రాములోరి పెళ్లికి కేసీఆర్!
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఎప్పటి నుంచో ఊరిస్తున్న ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు జిల్లా పర్యటన ఎట్టకేలకు ఖరారైంది. 28న భద్రాచలంలో జరిగే సీతారాముల కల్యాణ మహోత్సవానికి సీఎం హాజరు కానున్నారు. దీనిపై మంగళవారం హైదరాబాద్లోని తన కార్యాలయంలో సీఎం అధికారులు, జిల్లాకు చెందిన ముఖ్య నేతలతో చర్చించారు. గత మూడునెలలుగా వాయిదా పడుతూ వచ్చిన వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ పనులను పూర్తి చేయాలని సీఎం భావిస్తున్నట్లు తెలుస్తోంది.
సీతారాముల కల్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందే ముఖ్యమంత్రి జిల్లాకు చేరుకునే అంశంపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. 27న సీఎం జిల్లాకు విచ్చేసి మణుగూరులో నిర్మించనున్న విద్యుత్ ప్రాజెక్టులకు శంకుస్థాపన చేయాలని, అలాగే ఖమ్మం, కొత్తగూడెం, పాల్వంచ ప్రాంతాల్లో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాలు నిర్వహించే అంశంపై సీఎం కార్యాలయ అధికారులు కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది.
ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి..
సీఎం కేసీఆర్ తెలంగాణ ముఖ్యమంత్రి హోదాలో తొలిసారి భద్రాచలం సీతారామచంద్రస్వామి కల్యాణ మహోత్సవంలో పాల్గొంటారు. ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పిస్తారు. సీఎం జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతంలో, ముఖ్యంగా భద్రాచలంలో పర్యటించనుండటంతో పోలీస్ యంత్రాంగం భారీ బందోబస్తుకు ప్రణాళికలు రూపొందిస్తోంది. అరుుతే సీఎం పర్యటన అధికారికంగా మాత్రం మరో రెండు రోజుల్లో ఖరారు కానుంది.
కల్యాణ మహోత్సవానికి ఒకరోజు ముందుగా రావడమా..? కల్యాణ మహోత్సవం పూర్తయ్యాక మరుసటి రోజు జిల్లాలో పర్యటించడమా..? అన్న అంశం సైతం ఇంకా తేలలేదు. ఈసారి మాత్రం సీఎం జిల్లా పర్యటన దాదాపు ఖాయమని, ఈనెల 25 తర్వాత జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ సైతం తొలగిపోనుండటంతో సీఎం పర్యటనకు సాంకేతికంగా ఎటువంటి అవరోధాలు ఉండకపోవచ్చునని అధికారులు భావిస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీ శ్రేణులు సైతం తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో జిల్లాకు వస్తున్న కేసీఆర్కు భారీ స్వాగతం పలికేందుకు సమాయత్తం అవుతున్నారుు.
పలుమార్లు వారుుదా..
జిల్లాలో సీఎం పర్యటనకు సంబంధించి గత మూడునెలలుగా పలు తేదీలు ఖరారైనప్పటికీ వివిధ కారణాల వల్ల చివరి నిముషంలో వాయిదా పడుతూ వస్తోంది.
జనవరి- ఫిబ్రవరి నెలల్లోనే జిల్లాకు సీఎం వస్తారని విస్తృతంగా ప్రచారం జరిగింది. ఇందుకు అనుగుణంగానే అధికారులు సైతం పెద్ద ఎత్తున ఏర్పాట్లు చేశారు. జిల్లా అధికార యంత్రాంగాన్ని సమాయత్తం చేశారు. ఒక దశలో తేదీలు సైతం ఖరారయ్యాయి.
సీఎం ఢిల్లీ పర్యటన, ఆదిలాబాద్ జిల్లాలో గిరిజ నుల జాతర, ఆ తర్వాత ఎమ్మెల్సీ ఎన్నికలకు సం బంధించి కోడ్ అమల్లోకి రావ డం వంటి కారణాలతో సీఎం పర్యటన వాయి దా పడుతూ వచ్చింది.
కల్వకుంట్ల చంద్రశేఖరరావు, సీతారాముల కల్యాణ మహోత్సవం