
సాక్షి, తిరుపతి: ‘ఇళ్లలో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఇళ్లు ఉండాలి. ఊర్లో చెట్లు కాదు.. చెట్ల మధ్యలో ఊర్లు ఉండాలి. ఒకప్పుడు టెక్నాలజీని ప్రమోట్ చేశాను. ఇప్పుడు ప్రకృతిని ప్రమోట్ చేస్తున్నాను. మీరు తినే తిండి యూరియా. ఆ తిండితో అనారోగ్యం పాలువుతున్నారు. భూములు నిస్సారమయ్యాయి’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. తిరుపతి పర్యటనలో భాగంగా శనివారం ఆయన అలిపిరి మార్గంలోని కపిలతీర్థం వద్ద నిర్మించిన నగర వనాన్ని ప్రారంభించి మొక్కను నాటారు. అనంతరం అక్కడి నుంచి నేరుగా మహతి ఆడిటోరియానికి చేరుకున్నారు. అక్కడ నుంచి ‘పచ్చదనం పరిశుభ్రత’ను కాంక్షిస్తూ నెహ్రూ మున్సిపల్ మైదానం వరకు ర్యాలీ నిర్వహించారు. మధ్యలో నెహ్రూ నగర్ వద్ద డిజిటల్ డోర్ నెంబర్లకు శ్రీకారం చుట్టారు. అనంతరం మున్సిపల్ మైదానంలో నిర్వహించిన బహిరంగసభలో సీఎం ప్రసంగించారు.
మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తిరుపతి
డిజిటల్ డోర్ నెంబర్ల వ్యవస్థతో ఎన్నో ప్రయోజనాలున్నాయని.. ప్రభుత్వ సేవలు ఏ సమయానికి ఎలా అందుతున్నాయో తెలుసుకునే అవకాశం ఉందని చంద్రబాబు తెలిపారు. ప్రపంచస్థాయి సాంకేతిక పరిజ్ఞానాన్ని తిరుపతిలో అమలుచేస్తామని తెలిపారు. తిరుపతిని ఒక మెడికల్, ఎడ్యుకేషన్ హబ్‌గా తయారుచేసి దేశంలోనే నంబర్–1గా తీర్చిదిద్దుతానన్నారు. అలాగే, తిరుపతిని అనేక జాతీయ రహదారులతో అనుసంధానం చేస్తున్నట్లు ఆయన వెల్లడించారు. రాయలసీమకు కేంద్రంగా దీనిని తయారుచేస్తానన్నారు. త్వరలో తిరుమలకు ఎలక్ట్రికల్ వాహనాలు రానున్నాయని చంద్రబాబు తెలిపారు. జపాన్‌లో ఎవరూ రోడ్లపై కాగితాలు వేయరని, ఇక్కడ మాత్రం కాగితాలు, ఇతర చెత్త ఇష్టా రాజ్యంగా వేస్తున్నారన్నారు.
ప్రకృతి సేద్యంతో లాభాల పంట
ప్రకృతి సేద్యం ద్వారా ఆరోగ్యంతో పాటు పంట దిగుబడి లాభాలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ ఏడాది రాష్ట్రంలో 5 లక్షల మంది రైతులు ప్రకృతి సేద్యం చేస్తున్నారని తెలిపారు. కాగా, ముఖ్యమంత్రి యువనేస్తం కార్యక్రమాన్ని అక్టోబరు 2న ప్రారంభించనున్నట్లు చంద్రబాబు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రులు నారాయణ, అమరనాథ్‌రెడ్డి, మున్సిపల్ శాఖ కార్యదర్శి కన్నబాబు, చిత్తూరు జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న, జెడ్పీ చైర్మన్ గీర్వాణి, ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment