ఉగాది హృదయం
ఉగాది పచ్చడి తొందరగా చేసేయాలనే ఆరాటంలో ఏవి పడితే అవి వాడ టం సరియైంది కాదు. తొడిమలేని వేపపూత, టెంక పట్టని మామిడి పిందె ముక్కలు, మిరియాల పొడి, చెరకు రసం తీసుకోవాలి. రాళ్ల ఉప్పు, పిక్కతో ఉన్న చింతపండు కచ్చితంగా ఉండాలన్నది నియమం. తీపి, కారం సమానంగా, వీటి మోతాదుకు సగభాగం పులుపు, వగరు, వీటికి సగభాగం ఉప్పు, చేదును కలపాలి.ఈ రుచులతో మనిషి జీవితంలో రానున్న భవిష్యత్తు కాలాన్ని విశ్లేషించుకోవచ్చు.
చాంద్రమానం ప్రకారం ఏర్పరచుకొన్న ప్రభవ మొదలైన అరవై సంవత్సరాల క్రమంలో దుర్ముఖ నామ సంవత్సరం ప్రారంభమయ్యే మొదటి నెల చైత్రమాసంలో మొదటి రోజున శుద్ధపాడ్యమినాడు మనం ఉగాది పండుగను ఉత్సాహంగా, ఉల్లాసంగా జరుపుకోబోతున్నాం. ఈ సంవత్సరం పేరులోనే కొంత తిరకాసు ఉంది. సంవత్సరాన్ని పురుషుడుగా చెబుతాం. ఇది దుర్ముఖ నామ సంవత్సరం. ధర్మశాస్త్ర గ్రంథాలు పేర్కొన్న సంవత్సరాల పేర్లలో దీనిని దుర్ముఖ నామంతోనే చెప్పారు. వ్యవహార క్రమంలో ‘దుర్ముఖి’గా ప్రచారం పొందింది. ఈ రెండింటిలో ‘దుర్ముఖ’ అనటం సబబు అని శాస్త్రం చెప్పినా ఇప్పుడు ఎవరూ వినేటట్టు లేరు. ఏదయినా చెడుముఖం కలవాడు, చెడుముఖం కలది అని అర్థం. ఇక్కడ ముఖం అంటే నోరు అనే అర్థం చెప్పుకోవాలి. నోరు చెడ్డది అయితే ఊరు చెడ్డది అవుతుంది. ఈ ఏడాది అంతా ఈ పేరు తలచుకుంటాం కనుక నోటిని అదుపులో పెట్టుకోవాలని గుర్తు చేస్తూ ఉంటుంది. సంవత్సరాల పేర్లు మన మహర్షులు ఆలోచించే పెట్టారు. మానవజాతికి, ప్రకృతి పరిణామాలకు అవి మార్గదర్శకంగా ఉంటాయి. వాటి అంతరార్థాన్ని గ్రహించాలి. అందుకే శ్రద్ధగా పంచాంగ శ్రవణం చేయాలి.
పండుగలలో ప్రత్యేకమైనది ఉగాది. ఏ దేవుడికీ, దేవతకూ సంబంధం లేకుండా మానవజాతికీ కాలానికీ ప్రతీకగా ఉన్న అనుబంధాన్ని తెలియజేస్తుంది. సహనానికీ, వ్యక్తిత్వ మనో వికాసాలకూ ఆలవాలమై ఆత్మీయతతో దారి చూపుతుంది. ‘చైత్రే మాసి జగద్బ్రహ్మా ససర్జ ప్రథమేహని’(చైత్రమాసంలో మొదటి రోజున బ్రహ్మ సృష్టిని ప్రారంభించాడు) బ్రహ్మదేవుడు సృష్టిని ప్రారంభించిన రోజు కనుక ఉగాది పండగనాడు బ్రహ్మను పూజించాలని ధర్మశాస్త్ర నిర్ణయం. ఇక్కడ తప్ప సృష్టికర్తకు మరెక్కడా పూజలేదు. అరవై సంవత్సరాలలో ప్రతి అయిదు సంవత్సరాలను ఒక యుగంగా జ్యోతిష శాస్త్రం చెబుతోంది. ఒక అరవైలో పన్నెండు యుగాలు వస్తాయి. ఆ సంవత్సరం మొదటి రోజు యుగాది అవుతుంది. ఆ విధంగా ఈ పండుగను యుగాది అనటం వ్యవహారంలో స్థిరపడింది. ఉగ శబ్దానికి నక్షత్రం అనే అర్థం ఉంది. దానివల్ల అశ్వని మొదలైన కార్తెలు మొదలయ్యే ‘ఉగాది’ ఏర్పడింది. సంవత్సరంలో మొదటి రోజు మొదటి పండుగగా ‘సంవత్సరాది’ అయింది.
ఉగాది పండుగ పునరుజ్జీవనానికి సంకేతం. అప్పటివరకు ఆకులన్నీ రాలి మోడుబారిన చెట్లు, తీగెలు మళ్లీ చిగురించి పూలతో కాయలతో కళకళలాడే ఈ పండుగ మానవ జాతికి ధైర్యాన్ని, ఆశను ఇస్తుంది. ఉగాది పండగనాడు తప్పకుండా అభ్యంగన స్నానం చేయాలి. నింబకుసుమ భక్షణం (వేపపూత) తప్పకుండా చేయాలి. ప్రపాదానం (చలివేంద్రం) చెయ్యాలి. పితృదేవతలకు తర్పణలు ఇవ్వాలి. పంచాంగ శ్రవణం చెయ్యాలి. ఇవి ఉగాది పండుగనాడు ధర్మశాస్త్రం చెప్పిన ఆచార నియమాలు.
చాంద్రమానం, సౌరమానం, బార్హస్పత్యమానం అనే మూడు కాలమానాలు ప్రధానంగా భారతదేశం అంతటా ఆయాప్రాంతాల్లో అనుసరిస్తున్నారు. వింధ్య పర్వతానికి ఉత్తరాన ఉత్తర భారతదేశంలో గురుగ్రహ గమనాన్ని బట్టి బార్హస్పత్యమానాన్ని పాటిస్తారు. చాంద్రమానం ప్రకారం ప్రకృతిలో వచ్చే మార్పులు ఆరు రుతువులుగా వసంతరుతువు మొదటిరోజు కొత్త సంవత్సరంగా ఉగాది జరుపుకోవడంలో తెలుగువారు ఎన్నో సాంఘిక సామాజిక ప్రయోజనాలను జతకలిపారు. ధర్మశాస్త్రం కేవలం వేపపూతను తినడం గురించి చెబితే తెలుగు నేలలో ఉగాది పచ్చడి ప్రత్యేక ప్రసాదంగా ఆరు రుచుల సమ్మేళనంగా మన పెద్దలు రూపొందించారు. ‘జిహ్వాగ్రే వర్తతే సర్వమ్’ (నాలుక చివరనే అంతా ఉంది) అని నీతిశాస్త్రం చెబుతోంది. నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యం తెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులూ సమానంగా భరించటం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు కనుక దానికి ఇది ఒక హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా శత్రువు అవుతుంది. అందుకే వీటిని అరిషడ్వర్గం అంటారు. వాటికి లొంగిపోకుండా జయించగలగడమే మానవజన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం ఇదే. తీపి కామానికీ, కారం క్రోధానికీ ఉప్పు మోహానికీ, పులుపు లోభానికీ, చేదు మదానికీ, వగరు మాత్సర్యానికీ సంకేతాలు. మనం తినే పదార్థాలు ఏవైనా ఈ ఆరు రుచుల్లోకే వస్తాయి. ఏదో ఒక రుచి లేకుండా తినలేం. అన్ని రుచులను కలిపి సమీకరించుకుని తింటే మనం గెలిచినట్టు. ఏదో ఒక రుచిని మెచ్చుకుంటూ ఎక్కువ తింటే ఓడినట్టు. సంవత్సరంలో మొదటిరోజు ఏది చేస్తే ఏడాది అంతా అది చేస్తాం కనుక ఏడాది అంతా అన్ని రుచులను అట్లా చూస్తే శారీరక మానసిక ఆరోగ్యాలు చేకూరతాయి.
మంచినీటిని దానం చెయ్యడం సామాజిక బాధ్యత. ఉగాదినాడు అది ప్రారంభించాలి. మల్లెపూలు, మామిడిపండ్లు, కోకిల కూతలూ, పచ్చదనం, పరిశుభ్రత అన్నీ భగవంతుని రూపాలే. అవి దైవానికే సమర్పించాలి. మనలోని కామక్రోధాదులను పెంచుకోవడానికి కాదు అనే దైవీయ గుణాన్ని పెంచుకోవడానికి వసంత నవరాత్రోత్సవాలను ఉగాదినాడు ప్రారంభించాలి. దేవీ భాగవతంలో చెప్పినట్లు వసంత రుతువు యముని కోరలాంటిది. ఉద్రే కాలకూ, ఉద్వేగాలకూ లోనయితే యముని కోరల్లో చిక్కుకోక తప్పదు. కనుక ప్రశాంతమైన, ప్రమాద రహితమైన, పరోపకార సహితమైన, నిగ్రహంతో, నీతినియమాలతో కూడిన జీవితాన్ని గడపమని ఉగాది హృదయం చెబుతోంది. శారీరక మానసిక ఆరోగ్య పరమావధి ఉగాది. సర్వేజనాఃసుఖినోభవంతు
- డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్
నాలుక కొన్ని రుచులు ఇష్టపడి అనారోగ్యం తెస్తుంది. అలా కాకుండా అన్ని రుచులూ సమానంగా భరించటం తన కర్తవ్యంగా నాలుక గుర్తించాలని ఈ పండుగ చెబుతోంది. నాలుకను నడిపించేది మనస్సు కనుక దానికి ఇది ఒక హెచ్చరిక. అన్ని ప్రాణులూ కామ, క్రోధ, లోభ మోహ మద మాత్సర్యాలు అనే ఆరు గుణాలు కలిగి ఉంటాయి. వాటిల్లో ఏ ఒక్కటి హద్దుమీరినా దుర్గుణంగా శత్రువు అవుతుంది. అందుకే వీటిని అరిషడ్వర్గం అంటారు. వాటికి లొంగిపోకుండా జయించగలగడమే మానవజన్మ ప్రత్యేకత. ఉగాది పచ్చడి ఇచ్చే సందేశం ఇదే.