
ఈ నది నవ్వూ... పచ్చదనమే!
నదులు, చెరువులు... పార్కులకు ఈ కాలపు నగరాల్లో చోటు దొరకడం కష్టమే. హైదరాబాద్, బెంగళూరులనే ఉదాహరణగా తీసుకుంటే ఒకప్పుడు ఈ రెండు నగరాల్లో వందలకొద్దీ చెరువులు, కుంటలుండేవి.
నదులు, చెరువులు... పార్కులకు ఈ కాలపు నగరాల్లో చోటు దొరకడం కష్టమే. హైదరాబాద్, బెంగళూరులనే ఉదాహరణగా తీసుకుంటే ఒకప్పుడు ఈ రెండు నగరాల్లో వందలకొద్దీ చెరువులు, కుంటలుండేవి. ఆక్రమణలపాలై ఒక్కొక్కటీ కనిపించకుండాపోయాయి. దీంతో చిన్నపాటి వర్షాలకే మునిగిపోయే జనావాసాలు, కాలనీలు! ఇప్పుడు ఈ విషయమంతా ఎందుకంటే.. పక్క ఫొటోలో చూడండి... ఇది అమెరికాలోని డల్లాస్ నగరం సంకల్పించిన పర్యావరణ హితమైన అతి భారీ ప్రాజెక్టు. నగర ప్రాంతాల్లో తరచూ ముంపు ప్రమాదానికి కారణమవుతున్న ట్రినిటీ నదిని సరికొత్తగా ముస్తాబు చేసేందుకు, అమెరికాలోనే అతిపెద్ద పార్కుగా అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది.
‘నేచర్ డిస్ట్రిక్ట్’ పేరుతో చేపట్టిన ఈ ప్రాజెక్టు అనుకున్నది అనుకున్నట్టుగా పూర్తయితే దాదాపు పదివేల ఏకరాల్లో భారీ పచ్చ‘ధనం’ సిద్ధమవుతుంది. మైకేల్ వాన్ వాల్కెన్‌బర్గ్ అసోసియేట్స్ అనే ఆర్కిటెక్చర్ సంస్థ ఈ ప్రాజెక్టును డిజైన్ చేసింది. వరద ముప్పును గణనీయంగా తగ్గిస్తూనే.. నదీ పరిసర ప్రాంతాలను అద్భుతమైన పార్కుగా తీర్చిదిద్దేలా వీరు డిజైన్‌ను రూపొందించారు.
ఇప్పటికే అక్కడ గ్రేట్ ట్రినిటీ ఫారెస్ట్ పేరుతో దాదాపు 7000 ఎకరాల అడవి ఉంది. మరో వెయ్యి ఎకరాల్లో పిల్లల ఆటస్థలాలతోపాటు గోల్ఫ్ క్లబ్, గుర్రపుశాల వంటివి ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా పచ్చటి మైదానాలు, ఆటస్థలాలు వంటివాటితో కలిపి ట్రినిటీ రివర్‌పార్క్ సిద్ధమవుతుంది. ఇప్పటికే ఈ పార్కు కోసం స్థానికులు దాదాపు 5 కోట్ల డాలర్ల విరాళాలు అందించారు. బాండ్ల అమ్మకం ద్వారా మరో మూడు కోట్ల డాలర్లు సేకరించారు.