కొలతలోను ఈ చెక్క పిరమిడ్‌లను తయారు చేసుకోవచ్చు.
- ఇంటిపంట డెస్క్