గ్యాస్ బెలూన్ పేలడంతో గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులు
చెట్లు నాటేవారికి ‘వృక్షమిత్ర’ అవార్డులు
Published Sun, Jul 2 2017 1:53 AM | Last Updated on Tue, Aug 14 2018 11:26 AM
- సీఎం చంద్రబాబు వెల్లడి
- కార్యక్రమంలో బెలూన్లు పేలి 9 మంది విద్యార్థులకు గాయాలు
సాక్షి, అమరావతి బ్యూరో/ గుంటూరు ఈస్ట్: ‘ఎవరైతే చెట్లు పెడతారో వారే నాకు మిత్రులు.. వారిని ప్రోత్సహించడంలో భాగంగా వృక్ష మిత్ర అవార్డులు ఇస్తా’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు. గుంటూరు జిల్లాలోని గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడుపాలెంలో జరిగిన 68వ వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా ఆయన వనం – మనం కార్యక్రమంలో పాల్గొన్నారు. తొలుత మంత్రులతో కలిసి మొక్కలను నాటారు. అనంతరం సభాస్థలికి చేరుకుని మాట్లాడుతూ వనం–మనం మనందరి జీవి తంలో భాగం కావాలన్నారు. భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ చెట్టు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టా లని, అది మీ బాధ్యతని పేర్కొన్నారు. ఖమ్మం జిల్లాకు చెందిన వనజీవి రామయ్య ప్రతి సమావేశానికీ ఎక్కడ జరిగినా వచ్చేవారని, ఆయన్ను ప్రోత్సహించడంలో భాగంగా రూ.10 వేలు పింఛను ఇచ్చామని చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఆయనకు పద్మశ్రీ అవార్డు ప్రకటించిందన్నారు.
9 మంది విద్యార్థులకు గాయాలు
ముఖ్యమంత్రి చంద్రబాబు పాల్గొన్న సభలో హీలియం గ్యాస్ నింపిన బెలూన్లు పేలి తొమ్మిది మంది విద్యార్థులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన గుంటూరు రూరల్ మండలం ఓబులనాయుడపాలెంలో శనివారం వనం–మనం కార్యక్రమంలో జరిగింది. కార్యక్రమంలో ప్రారంభంలో ముఖ్యమంత్రి చంద్రబాబు బెలూన్లు ఎగురవేశారు. ఆ సమయంలో కొన్ని బెలూన్లు పక్కన పడేశారు. అవి ఒక్కసారిగా పేలడంతో మంటలు ఎగిసిపడ్డాయి. ఈ మంటలకు వివిధ కళాశాలలకు చెందిన 9 మంది విద్యార్థులకు తీవ్రగాయాలు అయ్యాయి. అయితే గాయాలైన విద్యార్థులకు కనీసం ప్రథమ చికిత్స అందించకుండా 108 వాహనాల్లో గుంటూ రు జీజీహెచ్‌కు తరలించారు. కాలిన గాయాలతో విద్యార్థులు అల్లాడిపోయారు. అయితే గాయపడ్డ విద్యార్థుల వెంట ఏ ఒక్క అధికారి ఆసుపత్రికి రాకపోవడం దారుణమని స్థానికులు విమర్శిస్తున్నారు.
విద్యార్థులను తరలించడంపై విమర్శలు
రాజధానిలో ముఖ్యమంత్రి సభ జరిగిందంటే జిల్లాలోని పాఠశాలలు, కళాశాలల నుంచి విద్యార్థులను బలవంతంగా తరలించడం ఆనవాయితీగా మారిందనే స్థానికులు విమర్శిస్తున్నారు. విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నప్పటికీ.. విద్యాసంస్థల యాజమాన్యాలపై ఒత్తిడి తెచ్చి మరీ వారిని తరలిస్తుండటంపై తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
Advertisement
Advertisement