NATA Convention 2023: మీ ప్రేమను ఎప్పటికీ మర్చిపోలేను.. సీఎం జగన్
అమెరికాలోని డాల్లస్‌లో జరుగుతున్న నాటా తెలుగు మహా సభలనుద్దేశించి ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి వీడియో త్వారా తన సందేశం ఇచ్చారు. ముఖ్యమంత్రి సందేశాన్ని నాటా సభల్లో ప్రదర్శించారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. 2023 నాటా కన్వెన్షన్‌కు హాజరైన ప్రతి ఒక్కరికీ బెస్ట్ విషెస్ తెలియజేశారు. నాటా కార్యవర్గానికి ముఖ్యంగా శ్రీధర్, అనిల్, ప్రేమసాగర్తో పాటు అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. నాలుగేళ్ళ కిందట తాను డాల్లస్ వచ్చిన సందర్భం ఇప్పటికీ గుర్తుందన్నారు. మీరంతా నా మీద చూపించిన ప్రేమ, అభిమానం, ఆప్యాయత ఎప్పటికీ మర్చిపోలేనని అన్నారు.
మిమ్మల్ని చూసి గర్వపడుతున్నాం
‘వేరే దేశంలో ఉన్నా, ఇంత మంది తెలుగువారు. గొప్పవైన మన సంస్కృతి, సాంప్రదాయాల్ని కాపాడుకుంటూ చక్కటి ఐకమత్యాన్ని చాటటం ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. మిమ్నల్ని అందరినీ ఒకసారి తల్చుకుంటే.. అక్కడ పెద్ద, పెద్ద కంపెనీలలో సీఈఓలుగా ఐటీ నిపుణులుగా, నాసా వంటి సంస్ధల్లో కూడా సైంటిస్టులగానూ, అనేక విశ్వవిద్యాలయాల్లో ప్రొఫెసర్లుగా, అమెరికా ప్రభుత్వంలో కూడా ఉద్యోగులుగా, బిజినెస్‌మెన్‌గా, మంచి డాక్టర్లుగా రాణిస్తున్న తీరుకు మిమ్నల్ని చూసి మేమంతా ఇక్కడ గర్వపడుతున్నాం.
మీలో అనేకమంది మూలాలు.. మన గ్రామాల్లోనే కాకుండా మన మట్టిలో ఉన్నాయి. మీలో అనేకమంది పేద, మధ్యతరగతి కుటుంబాల్లో నుంచి వచ్చినా.. అక్కడకి వెళ్లి ఇలా రాణించడానికి.. మీ కఠోరమైన కమిట్మెంట్, ఫోకస్ ఈ రెండూ మిమ్మల్ని ఆ గడ్డ మీద నిలబెట్టాయి. నిజంగా మిమ్నల్ని చూసినప్పుడు ఆ స్ఫూర్తి మాలో ప్రతి ఒక్కరికీ వస్తుంది. అలాం కమిట్మెంట్, ఫోకస్ మన రాష్ట్రంలోని మన పిల్లల్లో ఎంతగానో ఉండటం నేను నా కళ్లారా చూశాను. ఆకాశమే హద్దుగా.. ఆకాశాన్ని దాటి వెళ్లాలన్న కోరికతో ఉన్న వారు ఎదగాలంటే, అందుకు వారికి కావాల్సిన సదుపాయాలు కల్పించాలన్న తపనతో ఈ నాలుగు సంవత్సరాల కాలంలో విద్యారంగంలో విప్లవాత్మక మార్పులు తేగలిగాం.
చదువే సాధనం
గ్లోబల్ సిటిజన్‌గా మనం ఎదగాలంటే.. చదువన్నది ఒక పెద్ద అవసరమైన సాధనం. అందుకనే రాష్ట్రంలో విద్యారంగంలో తెచ్చిన విప్లవాత్మ మార్పులు గమనించినట్లైతే.. మన గవర్నమెంట్ బడులన్నీ కూడా పూర్తిగా రూపురేఖలు మారుతున్నాయి. నాడు-నేడు అనే గొప్ప కార్యక్రమం చేస్తున్నాం. స్కూళ్లలో ఉన్న మౌలికసదుపాయాల రూపురేఖలన్నీ మారుస్తున్నాం.
8వ తరగతిలోకి రాగానే మన ప్రభుత్వ బడిలో చదువుతున్న పిల్లలకు.. ట్యాబ్‌లు ఇస్తున్నాం. 3వ తరగతి నుంచి సబ్జెక్ట్ టీచర్లను నియమించాం. 6వ తరగతి నుంచి ప్రతి తరగతిలోనూ డిజిటల్ విద్యను అందించేలా ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తున్నాం. 6వతరగతి ఆపైన అన్ని తరగతి గదుల్లోనూ ఈ డిసెంబరు నాటికి ఇంటరాక్టివ్ ప్లాట్ ప్యానల్స్ ఏర్పాటు పూర్తి అవుతుంది. ప్రభుత్వ బడుల్లోనే 3వ తరగతి నుంచే టోఫెల్లో శిక్షణ ఇచ్చేందుకు ఈటీఎస్ ప్రిన్స్టన్తో ఒప్పందం చేసుకున్నాం. 3వతరగతి నుంచే టోఫెల్ ప్రైమరీ, టోఫెల్ జూనియర్ ఇలా పదోతరగతి వరకూ శిక్షణ ఇస్తారు. ఇంటర్మీడియట్లో టోఫెల్ సీనియర్‌ను కూడా వచ్చే సంవత్సరం ప్రవేశపెట్టబోతున్నాం.
విద్యావ్యవస్థలో మార్పులు
అమ్మ ఒడి, గోరుముద్ద, విద్యా కానుక, ఉన్నత విద్యలో అయితే విద్యా దీవెన, వసతి దీవెన లాంటి పథకాలన్నీ కూడా ఏపీలో గొప్పగా అమలు చేస్తున్నాం. ఇవన్నీ చదువుకుంటున్న పిల్లల కోసం విద్యావ్యవస్ధలో తెస్తున్న మార్పులు. చదువు అనే ఒక ఆయుధం ఎంత అవసరమో చెప్పడానికే ఇవన్నీ ఇంతగా చెప్పాల్సి వస్తుంది. దీని గురించి సుదీర్ఘంగా వివరించే సమయం లేకపోయినా.. మన రాష్ట్రంలో మన తర్వాత తరం గురించి ఎంత చిత్తశుద్ధితో ఆలోచనలు చేస్తున్నామో మీ అందరికీ క్లుప్తంగా వివరించగలిగాను.
విద్యారంగం ఒక్కటే కాదు... ఏ రంగాన్ని తీసుకున్నా ఇలాంటి మార్పులే కనిపిస్తాయి. మీ గ్రామంలో ఎప్పడూ చూడని విధంగా విలేజ్ సెక్రెటేరియట్ మీ కళ్లెదుటనే కనిపిస్తుంది. అందులో దాదాపు 10 మంది పిల్లలు మన ఊరికి సంబంధించిన సేవలు అందిస్తూ కనిపిస్తున్నారు. బర్త్ సర్టిఫికెట్ నుంచి దాదాపు 600 రకాల సేవలు ప్రతి 2000 మందికి ఒకటి చొప్పున గ్రామ సచివాలయాలు తీసుకొని వచ్చి వాటి ద్వారా మన గ్రామంలోనే సేవలందుతున్న గొప్ప పరిస్థితి ఉంది. మన గ్రామంలోనే ప్రతి 50 నుంచి 100 ఇళ్లకు ఒక వాలంటీర్.. పౌర సేవల్ని ఇంటింటికీ డోర్ డెలివరీ చేస్తున్నాడు. పెన్షన్, రేషన్.. అన్నీ మన ఇంటి ముంగటికే వచ్చే గొప్ప వాతావరణం మన రాష్ట్రంలో కనిపిస్తుంది.
ప్రతి గ్రామంలోనూ రైతు భరోసా కేంద్రం
ఇవాళ ప్రతి గ్రామంలోనూ ఒక రైతు భరోసా కేంద్రం కనిపిస్తోంది. పంట విత్తనం నుంచి పంట అమ్మకం వరకూ ప్రతి రైతును చేయిపట్టుకుని నడిపిస్తున్న గొప్ప వ్యవస్ధ మన గ్రామంలోనే కనిపిస్తుంది. ఇంకా నాలుగు అడుగులు వేస్తే మన గ్రామంలోనే విలేజ్ క్లినిక్‌లు కనిపిస్తాయి. మొట్టమొదటిసారిగా ప్రివెంటివ్ కేర్ మీద ఇంత ధ్యాస పెట్టిన పరిస్థితి బహుశా ఎప్పడూ చూసి ఉండరు. బీపీ, షుగర్ వంటి ఎన్సీడీ డిసీజస్ పెద్ద పెద్ద రోగాలకు ఇవే కారణాలుగా కనిపిస్తున్నాయి. సరైన టైంలో ట్రీట్మెంట్ చేయలేకపోతే బ్లడ్ ప్రెజర్ కార్డియాక్ అరెస్టుకు, షుగర్ కిడ్నీ వ్యాధులకు దారితీస్తాయి.
రాబోయే రోజుల్లో మెడికల్ బిల్స్‌ను కట్టడి చేయాలంటే.. ప్రివెంటివ్ కేర్ అన్నది చాలా ప్రాముఖ్యమున్న అంశం. ఇవాళ ప్రివెంటివ్ కేర్‌లో ఎక్కడా చూడని విధంగా మన గ్రామంలోనే అడుగులు కనిపిస్తున్నాయి. ప్రతి గ్రామంలోనూ ఒక విలేజ్ క్లినిక్.. దానికి అనుసంధానంగా ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్‌ను తీసుకునివచ్చాం. ఎప్పుడూ చూడని విధంగా టెర్షిరీ కేర్‌లో 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చాం. ఒక్క వైద్య రంగంలోనే 48వేల పోస్టులను భర్తీ చేశాం. నాడు నేడుతో ప్రతి ఆసుపత్రిని.. విలేజ్ క్లినిక్ నుంచి మొదలుకుని పీహె చ్‌సీలు, సీహెచ్‌లు, ఏరియా ఆసుపత్రులు, జిల్లా ఆసుపత్రులు, బోధనాసుపత్రులన్నింటిలోనూ నాడు నేడు ద్వారా రూపురేఖలు మార్చే కార్యక్రమం కనిపిస్తోంది.
ప్రతి గామంలోనూ ఇంగ్లీష్ మీడియం స్కూల్స్
ప్రతి గ్రామంలోనూ మరో నాలుగు అడుగులు వేస్తే ఇంగ్లీష్‌మీడియం బడులు కనిపిస్తాయి. బైలింగువల్ టెక్ట్స్‌బుక్స్‌ను మన స్కూలు పిల్లలు చదువుతున్నారు. ఇంగ్లీష్అన్నది ప్రపంచంలో విజ్ఞానాన్ని మనం నేర్చుకునేందుకు, చదువుకునేందుకు ఉపయోగపడే ఒక గొప్ప మీడియం. గ్లోబల్ సిటిజన్‌గా మన పిల్లలు ఎదగటానికి ఇంగ్లీష్ ఒక సాధనం. ఏది కావాలన్నా.. సైన్సెస్‌లో ఏది చదువుకోవాలన్నా, ఆర్ట్స్‌లో ఏది చదువుకోవాలన్నా, ఇంజనీరింగ్‌లో ఏది చదువుకోవాలన్నా.. చివరికి పిల్లలు తమకు తాముగా ఏ సబ్జెక్ మీద అయినా అవగాహన పెంచుకోవాలన్నా.. ముందు వారికి ఇంగ్లీష్ మీద పూర్తిస్ధాయిలో పట్టు రావాలి.
వారికి కావాల్సినంత కంటెంట్ ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సంస్థలు మనకు ఇంటర్నెట్లో అందుబాటులోకి తీసుకువచ్చాయి. అది కూడా ఉచితంగా తీసుకొచ్చాయి. మన ఫోన్లోనే ఇవన్నీ అందుబాటులో ఉన్న పరిస్థితి కనిపిస్తోంది. ఇవన్నీ సాధ్యం కావాలంటే.. అది కేవలం ఇంగ్లిష్ ద్వారా మాత్రమే వీలవుతుంది. కాబట్టే, ప్రపంచంలోకి వెళ్ళేందుకు కావాల్సిన ఇంగ్లీష్ భాష పునాదిని మనం గట్టి పరుస్తున్నాం.
మీ అందరితో పంచుకోవాల్సిన విషయాలు ఏంటంటే..
నేడు ఏపీలో పరిస్థితి ఎలా ఉందో గమనిస్తే.. రాష్ట్రంలో కనీవినీ మార్పులు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలో రూరల్ ఎకానమీ సస్టైనబులిటీని పరిశీలిస్తే.. ప్రతి ఒక్కరూ కూడా కన్జూమెన్స్ అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్లిపోతే.. రేపు ఉత్పత్తిదారులగా ఎవరూ ఉండని పరిస్థితి కనిపిస్తుంది. రూరల్ ఎకానమీని ఎవరైనా నిర్లక్ష్యం వహిస్తే.. వినియోగం పెరిగిపోయి, ఉత్పత్తి చేసేవాళ్లు ఎవరూ లేకుండా పోతారు. దీనివల్ల ఆహార ధాన్యాల కొరత ఏర్పడుతుంది. అలా జరిగితే మనం ఆహార ధాన్యాలను బయట దేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది.
బయట దేశాల నుంచి ఎప్పుడైతే దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి వస్తుందో అప్పుడే ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే ఆహార ధాన్యాలను పండించిన తర్వాత మనం వాటిని లాభాలకే అమ్ముతాం. ఆ తర్వాత ఏ దేశమైనా వాటిని దిగుమతి చేసుకోవాలంటే.. వాటి మీద లాజిస్టిక్స్ కాస్ట్ కూడా ఉంటుంది. దాని తర్వాత వాళ్లు మరలా రీటైల్ మార్జిన్స్, డిస్ట్రిబ్యూషన్ కాస్ట్ పెట్టుకుంటారు. అన్నీ కలుపుకుంటే.. ఏ దేశమైనా ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకోవడం మొదలుపెడితే.. ద్రవ్యోల్బణాన్ని కూడా దిగుమతి చేసుకున్నట్టే. అలాంటి పరిస్థితికి అడ్డుకట్ట వేయాలంటే రూరల్ ఎకానమీ బలపడాలి. అలా జరగాలంటే ప్రతి గ్రామంలోనూ నివసిస్తున్న
వాళ్ల ఆకాంక్షలను నెరవేర్చాలి.
విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్
ఈ రోజు రాష్ట్రంలో మనం చేస్తున్న ఈ పనులన్నీ రాబోయే రోజుల్లో ఒక దిక్సూచి అవుతాయి. మనం వాళ్ల ప్రతి ఆకాంక్షను చేరుకోగలగుతాం. తల్లిదండ్రులు తమ పిల్లలను గొప్పగా చదివించాలనుకుంటారు. చదువుకుంటున్న పిల్లలకు ఇంగ్లీష్ రావాలని, ఇంగ్లీష్ మీడియం బడులు కావాలని కోరుకుంటారు. ఇప్పుడు గ్రామాల్లో ఇంగ్లీష్ మీడియం బడులు అందుబాటులో ఉన్నాయి. అదే విధంగా ఆ గ్రామంలో ఉన్నవాళ్లకు విలేజ్ క్లినిక్స్, ఫ్యామిలీ డాక్టర్ కాన్సెఫ్ట్ ఈ రెండింటినీ కూడా అందుబాటులోకి తీసుకుని వచ్చాం. ఇవి కాక వ్యవసాయరంగంలో ప్రిసిసెన్ అగ్రికల్చర్ అన్నది రాబోయే రోజుల్లో, రాబోయే తరంలో గొప్ప మార్పు. దీనికి బీజం మొట్టమొదటిసారిగా మన రాష్ట్రంలోనే ఆర్బీకేల ద్వారా గ్రామస్ధాయిలో పడింది.
ఇవన్నీ గమనిస్తే.. రాబోయే రోజుల్లో అన్లిమిటెడ్ బ్యాండ్ విడ్త్‌తో ఇంటర్నెట్ కనెక్టివిటీ ప్రతి గ్రామంలోకి వస్తుంది. అక్కడే డిజిటల్ లైబ్రరీ కూడా వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామస్థాయిలో మన కళ్లెదుటనే జరుగుతున్న గొప్ప మార్పులివి. ఇవే కాకుండా మౌలిక వసతుల మీద రాష్ట్రంలో నాలుగు సంవత్సరాలుగా జరుగుతున్న పురోగతిని కూడా గమనించినట్లయితే... పోర్టులు, హార్బర్లు, ఎయిర్‌పోర్టులు మౌలిక వసతులు, ఇండస్ట్రియల్ కారిడార్లు ఇవన్నీ ఎప్పుడూ జరగని విధంగా అడుగులు పడుతున్నాయి.
మరో 4 పోర్టుల నిర్మాణం
స్వాతంత్య్రం వచ్చిన 75 సంవత్సరాల కాలంలో రాష్ట్రంలో మనకు 6 పోర్టులు నాలుగు లొకేషన్స్‌లో ఉంటే.. ఇప్పుడు మరో 4 పోర్టులు వేగంగా నిర్మాణం అవుతున్నాయి. 10 పిషింగ్ హార్బర్ల నిర్మాణమూ వేగంగా జరుగుతుంది. తీరప్రాంతంలో ప్రతి 50 కిలోమీటర్లకూ ఒక పోర్ట్ లేదా ఫిషింగ్ హార్భర్‌లో ఏదో ఒక నిర్మాణం జరుగుతుంది. ఇప్పటికే కర్నూలులో విమానాశ్రయం ప్రారంభమయింది. విశాఖపట్టణం, భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి కూడా శంకుస్ధాపన చేసుకున్నాం. ఆ పనులు పనులు వేగంగా జరుగుతున్నాయి.ఎప్పుడూ రాష్ట్రంలో జరగని విధంగా.. ఇవాల దేశంలో 11 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు జరుగుతుంటే.. అందులో 3 ఇండస్ట్రియల్ కారిడార్లు పనులు మన రాష్ట్రంలో జరుగుతున్నాయి.
టెర్షరీ కేర్‌కు మెడికల్ కాలేజీలు మనకు చాలా అవసరం. మెడికల్ కాలేజీ వస్తే.. పీజీ స్టూడెంట్స్ వస్తారు. అప్పుడే టెర్షరీ కేర్‌లో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రులు కూడా తయారవుతాయి. అలాంటిది మనకు స్వాతంత్య్రం వచ్చిన తరవాత ఇప్పటి వరకు కేవలం 11 గవర్నమెంట్ మెడికల్ కాలేజీలు ఉంటే ఈ రోజు మరో 17 మెడికల్ కాలేజీ పనులు నిర్మాణ పనులు మన కళ్లెదుటనే వేగంగా జరుగుతున్నాయి.
మూడేళ్లుగా తొలిస్థానంలో ఏపీ
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌లో వరసగా మూడు సంవత్సరాలు నుంచి దేశంలోనే మొదటి స్ధానంలో ఆంధ్రరాష్ట్రమే కనిపిస్తోంది. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్‌లో కూడా రాష్ట్రం ఇవాళ టాప్ 4,5 స్ధానాల్లో కనిపిస్తుంది. మన గడ్డ మీద మనందరి ప్రభుతం విద్య, వైద్యం, వ్యవసాయం, ఇళ్ళ నిర్మాణం, రాబోయే తరం పిల్లల అభివృద్ధి, మహిళా సంక్షేమం, వృద్ధులు–వితంతువులు–దివ్యాంగుల సంక్షేమం, సామాజిక న్యాయం, లంచాలకు తావులేకుండా, వివక్షకు చోటు లేకుంగా జరుగుతున్న పరిపాలనా సంస్కరణల పరంగా చూసినా, వికేంద్రీకరణపరంగా చూసినా, పారిశ్రామిక అభివృద్ధి, మౌలిక సదుపాయాలు పరంగా.. ఇలా ప్రతి ఒక్క విషయంలో దేశంలోనే ఒక గొప్ప మార్పు.. ఆంధ్రరాష్ట్రంలో జరుగుతుందన్న సంకేతాలు ఇవ్వగలుగుతున్నాం.
మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి
ఇవన్నీ ఎందుకు నేను ఇంతగా చెప్పాల్సి వస్తుందంటే కారణం.. అక్కడ ఉన్న మీ సహాయ, సహకారాలు కూడా ఎంతో అవసరం అని చెప్పడానికే ఇవన్నీ మీ దృష్టికి తీసుకువస్తున్నాను. చివరిగా మీ అందరికీ ఒక్కటే విజ్ఞప్తి. అక్కడ మీరు ఎంతగానో ఎదిగారు. ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్, ఎక్స్పోజర్ మీకు ఉంది. ఆంధ్రరాష్ట్రానికి మీరు ఏ రకంగా ఉపయోగపడగలిగితే ఆ రకంగా ఉపయోపడండి.
ఆర్ధికంగా అన్న మాటలు కాస్తా కూస్తో.. ఉపయోగకరంగా ఉంటాయి కానీ దాన్ని పక్కనపెడితే.. అంతకంటే ఎక్కువగా మీ అనుభవం అవసరం. ఇప్పటికే అభివృద్ది చెందిన వెస్ట్రన్ వరల్డ్‌లో మీరు ఇన్నేళ్లు అక్కడ ఉన్నారు కాబట్టి మీ అనుభవం మనకు ఎంతగానో ఉపయోగపడుతుంది. అవన్నీ కూడా మీరు ఇంకా ఎక్కువగా ఏపీ మీద, మన గ్రామాల మీద ధ్యాస పెట్టగలిగితే మన రాష్ట్రానికి ఉపయోగపడతాయి. ఇది నా తరపు నుంచి మీకు చేస్తున్న విజ్ఞప్తి. ఈ సందర్భంగా నాటా కార్యక్రమంలో పాలుపంచుకొంటున్న మీ అందరికీ మంచి జరగాలని, అమెరికాలో ఉన్న తెలుగువాళ్లు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు, అభినందనలు’ అని సీఎం తన సందేశం వినిపించారు.