వాన నీరే స్వచ్ఛమైన తాగునీరు! | Rain you drink pure water | Sakshi
Sakshi News home page

వాన నీరే స్వచ్ఛమైన తాగునీరు!

Published Thu, Mar 22 2018 12:47 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

Rain you drink pure water - Sakshi

నీరు.. మనుగడకు ప్రాణావసరం. మారుమూల గ్రామీణులు సైతం క్యాన్‌ నీటిని కొనుక్కొని తాగుతున్న పరిస్థితులున్న కాలం ఇది. ఇక ఎండాకాలం వచ్చిందంటే తాగు నీటి కోసం పడని పాట్లుండవు. అయితే, చిత్తూరు జిల్లా మదనపల్లిలో ఒక కుటుంబం కేవలం తమ ఇంటిపైన కురిసిన వాన నీటినే పట్టుకొని తాగుతున్నది. ఒకటి కాదు, రెండు కాదు.. గత ఆరేళ్లుగా వాన నీటినే పట్టుకొని, శుద్ధి చేసి, భూగర్భ ట్యాంకులో దాచుకొని ఏడాదంతా తాగుతూ పూర్తి ఆరోగ్యంగా ఉంటున్నదో కుటుంబం. అంతేకాదు.. ప్రతి కుటుంబమూ ఇలాగే వాన నీటిని ఒడిసిపట్టుకొని ఏడాదం తా తాగితే నీటి సమస్య తీరడంతోపాటు ఇంటిల్లిపాదీ ఆరోగ్యంగా ఉండడమూ సాధ్యమేనని ప్రచారం చేస్తున్నారు. 

వినడానికి ఆశ్చర్యంగానే ఉన్నా.. ఇది నిజం.., 
ఎం.సి.వి. ప్రసాద్‌ ఇంజినీరింగ్‌ గ్రాడ్యుయేట్‌. 70 ఎకరాల ఆసామి. ప్రకృతి వ్యవసాయదారుడు. మదనపల్లి సమీపంలోని ‘ప్రకృతివనం’ వారి వ్యవసాయ క్షేత్రం. బోర్‌వెల్స్‌లో నీటి మట్టం అట్టడుగుకు వెళ్లేకొద్దీ టీడీఎస్‌ (టోటల్‌ డిసాల్వ్‌డ్‌ సాలిడ్స్‌) పెరిగిపోవడం వల్ల తాగడానికి పనికిరాకుండా పోతూ ఉంటాయి. మదనపల్లి ప్రాంతంలో భూగర్భ జలం లోతు టీడీఎస్‌ 1,500 నుంచి 3,000 మధ్యలో ఉంటుంది. పోనీ క్యాన్‌లలో అమ్మే ఆర్‌.ఓ.(రివర్స్‌ ఆస్మోసిస్‌ పద్ధతిలో శుద్ధి చేసిన) నీరు కొనుక్కొని తాగుదామా అంటే.. ఆర్‌.ఓ. నీటిలో టీడీఎస్‌ మరీ తక్కువగా(20 నుంచి 35) ఉంటున్నాయి. పి.హెచ్‌. 5–6 వరకు ఉండటం వల్ల ఆమ్ల గుణాన్ని సంతరించుకొని ఉంటూ.. ఆరోగ్యానికి హానికరంగా తయారయ్యాయని ప్రసాద్‌ భావించారు. అటువంటి పరిస్థితుల్లో నిపుణులను సంప్రదించి.. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాననీటిని దాచుకొని తాగుతున్నారు. రాయలసీమవాసులకే కాదు, ఫ్లోరైడ్‌ పీడిత నల్లగొండ ప్రాంత వాసులకే కాదు... ప్రపంచవ్యాప్తంగా ఎవరికైనా ఆరోగ్యదాయకమైన తాగు నీరు వాన నీటి సంరక్షణ ద్వారానే సాధ్యమని ప్రసాద్‌ చెబుతున్నారు. 

వాన నీటిని పట్టుకొనేదిలా...
రాయలసీమలో 500 మి.మీ. వర్షం కురుస్తుంది. డాబా ఇంటి పైకప్పు మీద ప్రతి చదరపు అడుగుకు 50 లీటర్ల చొప్పున వాన నీటిని ఒడిసిపడుతున్నారు. ఇంటిపై నుంచి పైపుల ద్వారా కిందికి వచ్చే నీరు తొలుత రెయిన్‌ ఫిల్టర్‌ ద్వారా ప్రవహించి మట్టి, ఆకులు, చెత్త లేకుండా క్లీన్‌ అవుతాయి. వాన నీరు స్వచ్ఛమైనది. అయితే, అందులో లవణాలు ఉండవు. కానీ, లవణాలతో కూడిన నీరే ఆరోగ్యదాయకమైనది కాబట్టి, ఆ నీటికి లవణాలు కలపాలి. అదీ సులభమే. వాన నీటిని మినరలైజేషన్‌ ట్యాంకులో నుంచి ప్రవహించేలా ఏర్పాటు చేసుకుంటే సరి. సున్నపురాయి, కుండ పెంకులు, బొగ్గులు, ఇసుక, గులకరాళ్లను పొరలుగా వేసి ఉండడం వల్ల ఈ ట్యాంకులో నుంచి ప్రవహించే నీరు ఆరోగ్యదాయకమైన తాగు నీరుగా మారతాయి. ఆ నీటిని భూమిలో నిర్మించుకున్న ట్యాంకులోకి పంపి నిల్వ చేసుకుంటున్నారు. అలా నిల్వ చేసుకునే నీటిని మోటారు ద్వారా లేదా చేతి పంపు ద్వారా ప్రతి రోజూ పంప్‌ చేసుకొని తాగునీరుగా ఉపయోగించుకుంటున్నారు. భూగర్భ ట్యాంకులో నిల్వ ఉండే తాగునీటికి గాలి, వెలుతురు తగలకుండా జాగ్రత్తపడితే చాలు... నాచు పట్టదు. నీరు పాడవదు. ఇలా ప్రతి ఏటా 40 వేల లీటర్ల వాన నీటిని పట్టుకొని, శుద్ధి చేసుకొని, జాగ్రత్త చేసుకున్న నీటినే ఏడాది పొడవునా ప్రసాద్‌ కుటుంబంలోని ఆరుగురు, ప్రకృతివనంలో పనిచేసే 50 మంది పనివారు, అతిథులు పిల్లాపాపలతో సహా నిరభ్యంతరంగా తాగుతూ ఆరేళ్లుగా ఆరోగ్యంగా ఉన్నారు. తొలుత బెంగళూరులోని కర్ణాటక ప్రభుత్వ మహిళా శిశుసంక్షేమ శాఖ వద్ద, ఇటీవల ఎస్సెన్‌ అండ్‌ కో లోనూ పరీక్షలు చేయించి నీటి నాణ్యతను నిర్థారించుకున్నామని ప్రసాద్‌ తెలిపారు. తాము తాగే నీటిని పరీక్షిస్తే టీడీఎస్‌ 208, పి.హెచ్‌. 7.13 మధ్య ఉందని, ఇది ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్‌ వాటర్‌ అన్నారు.  

ఇంతకీ ఎంత ఖర్చవుతుంది?
వాన నీటిలో నుంచి డస్ట్‌ క్లీన్‌ చేసే రెయిన్‌ ఫిల్టర్‌ రూ. 7,500, మినరలైజేషన్‌ ట్యాంకు స్టీల్‌దైతే రూ. 10 వేలు(సిమెంటుదైతే రూ. 4 వేలు) ఖర్చవుతుంది. భూగర్భంలో నీటి నిల్వ ట్యాంకు నిర్మాణానికి లీటరుకు రూ. 4–5 ఖర్చవుతుంది. 1500 చదరపు అడుగుల ఇంటి కప్పు నుంచి వాన నీటిని సేకరించి నిల్వ చేసుకోవడానికి సుమారు రూ. 50,000 వరకు ఖర్చవుతుంది. ఆ తర్వాత ఏ ఖర్చూ లేకుండానే.. మబ్బుల్లో నుంచి వచ్చే స్వచ్ఛమైన, అమూల్యమైన చెలమ నీటిని తాగొచ్చని ప్రసాద్‌ అనుభవపూర్వకంగా చెబుతున్నారు.  సొంత ఇల్లు లేక లేదా మరే ఇతర కారణంగానైనా ఆర్‌.ఓ. నీటిని తాగే వారు కూడా.. ఆరోగ్యదాయకమైన ఆల్కలైన్‌ వాటర్‌ స్వంతంగా తయారు చేసుకొని తాగడానికీ మరో మార్గం ఉందని ప్రసాద్‌ అంటున్నారు. ఆర్‌.ఓ. వాటర్‌ను మినరలైజేషన్‌ ట్యాంకులో పోసుకొని.. 4 గంటల తర్వాత.. ఆ నీటిని పట్టుకొని తాగవచ్చని, ఈ నీరు కూడా ఆరోగ్యదాయకమైన అల్కలైన్‌ వాటరేనని ప్రసాద్‌ చెబుతున్నారు. మినరలైజేషన్‌ ట్యాంకును 30–50 లీటర్లు పట్టే స్టెయిన్‌లెస్‌ స్టీల్‌ పాత్రతో లేదా మట్టి పాత్రతో ఎవరికి వారు తయారు చేసుకోవచ్చు. ఈ విషయంలో ఎవరికైనా సందేహాలున్నా తీర్చడానికి, వీడియో కాల్‌ చేస్తే ‘ప్రకృతివనం’లో తాము వాడుతున్న ఫిల్టర్లను చూపడానికి కూడా సంసిద్ధంగా ఉంటామని ప్రసాద్‌ తెలిపారు. ఆసక్తి గల వారు వెంకట్‌రెడ్డి– 89198 96367, ఎం.సి.వి. ప్రసాద్‌– 94401 68816 నంబర్లలో సంప్రదించవచ్చు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement