'ఆకుకూరలు తినడం ఆరోగ్యానికి మంచిదని అందరికీ తెలుసు. అందుకే ఇంచుమించు అందరూ ఆకుకూరలు తింటారు. అయితే కొన్ని రకాల వ్యాధులకు గురి అయినపుడు కొన్ని రకాల ఆకుకూరలు తీసుకోవడం వల్ల కూడా శరీరానికి సమృద్ధిగా పోషకాలు సమకూరి రోగ నిరోధక శక్తి పెరిగి ఆ వ్యాధి నుంచి తేలికగా బయటపడొచ్చుననే విషయం మాత్రం అందరికీ తెలియదు. అందుకే ఏయే వ్యాధులకు ఏయే ఆకుకూరలు తినడం మంచిదో తెలుసుకుందాం. కొన్ని రకాల అనారోగ్య లక్షణాలకు కొన్ని రకాల ఆకుకూరలు ఎంతో మేలు చేస్తాయి. అవేమిటో చూద్దాం..'
అవిసె ఆకుకూర
అవిసె ఆకులు రుచికి కారంగా... కొంచం చేదుగా ఉంటాయి. కడుపులోని నులిపురుగుల్ని హరించడంలో ఇవి అద్భుతంగా పనిచేస్తాయి ∙ఏకాదశి, శనివారం, శివరాత్రి వంటి ఉపవాసాల్లో ఉన్నవారు ఈ ఆకుకూరని తప్పకుండా తినాలి. దానివల్ల ఉపవాసం మూలంగా వచ్చిన నీరసాన్ని బాగా తగ్గించి, ఉత్సాహాన్నిస్తుంది. గాయాలకు, దెబ్బలకు ఇది మంచి మందు. దీని ఆకులు నూరి చర్మం మీద పట్టుగా వేస్తే తొందరగా తగ్గుతాయి. జలుబు, రొంప ఉన్నప్పుడు అవిసె ఆకుల రసాన్ని కొన్ని చుక్కలు ముక్కులో వేసుకుంటే రొంప, తలనొప్పి తగ్గుతాయి. చిన్నపిల్లలకు ఈ ఆకురసంలో తేనె కలిపి ఇస్తే మంచిది.
కరివేపాకు
కరివేపాకును మన ఆహారంలో భాగం చేసుకోవడం వలన శరీరంలో కఫం, వాతం సమతుల్యంలో ఉంటాయి. విపరీతమైన జిగురుతో కూడిన విరేచనాలు కూడా కరివేపాకు తినడం వల్ల తగ్గుతాయి. కరివేపాకును ముద్దలా చేసి విషజంతువుల కాట్లకు, దద్దుర్లకు బ్యాండేజీలా కడితే సులువుగా తగ్గుతాయి. కరివేపాకు చెట్టు ఆకుల కషాయం కలరా వ్యాధిని నివారిస్తుంది.
కామంచి ఆకు కూర
చాలా చిన్న సైజులో అంటే కందిగింజంత సైజులో ఉండే కామంచి పళ్లని చాలామంది తింటారు. అయితే దీని ఆకులు నూరి ముద్దగా చేసి కట్టుకుంటే నొప్పులు తగ్గుతాయి. ఇదే ముద్దని చర్మంపైన రాసి నలుగు పెట్టుకుంటే చర్మసంబంధమైన సమస్యలు తగ్గుముఖం పడతాయి. శరీరం ఉబ్బుతో కూడి ఉన్న వ్యక్తులకు ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. కామంచి ఆకుల రసాన్ని చెవిలో పిండుతూ ఉంటే చెవిపోటు తగ్గి చీముని కూడా హరిస్తుంది.
గుంటగలగర
జుట్టు సమస్యలకు వాడే మందుగా మాత్రమే ఇది అందరికీ తెలుసు కానీ, దీనిని లోపలికి తీసుకోవడం వల్ల శరీరంలోని వాత, కఫాలను పోగొడుతుంది. దంతాలకు, చర్మానికి చాలా మంచిది. తలనొప్పి, వాపు, దురదలని నివారిస్తుంది. హెర్నియా, ఆయాసం, పొట్టలోని క్రిములు రుమాటిజం, భయంకరమైన రక్తక్షీణత, గుండెజబ్బు, చర్మరోగం వంటి వాటికి బాగా పని చేస్తుంది. గుంటగలగర నేత్రాలకు చలువచేస్తుంది. ఈ ఆకుపసరు సాయంతో తయారైన కాటుక పెట్టుకోవడం వలన కంటిజబ్బులు నయం అవుతాయి. చెవిపోటుగా ఉన్నప్పుడు ఈ ఆకుపసరు ఒకటి రెండు చుక్కలు చెవిలో వేస్తారు. గుంటగలగర జ్వరాన్ని తగ్గిస్తుంది.
గోంగూర
గోంగూర ఆకులనే కాకుండగా పువ్వుల్ని కూడా పచ్చడి చేసుకుంటారు. రేజీకటి రోగం కలవారికి ఈ కూర చాలా మేలు చేస్తుంది. గోంగూర ఉడికించిన నీళ్లు తాగుతూ చప్పిడి పథ్యం చేస్తే ఉబ్బురోగాలు తగ్గుతాయి. గోంగూరను నేతితో ఉడికించి వృషణాలకు కడితే వరిబీజాలు నయం అవుతాయి. బోదకాలు వ్యాధి ఉన్నవారు వేపాకుతో పాటు గోంగూరని నూరి కాళ్లకు కడితే గుణకారిగా ఉంటుంది.
గంగపాయల కూర
రుచికి పుల్లగా ఉండే ఈ ఆకు పాలకంటే, వెన్నకంటే మంచిది. దీనిలో ఎ, బి విటమినులు సమృద్ధిగా ఉన్నాయి. పాలకంటే, వెన్నకంటే కూడా జీవశక్తి అధికంగా ఉందని పరిశోధనలలో తేలింది. అదేవిధంగా రోగ నిరోధక శక్తి అధికం. ఈ కూరలో ఐరన్, కాల్షియం ఎక్కువగా ఉన్నాయి. రక్తహీనత ఉన్న వారు దీనిని తీసుకోవడం వలన చాలా మంచి ఫలితాలు ఉంటాయి. శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్ అనే దుష్టపదార్థాలను తొలగించి బయటకి పంపడంలో దీనిని మించింది లేదు. ఎముకలు, దంతాల పెరుగుదలకు అది అత్యంత అవసరం. కుష్టు, మూత్రాశయంలో రాళ్లు వంటి సమస్యలతో బాధ పడేవారు ఈ కూరని ఆహారంలో భాగం చేసుకోవాలి. వెంట్రుకలకు బలాన్ని ఇస్తుంది.
కొత్తిమీర
కొత్తిమీర కషాయంలో పాలు, పంచదార కలిపి సేవిస్తే రక్తంతో కూడిన మొలల వ్యాధి, అజీర్ణ విరేచనాలు, ఆకలి మందగించడం, కడుపులో గ్యాస్.. వంటి సమస్యలకు మంచి ఔషధంగా పనిచేస్తుంది. కొత్తిమీర రసాన్ని చనుపాలతో కలిపి కళ్లలో వేస్తే నేత్రరోగాలు నయం అవుతాయి. కొత్తిమీరను వెచ్చచేసి కళ్ళకి వేసి కట్టినా సమస్య తీరుతుంది. కొత్తిమీర కషాయంలో పంచదార కలిపి పుచ్చుకుంటే బాగా ఆకలి పుట్టిస్తుంది. నోరు పూసినప్పుడు కొత్తిమీర రసంతో పుక్కిలిస్తే అద్భుతంగా పనిచేస్తుంది.
చామాకు
చామ ఆకు కూర చాలా మంచిది. జబ్బుపడి లేచి నీరసపడిన వారికి ఈ ఆకుకూర అద్భుతంగా పనిచేస్తుంది. పైల్స్‌తో బాధపడేవారు దీనిని తీసుకోవడం చాలా మంచిది. మూత్రవ్యాధులున్న వారికి మంచి మందు. నోటికి రుచి తెలియకపోవడం వంటి సమస్యని నివారిస్తుంది. ఆకలి పుట్టిస్తుంది. ఈ ఆకుని పైన వేసి కట్టు కడితే గాయాలు మానతాయి.
Comments
Please login to add a commentAdd a comment