ఉత్తర అమెరికా తెలుగు సమితి (నాటా) డాలస్ లో నిర్వహించిన నాటా కన్వెన్షన్ 2023లో ఎన్నో విభిన్న సాంస్కృతిక కార్యక్రమాలు జరిగాయి. వాటిల్లో నాటా విమెన్ ఫోరమ్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. స్వాతి సానపురెడ్డి, నాటా మహిళా ఫోరం ఛైర్‌పర్సన్ సభను ఉద్దేశించి స్వాగత ఉపన్యాసంలో తెలుగు మహిళలు చేసిన పనులు స్ఫూర్తిదాయకం అన్నారు.
ఏ ఏ అంశాలు?
గృహహింస, మహిళా ఆరోగ్యం, స్థానిక రాజకీయాల్లో మహిళల పాత్ర, లైంగిక వేధింపులు, హాలీవుడ్ సినిమాలో నటించడం వంటి అంశాలపై చర్చలు జరిగాయి. నాటా మహిళా ఫోరం సలహాదారులు కృష్ణవేణి రెడ్డి, లక్ష్మి అన్నపూర్ణ పాలేటి ఆధ్వర్యంలో కార్యక్రమాలు వినూత్నంగా రూపొందించారు. ఇందులో పాల్గొన్న వారు, నిర్వాహకులు, సమన్వయ కర్తలు అందరూ మహిళలే అవడం, "మా అందరిదీ ఒకే మాట ఒకే బాట" అంటూ ఉత్సాహంగా పాల్గొనడం విశేషం.
ఉమాభారతి కోసూరి (నృత్య సాహిత్య కళా భారతి) మధురమైన వాక్ చాతుర్యంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. మనీ శాస్త్రి (అమేరికోకిలా) మధురమైన గళముతో పాడి వినిపించారు. మహిళా పరివర్తన - దశాబ్దాలుగా 'స్త్రీ' ఎదుగుదల - సంగీత సాహిత్య దృశ్య కథనం విభాగంగా అతివల గురించి అందమైన శ్రవణ దృశ్యాలతో పాటు చక్కని మాటలతో పాటలతో మనసుకు హత్తుకునేలా చేశారు.
మహిళా విశిష్టత
మహిళా ప్రతిభ - చరిత్రలో తెలుగింటి ఆడపడుచులతో ముఖాముఖి అనే కార్యక్రమంలో ఆడపడుచుల అనుభవాలను, అనుభూతులను, కష్టాలను, ఎదుగుదల, ఈ స్థాయికి ఎలా వచ్చారో ప్రేక్షకులతో పంచుకునే అవకాశం కల్పించారు అమల దుగ్గిరాల (EVP ఎంట్రప్రెస్స్ CIO at USAA ), ఉమా దేవిరెడ్డి (TEDx Leadership Coach),, ప్రేమ రొద్దం (Corporate & Business Immigration Attorney ) స్పూర్తిదాయకమైన స్త్రీలు వారి జీవితంలో ఎన్నుకున్న వృత్తి ఎంతవరకు వారు న్యాయం చేశారో చేస్తున్నారో చర్చించారు.
అమ్మ నుండి అంతరిక్ష మహిళ వరకు
“మహిళలు తమ జీవన విధానంలో అలవర్చుకోవాల్సిన సంస్కరణలు, మహిళా సాధికారతకు తమవంతుగా మహిళలు తాము వున్నాం అని తెలపడం జరిగింది. అమ్మ నుండి అంతరిక్షం వరకు వివిధ బాధ్యతలు నిర్వహిస్తున్న మహిళలు.. ఎందులోనూ తీసిపోరు అన్నట్లు వసంత లక్ష్మి అయ్యగారితో నిర్వహించిన మహిళా మిమిక్రీ కార్యక్రమం అత్యంత జనరంజకంగా సాగింది.
ఇన్నాళ్లు మగవాళ్ళు మాత్రమే చేయగలరు అనుకున్న ఈ మిమిక్రీ కళను అత్యంత సమర్థతతో నిర్వహించి కడుపుబ్బా నవ్వించారు. మరికాస్త హాస్యం కోసం ‘టాక్ ఆఫ్ ది టౌన్ 'లో సజితా తిరుమలశెట్టి , కవిత రాణి కోటి ప్రేక్షకులకు వీనుల విందు చేశారు. మనీ శాస్త్రి వారి మధురమైన గళముతో పాడి వినిపించారు, ఉమాభారతి కోసూరి వ్యాఖ్యాతగా (నరేషన్) సంగీత సాహిత్య సమ్మోహనం - మాన్యుల మన్నన మనల్ని అలరించే ఓ అద్భుతమైన దృశ్యం.
ముఖ్య అతిధులుగా వాసిరెడ్డి పద్మ, ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ విమెన్ కమిషన్ చైర్ పర్సన్ మరియు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి, ఛైర్ పర్సన్ అఫ్ TTD LAC in ఢిల్లీ ఉమెన్స్ ఫోరమ్.. మహిళలందరిని ప్రశంసించారు. ఇక్కడి మహిళలు తమ వృత్తిని, తెలుగు సంస్కృతిని అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.
అనేక జనరంజక కార్యక్రమాలలో 35 సంవత్సరాల అనుభవం ఉన్న కూచిపూడి నృత్య కళాకారిణి పద్మ శొంఠి నృత్య కార్యక్రమం, మహిళా రక్షణ గురించి వివేక్ తేజ చెరుపల్లి ప్రసంగం తో పాటుగా మహిళలు తనకు తానుగా రక్షణ, భద్రత ఉపాయాలు మెళకువలు తెలిపారు. వైష్ణవి రామరాజు 'సొగసు చూడతరమా' అంటూ మన భారతదేశంలో ఉన్న వివిధ ప్రాంతాల్లో వేసుకునే మహిళల వస్త్రధారణ తీరులను ప్రదర్శన చేయడం ఈ కార్యక్రమానికి హైలైట్ అయింది. అరుణ సుబ్బారావు (పేరడీ క్వీన్, ఫోక్ సింగర్)- తన పేరడీ తో పాటు కొన్ని ఫోక్ పాటలు కూడా పాడి వినిపించడం ద్వారా ప్రేక్షకులు ఎంతో ఆనందించారు.
మహిళ ప్రతిభ మహిళా సాధికారత” (Women Empowerment) విభాగంలో మన తెలుగింటి ఆడపడుచులు పల్లవి శాస్త్రి (Hollywood Producer & Actress) వారి మూవీ "LAND GOLD" (Brilliant Film on Faith Family & Culture in America) కీర్తన శాస్త్రి, Hollywood Producer & Casting Director) మరియు అపూర్వ గురుచరణ్ (Los Angels based Indian Producer) మూవీ "JOYLAND " వారిని 'మహిళా ప్రతిభ' పురస్కారాలతో సత్కరించారు.
ఈ కార్యక్రమాలలో వేటికవే గొప్ప ప్రదర్శనలు అయినప్పటికీ 'పురాతన సంప్రదాయ చీరల ప్రదర్శన' మాత్రం సంభ్రమాశ్చర్యాలకు గురి చేసింది. 1930 నుండి 1990 వరకు ఎప్పుడు ఎక్కడ ఎవరు చూడని చీరల ప్రదర్శన, ఒక్కటి కాదు రెండు కాదు దాదాపు 40 చీరలు పైగా ఈ ప్రదర్శనలో చూడటం జరిగింది. ఆ కాలంలో వాడిన కాంచీపురం, ధర్మవరం, ఆరణి, వేంకటగిరి, మంగళగిరి, పైతాని, బనారస్, షికార్గ్, కశ్మీరీ పట్టు చీరలు , ఈ కాలంలో దొరకని అపురూప చీర సంపదలను ప్రదర్శించి, ఆహూతులను అచ్చెరువొందేలా చేశారు. ఈ చీరలను చూసి తమ అమ్మమ్మ, నానమ్మ దగ్గర చూసిన చీరలు అని అందరూ తమ గత జ్ఞాపకాల్లోకి జారుకుని, ఆనందానుభూతులకు లోనయ్యారు.
సంధ్య పుచ్చలపల్లి (ఫౌండర్ అఫ్ ఆర్తి హోమ్) చీరలు మగ్గం మీద నేయడం ఒకొక్కటిగా వివరించి, నేత కార్మికులకు కృతజ్ఞతలు తెలపడం, చీర యొక్క పుట్టుపూర్వోత్తరాలు వివరించడం విశేషం.
ఆఖరున కృష్ణవేణి రెడ్డి శీలం, NATA ఉమెన్స్ ఫోరమ్ Advisor కార్యక్రమంలో పాల్గొన్న అతిధులకు, అభిమానులకు, NATA ప్రెసిడెంట్ శ్రీ కొర్సపాటి శ్రీధర్ గారికి మరియు వారి కార్యవర్గానికి NATA ఉమెన్స్ కార్యవర్గం తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నభూతో న భవిష్యతి అన్న రీతిలో మహిళల ప్రాధాన్యత, వారి గొప్పతనం ప్రపంచానికి తెలిసేలా చేయడమే లక్ష్యంగా చేసిన ఈ ప్రయత్నం అంచనాలను మించి విజయవంతం అయిందని, దీనికి తోడ్పాటు అందించిన వారిందరికి నాటా మీడియా అడ్వైజర్ కోటిరెడ్డి ధన్యవాదాలు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment