రక్తంలో చక్కెర ఏ స్థాయిలో ఉందో తెలుసుకోవాలంటే, వేలిమొనపై సూదితో గుచ్చుతారు. అప్పుడు వచ్చే నెత్తుటి చుక్కను గ్లూకోమీటర్ మీద పెట్టి పరీక్షిస్తారు. గ్లూకోమీటర్ ద్వారా నెత్తుటి చుక్కను పరీక్షిస్తే, కేవలం రక్తంలో చక్కెర స్థాయి మాత్రమే తెలుస్తుంది. దానివల్ల శరీరంలోని ఇతరేతర లోపాలేవీ బయటపడవు. అయితే, ఒకే నెత్తుటి చుక్కతో అరవైకి పైగా అంశాలను తెలుసుకునే పరీక్షను లండన్ శాస్త్రవేత్తలు ఇటీవల కనుగొన్నారు.
వేలిమొన నుంచి సేకరించిన ఒకే ఒక్క నెత్తుటి చుక్కతో శరీరంలోని అరవైకి పైగా లోపాలను తెలుసుకోగల పరీక్షను లండన్‌లోని క్వీన్ మేరీ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ క్లాడియా లాంజెన్‌బర్గ్ నేతృత్వంలోని శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ పరీక్ష ద్వారా పందొమ్మిది రకాల క్యాన్సర్, నరాలకు సంబంధించిన మోటార్ న్యూరాన్ డిసీజ్, గుండెజబ్బులు సహా అరవైఏడు రకాల వ్యాధులను ముందుగానే గుర్తించడానికి వీలవుతుంది. బ్రిటన్‌లోని వేర్వేరు ప్రాంతాలకు చెందిన 40 వేల మంది రోగులపై ఈ పరీక్ష నిర్వహించి శాస్త్రవేత్తలు విజయవంతమైన ఫలితాలను సాధించారు. ఈ వివరాలను ‘నేచర్ మెడిసిన్’ తాజా సంచికలో ప్రచురించారు.
Comments
Please login to add a commentAdd a comment