పుష్కరాల్లో సర్వమత ప్రార్థనలు చేయండి: సీఎం
అమరావతి: ప్రకృతితో అనుసంధానమైన నదులు కుల, మత, ప్రాంతాలకు అతీతమైనవని... కృష్ణా పుష్కరాల 12 రోజుల పాటు అన్ని గ్రామాల్లోను సర్వమత ప్రార్థనలు చేసి ఆ నది రుణం తీర్చుకోవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. సీఎంవోలో బుధవారం రాత్రి ఆయన మీడియా సమావేశం నిర్వహించారు. తాను గురువారం ఉదయం రాజమహేంద్రవరంలో గోదావరి అంత్య పుష్కరాల్లో పాల్గొని సాయంత్రం ఇబ్రహీంపట్నం వద్ద గల సంగమ ప్రాంతంలో కృష్ణా పుష్కరాల ప్రారంభ కార్యక్రమంలో పాల్గొంటానని తెలిపారు. 12వ తేదీ శుక్రవారం ఉదయం పుష్కరాలు ప్రారంభిస్తూ దుర్గాఘాట్‌లో స్నానం చేస్తానని చెప్పారు.
పుష్కరాల 12 రోజులు రాత్రి 7గంటల నుంచి 7.30గంటల వరకు హారతి, సంకల్పాన్ని అన్ని టీవీ చానల్స్ కచ్చితంగా ప్రసారం చేయాలని ఆదేశించారు. చెప్పారు. గోదావరి-కృష్ణా సంగమం వల్ల కృష్ణా నదిలో ఫలానా చోట పుష్కర స్నానం చేస్తే పుణ్యం రాదనే పుకార్లను నమ్మొద్దని సీఎం కోరారు. గోదావరి నది నుంచి పుష్కరుడు కృష్ణా నదికి వస్తున్నాడని, ఈ రెండు నదులు సంగమంతో ఇక్కడ మరింత పవర్‌ఫుల్‌గా ఉంటుందన్నారు. పుష్కరాల్లో టెక్నాలజీని పెద్ద ఎత్తున ప్రమోట్ చేస్తున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా పుష్కరాలపై జొన్నవిత్తుల రచించిన పాటలతో ఆంధ్రప్రదేశ్ భాషా సాంస్కృతిక శాఖ రూపొందించిన కృష్ణా పుష్కర వైభవం సీడీని సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అలాగే పుష్కర కరపత్రాన్నీ ఆవిష్కరించారు.