డల్లాస్ : అమెరికాలోని ఉత్తరా టెక్సాస్‌లో తెలంగాణకు చెందిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తూ మృతి చెందారు. కామారెడ్డి జిల్లా మచారెడ్డి మండలం ఆరెపల్లికి చెందిన వెలమ వెంకట్రామిరెడ్డి (40) వారాంతం కావడంతో కుంటుంబసభ్యులతో కలిసి శనివారం సరదాగా గ్రేప్‌వైన్ సరస్సులో బోటింగ్ చేయడానికి వెళ్లారు. పొంటూన్ బోటు నుంచి ఈత కొట్టడానికి నీళ్లలోకి దూకిన ఆయన ఎంతకూ పైకి రాకపోవడంతో రెస్క్యూ సిబ్బందికి సమాచారం అందించారు.
నీళ్లలో మునిగిపోయిన వెంకట్రామిరెడ్డి కోసం రెస్క్యూ సిబ్బంది గాలింపు చర్యలు జరిపి 24 గంటల తర్వాత ఆదివారం అతడి మృతదేహాన్ని కనుగొన్నారు. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బోటులో 12 మంది ఉన్నారు. వెంకట్రామిరెడ్డి డల్లాస్‌లో గ్లోబల్ ఐటీ కంపెనీలో ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు. ఆయన భార్య వాణి కూడా ఉద్యోగిని. ఆయన మృతదేహం వారం రోజుల్లో స్వదేశానికి రానుంది. ఈ సంఘటనతో వెంకట్రామిరెడ్డి స్వస్థలం ఆరెపల్లిలో విషాదం నెలకొంది. మరోవైపు డల్లాస్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
కాగా ఆదివారం అదే సరస్సులో జరిగిన మరో ప్రమాదంలో సరస్సులో మునిగిపోయిన ఓ 25 ఏళ్ల యువకుడిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు. అతడిని బెయిలర్ స్కాట్ అండ్ వైట్ మెడికల్ సెంటర్‌లో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉన్నట్టు వైద్యులు తెలిపారు. ఈ రెండు ఘటనల్లో బాధితులు లైఫ్ జాకెట్ ధరించకపోవడం వల్లే ప్రమాదం చోటుచేసుకుందని గ్రేప్ వైన్ ఫైర్ డిపార్ట్ మెంట్ అసిస్టెంట్ చీఫ్ జాన్ షేర్‌వుడ్ తెలిపారు. ఈ ప్రమాదం దురదృష్టకరమని, బోటింగ్, స్మిమ్మింగ్ చేసే వారు లైఫ్ జాకెట్లు తప్పని సరిగా ధరించి ముందుజాగ్రత్త చర్యలు పాటించాలని సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment