‘సాహసికానివాడు జీవన సమరానికి పనికిరాడు. హిమసుందర శృంగమైన ఎవరెస్టుని ఒక టెన్సింగే ఎక్కగలడు. సుమసుందర వసంత గీతంలో ఉగాదినాహ్వానించగలడు’ శ్రీజయ నామ సంవత్సరంమిగిల్చిన కొన్ని తీపి, మరికొన్ని చేదు జ్ఞాపకాలను కలబోసుకుని జయకు వీడ్కోలు పలికి మన్మథనామ సంవత్సరానికి స్వాగతం పలికే శుభవేళ రాబోయే ఉగాది కావ్యానికి ఇదో పీఠిక. జీవితంలో ఎదురయ్యే అన్ని రకాల అనుభవాలకు ప్రతీక ఉగాది పచ్చడి. ఆ షడ్రుచుల సమాహారాన్ని స్వీకరించటంలో పరమార్థం ఏమిటంటే భిన్నమైన రుచుల్లాగే మంచి-చెడులు రెండూ జీవితంలో ఎదురవుతాయి వీటిలో చెడును తగ్గించి మంచిని పెంచుకోవాలన్నది దీనిలో జీవన సత్యం. సంవత్సరం ప్రారంభం రోజున పంచాంగ శ్రవణం శుభదాయకమని నమ్మకం.
జీవితాన్ని ఆరోగ్యమంతంగా, తేజస్వంతంగా మలిచే ఒక సువర్ణావకాశం ఉగాది. ఆ అవకాశాన్ని అందుకోవాలి. వసంత వన శోభ మాటల్లో వర్ణింపలేనిది. వసంతం అంటే కేవలం రుతువే కాదు.మోడువారినా మళ్లీ జీవితం చిగిర్చి, మారాకు తొడిగి పూర్వపు శోభను తెచ్చుకోవచ్చని చెప్పే ప్రకృతి ప్రబోధం. కాలం ఎప్పటికీ ఒక్కలా సాగదు. వెలుగు-చీకట్లలాగే సుఖ దు:ఖాలు మనిషిని అంటిపెట్టుకు ఉంటాయి. పురోగతిని అన్వేషిస్తూ కాలాన్ని అనుసరించి ధైర్యంగా ముందుకు సాగటమే మన కర్తవ్యం. ఈ నవ వసంత వేళ ప్రకృతి పూల తివాచీలు పరచి, కోకిలల మధుర రాగాల స్వాగత గీతికల మధ్య, మామిడి పూతల తోరణాలతో సాదర ఆహ్వానం పలికే శుభ సమయం ఇది.
-సాక్షి, విశాఖ డెస్క్
దాంపత్య సౌభాగ్య విరచితుడు
తెలుగు సంవత్సరాల పేర్లలో మన్మథ నామ సంవత్సరం చాలా విచిత్రంగానూ, విభిన్నంగా అనిపిస్తుంది. మన్మథుడు ఒక దైవం అయినా నిత్య పూజలో ఆయనకు పూజాస్థానం ఉండకపోయినా, ప్రబంధాలలో మన్మథ పూజ వర్ణితమైంది. మన్మథుడంటే దాంపత్య సౌభాగ్య విరచితుడు. కేవలం కామదృష్టితో ఆయన్ను మనం భావించకూడదు. భార్యభర్తల మధ్య అనుబంధాన్ని, అనురాగాన్ని పల్లవింపజేసి ఒక ఆరోగ్యమంతమైన కుటుంబాన్ని, తద్వారా చక్కటి సమాజాన్ని నిర్మించేందుకు కారకుడు. ఈ ఉగాది సందర్భం మన్మథుడిని మనం ఏం కోరాలి అనుకుంటే చెడు భావనలతో ఉన్నవారిలో మంచిని నింపి మేలైన సంఘాన్ని నిర్మించాలని.
ఇప్పుడు నిత్యం మనం ఎన్నో భయంకరమైన వార్తలు వింటున్నాం... చివరకు విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులు కూడా తక్కువ బుద్ధితో చిన్నపిల్లలను సైతం చెడు దృష్టి చూస్తున్నారని వింటున్నాం. ఇది విడనాడేలా గురు-శిష్యుల మధ్య సత్ సంబంధాలు నెలకొనేలా చూడాలని మనం ప్రార్థించాలి. అలాగే సమాజంలో ప్రతి ఒక్కరిలో మంచి దృష్టి కలిగేలా చూడాలని కాంక్షించాలి.అధర్మబద్ధమైన కామాన్ని దూరం చేసి నీ బాణప్రయోగాలన్నీ సక్రమంగా చేస్తే నీతిబద్ధమైన, ఆరోగ్యవంతంగా సమాజం నిర్మితమవుతుందని ఆయన్ని కోరాలి.
మనోజ్ఞ మన్మథ
Published Sat, Mar 21 2015 2:39 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
Advertisement