
ప్రకృతి కూడా ఫ్లాట్ అయిపోతుంది!
అపార్ట్‌మెంట్ పేరు చెప్పగానే... కొద్దిగా సైజు తేడాలతో ఒకదానిపై ఒకటిగా పేర్చిన అగ్గిపెట్టెలు గుర్తొస్తాయి మనకు. హంగుల్లో తేడాలు మినహాయిస్తే... అన్నిచోట్లా అపార్ట్‌మెంట్ల తీరు ఇదే. అయితే కాలం మారుతోందనేందుకు ప్రపంచవ్యాప్తంగా అనేక తార్కాణాలు కనిపిస్తున్నాయి. ప్రకృతితో మమేకమవుతూ పర్యావరణానికి కొద్దో గొప్పో మేలు చేసే కొత్త తరహా ఇళ్లకు ఆదరణ కూడా ఎక్కువే.
ఈ కోవకే చెందుతుంది ఈ ఫొటోల్లో కనిపిస్తున్న ‘స్లూయిషుషీస్’. దీని ప్రత్యేకతలు ఒకటా రెండా? బోలెడు! అన్నింటి కన్నా ముందు చెప్పాల్సింది - ఇది ‘జీరో ఎనర్జీ’ అపార్ట్‌మెంట్ కాంప్లెక్స్. అంటే.. సౌర, పవన విద్యుత్తు వంటి సంప్రదాయేతర ఇంధన వనరుల ద్వారా ఉత్పత్తయ్యే విద్యుత్తును మాత్రమే వాడతారన్నమాట. నెదర్లాండ్‌స రాజధాని ఆమ్‌స్టర్‌డ్యామ్ నగరంలో నిర్మాణం కానున్న ఈ భవనం మొత్తం ఐజే లేక్ అనే సరస్సుపై తేలియాడుతున్నట్లు ఉంటుంది. ఒక అపార్ట్‌మెంట్ నుంచి ఇంకోదాంట్లోకి వెళ్లేందుకు నడక మార్గంతోపాటు పడవమార్గం కూడా ఉండటం మరో విశేషం.
ప్రతి ఇంటికీ తనదైన చిన్న పచ్చదనం ఉంటుంది. మొత్తం 46 వేల చదరపు మీటర్ల వైశాల్యంలో, 380 అపార్ట్‌మెంట్లున్న ఈ కాంప్లెక్స్‌లో వాహనాల పార్కింగ్ మొత్తం భూగర్భంలోనే. అంతేకాదు.. ఒక రెస్టారెంట్, ఒక మ్యూజియం, సెయిలింగ్ స్కూల్ వంటి అదనపు హంగులున్నాయి. ఇంతెందుకు... స్థానిక ప్రభుత్వం చేపట్టిన ఈ భవనాన్ని బిగ్, బార్‌కోడ్ ఆర్కిటెక్చర్ సంస్థలు డిజైన్ చేశాయి. అన్నీ సవ్యంగా సాగితే 2018లో దీని నిర్మాణం మొదలుకానుంది.