ఆరు రుచుల ఆయురారోగ్య ఉగాది! | special story to ugadi | Sakshi
Sakshi News home page

ఆరు రుచుల ఆయురారోగ్య ఉగాది!

Published Fri, Apr 8 2016 12:08 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ఆరు రుచుల   ఆయురారోగ్య ఉగాది! - Sakshi

ఆరు రుచుల ఆయురారోగ్య ఉగాది!

తెలుగు నెలల్లో మొదటిదైన చైత్రమాసం ప్రారంభమే శుద్ధ పాడ్యమి ఉగాది. దీనితోనే వసంత రుతువు మొదలవుతుంది. చెట్లు చిగురిస్తాయి. పచ్చదనం పల్లవిస్తుంది. ఆయుర్వేద సూత్రాల రీత్యా ఇది కఫ (శ్లేష్మ) ప్రకోపకాలం. కాబట్టి కఫాన్ని నియంత్రణలో పెట్టడానికి ‘తిక్త, కటు, కషాయ’రస ప్రధానమైన ఆహారం అవసరం. పాయసాల వంటి స్నిగ్ధ పదార్థాలు నిషేధం. వేడి కలిగించే (ఉష్ణ వీర్య ప్రధానం) పదార్థాలు మంచివి. దీనికి మద్దతుగా మనకు ప్రకృతి ప్రసాదించిన ద్రవ్యాలు ‘వేపపువ్వు (తిక్తరసం/చేదు), మామిడి పిందెలు (కషాయరసం/వగరు), తెలుగు కొత్త ఏడాది ప్రారంభానికి చిహ్నంగా ‘కొత్త బెల్లం, కొత్త చింతపండు, మిరియాలు’ కలిపి రుచిచూస్తారు.

 
ఉగాది పచ్చడి: చిక్కటి చింతపండు రసంలో బెల్లం, వేపపువ్వు, మామిడిపిందెల్ని దంచి, కలిపి, పచ్చడిలా చేస్తారు. కొన్ని ప్రాంతాల్లో కొంచెం మిరియాల పొడి, సైంధవలవణం కూడా కలిపే ఆచారమూ ఉంది. స్థూలంగా చూస్తే అది షడ్రసాల సమ్మేళనం. పండగలో భాగంగా ఈ పచ్చడిని అందరూ పరగడుపున సేవిస్తారు. ఈ ద్రవ్యాల విశిష్టత వల్ల జీర్ణప్రక్రియ చురుగ్గా మారి కోష్ఠ శుద్ధి జరుగుతుంది.

 
వేపపువ్వు ప్రాశస్త్యం: ఇది జఠరాగ్నిని ప్రజ్వలింపజేసి ఆకలిని పుట్టిస్తుంది. కడుపులోని మంటను తగ్గిస్తుంది (అమ్లపిత్తహరం). పొట్టలోని హానికరక్రిములను సంహరిస్తుంది. రోగనిరోధక శక్తిని పెంపొందిస్తుంది. కంటి చూపునకు పదునుపెట్టి, కళ్లను తేజోవంతంగా ఉంచుతుంది.

 
వివిధ రసాల గుణాల కర్మలు

 1. మధుర రసం: ఇది అన్నిటికంటే శ్రేష్ఠమైనది. జన్మతః ఎల్లరకూ హితకరం. ధాతుపుష్టికరం. శరీరకాంతివర్థకం. బాలింతలలో చనుబాలు (స్తన్యం) కలగడానికి దోహదం చేస్తుంది. కేశవర్ధకం. ఓజస్సును పెంచుతుంది. ఆయుః వర్ధకం. బాలురకు, వృద్ధులకు, గాయపడిన వారికి కూడా హితకరం. బరువును పెంచుతుంది. కంఠస్వరం మెరుగవుతుంది. విషహరం కూడా. వాత పిత్తహరం.

‘‘ఆజన్మ సాత్మ్యాత్ కురుతే ధాతూనాం ప్రబలం బలం... బాల వృద్ధ క్షతక్షీణ వర్ణ కేశేంద్రియ ఓజసాం... స్తన్య సంధానకృత్ ... ఆయుష్యో జీవనః ... అష్టాంగ హృదయం  అతిగా సేవిస్తే: స్థౌల్యం, అగ్నిమాంద్యం, మధుమేహం, ఆంత్రకృములు, కంతులు, ఇతర కఫరోగాలు కలుగుతాయి. సన్యాసము (కోమా) కూడా శ్లోకం: కురుతే అత్యుపయోగేన సమేదః కఫజాన్, గదాన్, స్థౌల్య అగ్నిసాద, సన్యాస మేహగండ అర్బుదాదికాన్.

 2. అమ్ల రసం: జిహ్వకు రుచిని పెంచుతుంది. ఆకలిని, జీర్ణశక్తిని వృద్ధి చేస్తుంది. ఉదరంలోని వాయువులను పోగొట్టి, విరేచనాన్ని సాఫీగా అయ్యేలా చేస్తుంది.  శరీరంలో వేడిని కలిగిస్తుంది. లఘువు (సులభంగా జీర్ణమై, శరీరాన్ని తేలిక చేస్తుంది). మేదస్సును కరిగించి స్రోతావరోధాలను తొలగిస్తుంది. ధాతు పోషకం. కఫపిత్త వర్ధకం. శ్లోకం: ‘అమ్లో అగ్ని దీపకృత్ స్నిగ్ధో హృద్యః పాచన రోచనః ఉష్ణ వీర్యో హిమ స్పర్శః ప్రీణనో భేదనో లఘుః రోతి కఫపిత్తాస్రం మూఢవాతానులోమనం’’


అతిగా సేవిస్తే అనర్థాలివే: శరీరం శుష్కిస్తుంది. దప్పిక (తృష్ణ), మంట (దాహం), జ్వరం, తలతిరుగుడు (భ్రమ), తిమిర (దృష్టి తగ్గడం - క్యాటరాక్ట్), దురద (కండూ), నెత్తురు తగ్గడం (పాండురోగం), వాపులు (శోధ), చర్మంపై పొక్కులు (వీసర్ప), చర్మం పగలడం (విస్ఫోట) మొదలైన లక్షణాలు కనిపిస్తాయి. శ్లోకం: ‘సోతి అధ్యస్తః తనోః కుర్యాత్ శైథిల్యం, తిమిరం, భ్రమమ్, కండూ పాంతుత్వ వీసర్ప శోఫ విస్ఫోట తృట్ జ్వరాన్’


3. లవణ రసం: రుచిని పెంచుతుంది. జీర్ణక్రియ త్వరగా జరిగేలా చూస్తుంది. శరీరంలోని కొవ్వును, కంతులను కరిగించి, జడత్వాన్ని పొగొడుతుంది. తీక్షణంగా ఉండి చెమటను కలగజేస్తుంది. శ్లోకం: ‘లవణః స్తంభ సంఘాత బంధ విధ్మాపనో అగ్నికృత్. స్నేహనః స్వేదనః తీక్ష్ణో రోచనః ఛేద భేదకృత్’

 
అతిగా సేవిస్తే అనర్థాలు: పిత్త ప్రకోపం కలుగుతుంది. బలాన్ని తగ్గిస్తుంది. దప్పిక పెరుగుతుంది. రక్తస్రావం పెరుగుతుంది. విషతుల్యం. జుత్తు నెరుస్తుంది (పాలిత్య), బట్టతల (గాలిత్య), చర్మంలో ముడుతలు (వలీ), ఇతర చర్మ వికారాలు కలుగుతాయి. ఇది షడ్రసాలలో నింద్యం. కాబట్టి దీన్ని అత్యంత స్వల్ప ప్రమాణాలతో మాత్రమే తీసుకోవాలి. శ్లోకం: సోతియుక్తో అస్రపవనం, ఖలితం, పలితం వలిమ్, తృట్ కుష్ఠ విష విసర్పాన్ జనయేత్ క్షపయేత్ బలమ్.

 
4. తిక్త రసం (చేదు):
ఇది రుచిగా ఉండదు. కానీ నాలుక తాలూకు అరుచిని పోగొడుతుంది. ఆకలిని పెంచుతుంది. విషహరం, కృమిహరం, జ్వర, మూర్ఛ, తృష్ణ, చర్మరోగాలను పోగొడుతుంది. కొవ్వును కరిగిస్తుంది. పిత్త కఫహరం. మేధాకరం.  స్తన్య దోషాలను తొలగిస్తుంది. కంఠరోగాలను పోగొడుతుంది. రూక్షకరం (పొడిగా ఉంటుంది). శ్లోకం: ‘తిక్తః స్వయం అరోచిష్ణుః అరుచిం కృమితృట్ విషం, కుష్ఠ మూర్ఛాజ్వర ఉత్క్లేశ దాహ పిత్త కఫాన్ జయేత్, క్లేవ మేదో వసా మజ్జా శకృత్ మూత్ర ఉపశోషణః లఘుః మేధ్యో హిమో రూక్షః స్తన్య కంఠ విశోధనః ’  అతిగా సేవిస్తే: ధాతు క్షయం, వాతరోగాలకు కలిగిస్తుంది. (ధాతుక్షయ అనిల వ్యాధీన్ అతియోగాత్ కరోతిసః)

 
5. కటు రసం (కారం)
: రుచ్యం, దీపనం, పాచనం (అంటే రుచిని పెంపొందించి, ఆకలిని పెంచి, జీర్ణం తేలిగ్గా అయ్యేలా చేస్తుంది. కొవ్వును కరిగిస్తుంది. మేధస్సును పెంచుతుంది. చర్మ కంఠ రోగాలను పోగొడుతుంది. వాపులను తగ్గిస్తుంది. శ్లోకం: ‘కటుఃగలామయ.... పోషజిత్; .... దీపనః పాచనో రుచ్యః.... అన్నస్య శోషణః... కఫావః’’ అతిగా సేవిస్తే: బలాన్ని, పుంసత్వాన్ని నశింపజేస్తుంది. తృష్ణమూర్ఛలు కలుగుతాయి. కండరాలు, కీళ్లలో నొప్పి, బాధ కలుగుతాయి. ‘‘కురుతే సోతియోగేన తృష్ణాం శుక్ర బలక్షయమ్, మూర్ఛాం ఆకుంచనం,..... వ్యాధాం’’

 
6. కషాయ రసం (వగరు) : ఇది పిత్త కఫహరం, రక్తశోధకం. వ్రణరోపకం. శీతలం. కొవ్వును కరిగిస్తుంది. ఆహారం జీర్ణం కావడానికి ఉపకరిస్తుంది. చర్మసౌష్ఠవాన్ని కాపాడుతుంది. శ్లోకం: కషాయో రోపక్ష గ్రాహీ స్తంభన శోధన స్తధా, ...........అతి త్వక్ ప్రసాదనః అతిగా సేవిస్తే అనర్థాలు: ఉదరం ఉబ్బుతుంది. వికారంగా ఉంటుంది. తృష్ణ, గుండెలో నొప్పిగా అనిపిస్తుంది. దేహ శుష్కత్వం, మలబంధం, శృంగారసామర్థ్యం తగ్గుతుంది. ‘సోతి యుక్తో... ఆధ్మాన, హృద్ రుజః.... పౌరుషభ్రంశ.... మలగ్రహాన్’.                            

 

ఉగాది పచ్చడి - రెండు విధాలు
తెలంగాణాలో...
కావల్సినవి: చింతపండు గుజ్జు - 2 టేబుల్ స్పూన్లు, బెల్లం తరుగు - 3 టేబుల్ స్పూన్లు, వేప పూత - కొద్దిగ, పచ్చిమామిడి తురుము - కప్పు, కారం - పావు టీ స్పూన్ (రుచికి తగినంత), ఉప్పు - తగినంత, కొబ్బరి ముక్కలు - కొన్ని తయారీ  చింతపండును 4-5 కప్పుల నీళ్లు పోసి నానబెట్టాలి  మట్టి పాత్రలో చింతపండు రసం తీసి పోయాలి. దీంట్లో అన్ని పదార్థాలు వేసి కలపాలి. ఉగాది పచ్చడి తాగడానికి సిద్ధం. నోట్: దీంట్లో పుట్నాలపప్పు, చెరకు ముక్కలు, అరటిపండు ముక్కలు, జీలకర్ర, జీడిపప్పు, కొబ్బరి ముక్కలు వేసుకోవచ్చు.

 
ఆంధ్రాలో....

కావల్సినవి: మామిడికాయ తురుము - 2 టేబుల్‌స్పూన్లు, నీళ్లు - కప్పు, వేప పువ్వు రేకలు - టేబుల్ స్పూన్, ఉప్పు - చిటికెడు, బెల్లం తరుగు - 3 టేబుల్ స్పూన్లు, మిరియాల పొడి - చిటికెడు, చింతపండు గుజ్జు - టీ స్పూన్. మరికొన్ని: అరటిపండు, పుట్నాలపప్పు, జీడిపప్పు, కిస్‌మిస్

 
తయారీ:  చింతపండులో అర కప్పు నీళ్లు పోసి, నానబెట్టి, చిక్కటి గుజ్జు తీయాలి  కప్పు నీళ్లలో బెల్లం వేసి కరిగించాలి. దీన్ని టీ జల్లితో వడకట్టాలి  వడకట్టిన బెల్లం నీళ్లలో చింతపండు గుజ్జు వేసి, కలపాలి.దీంట్లో మిగతా పదార్థాలన్నీ వేసి కలపాలి. ఉగాది పచ్చడి రెడీ.

 

డాక్టర్ వృద్ధుల లక్ష్మీనరసింహశాస్త్రి
ఆయుర్వేద నిపుణులు,
సౌభాగ్య ఆయుర్వేదిక్ క్లినిక్, హుమాయూన్‌నగర్, హైదరాబాద్

 

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement