
న్యూజెర్సీలోని పార్సిప్పనీలో శ్రీ సీతారాముల కల్యాణం రమణీయంగా, కమనీయంగా సాగింది. న్యూయార్క్‌లోని శ్రీ రంగనాథ ఆలయం నుంచి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తీసుకొచ్చారు. వేద పండితుల మంత్రోచ్చరణ నడుమ ఊరేగింపుగా కల్యాణ మండపానికి స్వర్ణ సింహాసనంపై స్వామివారిని, అమ్మవారిని ఆసీనులను చేశారు. కళ్యాణం సందర్భంగా భక్తులు చేయించిన అభరణాలను వధూవరులకు ధరింపజేశారు. రాముల వారికి, సీతమ్మ వారికి పట్టు వస్త్రాలు, తాళిబొట్టు, మెట్టలు, ఆభరణాలు, ముత్యాల తలంభ్రాలను సమర్పించారు. మేళంతో ఊరేగింపుగా పట్ట వస్త్రాలను తీసువచ్చారు.
సీతమ్మ, రామయ్యల ఎదుర్కోలు ఘట్టం కనులారా తిలకించిన భక్తులు ఆనందపరవశులయ్యారు. భక్తజనంతో న్యూజెర్సీలో పండగ వాతావరణం నెలకొంది. సంస్కృతి, సంప్రదాయలకు అనుగుణంగా వివాహ వ్యవస్థపై కృష్ణ దేశిక జీయర్ స్వామిజీ చేసిన వ్యాఖ్యానం విశేషంగా ఆకట్టుకుంది. దండలు మార్చుకునే క్రమంలో అర్చకులు నృత్య ప్రదర్శన చేసి సంప్రదాయాన్ని గుర్తు చేశారు.
మరిన్నిNRI వార్తలకోసం ఇక్కడ క్లిక్ చేయండి!
అనంతరం గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన, మహాసంకల్పం, మంగళఅష్టకాలు, కన్యాదానం, తలంబ్రాల ఘట్టం, పూలదండల మార్పు, మహా హారతి, నివేదన తదితర ఘట్టాలు శాస్త్రోక్తంగా జరిగాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాలు, భక్తుల జయజయధ్వానాల నడుమ జగదభిరాముడు జానమ్మను మనువాడారు. కోదండ రాముడు సీతమ్మ మెడలో మూడుముళ్లు వేసిన వేళ, రఘునందనుడి దోసిట తలంబ్రాలు ఆణిముత్యాలే నీలపురాశులుగా, జగన్మాత లోకపావని సీతమ్మ దోసిట అక్షింతలు మణిమాణిక్యాలై సాక్షాత్కారించిన వేళ కల్యాణ ప్రాంగణం భక్తిపారవశ్యంతో ఓలలాడింది.
ఈ సీతారాముల కాళ్యానికి పార్సిప్పనీకి మేయర్ జేమ్స్ బార్బెరియోతో పాటు 300 మందికి ప్రవాస తెలుగువారు సకుటుంబ సపరివార సమేతంగా విచ్చేశారు. దాదాపు అందరూ సంప్రదాయబద్ధంగా తయారై కళ్యాణంలో పాల్గొన్నారు. 72 పైగా జంటలు ఈ కళ్యాణ మహోత్సవంలో పాలు పంచుకున్నాయి. ఈ కల్యాణాన్ని ప్రవాసులు కన్నులారా వీక్షిం చి తరించారు. ఈ ఉత్సవం.. భద్రాచల రాముల వారి కళ్యాణమహోత్సవాన్ని తలపించింది. కల్యాణం అనంతరం ఉత్సవ మూర్తులను భక్తులు దర్శనం చేసుకున్నారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు, అక్షింతలు అందజేశారు.