ప్రకృతి సేద్యం సామాజిక బాధ్యత! | Nature Farming is social responsibility! | Sakshi
Sakshi News home page

ప్రకృతి సేద్యం సామాజిక బాధ్యత!

Published Tue, Nov 1 2016 12:27 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

ప్రకృతి సేద్యం సామాజిక బాధ్యత! - Sakshi

ప్రకృతి సేద్యం సామాజిక బాధ్యత!

- తండ్రి మరణంతో ఉద్యోగానికి స్వస్తి చెప్పి ప్రకృతి సేద్యం చేపట్టిన ఇంజినీర్
- వర్షాధారంగా మిశ్రమ సాగు
- రైతుల సహకార సంఘం ద్వారా నేరుగా వినియోగదారులకు విక్రయం
- అధిక నికరాదాయంతో ఆర్థిక భద్రత
 
 తండ్రి కేన్సర్‌తో మరణించటం ఆ యువకుడిని కుంగదీసింది. వైద్యానికిరూ. లక్షలు ఖర్చు పెట్టినా తండ్రి దక్కలేదు. తండ్రిని పొట్టనబెట్టుకున్నది రసాయనిక ఎరువులు, పురుగుమందులతో తాము పండించి, తింటున్న ఆహారోత్పత్తులేనన్న భావన తీవ్రంగా ఆలోచింపజేసింది. అలా మేల్కొన్న ఎరుకతో ఉద్యోగాన్ని వదిలేసి.. తమ 15 ఎకరాల పొలంలో ప్రకృతి సేద్యం చేపట్టాడు. వర్షాధారంగా మెట్ట పంటలను సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నాడు. వాతావరణ మార్పులకు తట్టుకునేలా ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టడం నికరాదాయం పెంచుకోవడానికి మాత్రమే కాదని, ఇది యువ రైతుగా తన సామాజిక బాధ్యత కూడా అని ఎలుగెత్తి చాటుతున్నాడు!
 
 అరకొర వర్షాలతోనే ప్రకృతి సేద్యం చేస్తూ తన 15 ఎకరాల మెట్ట పొలాన్ని అక్షయపాత్రగా మార్చుకున్నారు ఏదుల గోపీనాథ్ రెడ్డి (32). కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం, ఉప్పలపాడు ఆయన స్వగ్రామం. గోపీనాథ్ రెడ్డి 2006లో ఎలక్ట్రానిక్స్‌లో బీటెక్ పూర్తి చేశారు. ఐసీఐసీఐ బ్యాంకులో ఫీల్డ్ అసిస్టెంట్‌గా, పైపుల ఫ్యాక్టరీలో సూపర్‌వైజర్‌గా పనిచేశారు. 2009లో తండ్రి కేన్సర్‌తో మరణించటంతో విద్యావంతుడైన గోపీనాథ్‌లో అంతర్మథనం ప్రారంభమైంది. రసాయన సేద్యం వల్లనే ఇంటిపెద్ద దిక్కును కోల్పోయామనే ఆలోచన ఆయన మనసును మెలిపెట్టింది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే ఇంకెవరిని కోల్పోవాల్సివస్తుందోననే ఆందోళన ప్రారంభమైంది. ఈ దుస్థితి నుంచి బయటపడే మార్గాల కోసం వెతుకుతున్న క్రమంలో 2013లో పాలేకర్ రెండు రోజుల శిక్షణా కార్యక్రమానికి హాజరయ్యారు. దీంతో తను ఎంచుకోవలసిన మార్గం కళ్లముందే మెదిలినట్లైంది. ప్రకృతి వ్యవసాయం చేపడితే భవిష్యత్ బాగుంటుందని అనిపించింది. ఉద్యోగాన్ని వదలి పొలం బాట పట్టారు.

 2013లో తొలిసారిగా 8 ఎకరాల్లో ప్రకృతి వ్యవసాయానికి శ్రీకారం చుట్టారు. 10 ఆవులు, 2 ఎద్దులు కొనుగోలు చేశారు. ముగ్గురు జీతగాళ్లను ఏర్పాటు చేసుకున్నారు. స్థానికంగా గిరాకీ ఉండి తక్కువ నీటితో సాగయ్యే పంటలను సాగుకు ఎంచుకున్నారు. ఆ ఏడాది కురిసిన రెండు వర్షాలతోనే ఎకరాలో 15 క్వింటాళ్ల పసుపు, కంది 3, శనగ 3, వేరుశనగ 3 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. వరిలో 12 బస్తాల దిగుబడి వచ్చింది. మొత్తం 8 ఎకరాల సాగుకు రూ. లక్ష ఖర్చయింది. రూ.1. 50 లక్షల ఆదాయం రాగా రూ. 50 వేల  నికరాదాయం లభించింది.
 
 రెండో ఏడాదికి రెట్టింపు ఆదాయం..
 2014లో పదెకరాల్లో ప్రకృతి సాగును చేపట్టారు. ఎకరాకు పసుపులో 9 క్వింటాళ్లు, కంది 4, మహేంద్ర జొన్న 11, శనగలు 4, వరి 14 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది. ఆ ఏడాది 10 ఎకరాల సాగుకు రూ. 1.20 లక్షలు ఖర్చవ్వగా రూ. 2.50 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోనూ రూ. 1.30 లక్షల నికరాదాయం లభించింది. 2015లో మొత్తం 15 ఎకరాల్లో ప్రకృతి సేద్యం చేశారు. ఎకరాకు పచ్చజొన్న 10 క్వింటాళ్లు, తెల్లజొన్న  6 ,  కందులు 2, ఊదలు  5 , రాగులు 6, ధనియాలు 5 , శనగలు 3, సజ్జలు 9, చిక్కుడు 1, పచ్చజొన్న 10,  తెల్లజొన్న 6 క్వింటాళ్ల చొప్పున దిగుబడి వచ్చింది.  వరిలో 15 బస్తాల దిగుబడి వచ్చింది. 15 ఎకరాల సాగుకు ఖర్చు రూ. 1.40 లక్షలు కాగా 2.90 లక్షల ఆదాయం వచ్చింది. ఖర్చులు పోనూ రూ. 1.50 లక్షల నికరాదాయం లభించింది. ఈ ఏడాది ఎకరాకు రూ. 25 వేలకు తగ్గకుండా నికరాదాయం వస్తుందని ఆశిస్తున్నారు.
 
 మెట్ట భూముల్లో అంతర పంటలతో రైతు ఆదాయానికి హామీ
 మెట్ట భూముల్లో అంతర పంటల సాగు వల్ల పలు రకాల ప్రయోజనాలున్నాయంటారు గోపీనాథ్‌రెడ్డి. రాగులు, ఊదలు, కొర్రలు, జొన్నలను ఆయన అంతర పంటలుగా సాగు చేస్తున్నారు. వర్షం కురిసినప్పుడు వెంటనే తేమ ఆవిరవ్వకుండా అంతర పంటలు కాపాడతాయి. గాలిలోనూ తేమను నిలుపుతాయి. అంతర పంటల వ్యర్థాలు ఎరువుగా ఉపయోగపడతాయి. భూమిలో వానపాముల సంఖ్య పెరుగుతుంది. మొక్కలకు పోషకాల లభ్యత పెరుగుతుంది. ముఖ్యంగా రసాయన సేద్యంలో వాడే నీటిలో 10-20 శాతం నీటితోనే ఈ విధానంలో పంటలను సాగు చేయవచ్చంటారాయన. నీటి అవసరం తగ్గటం వల్ల విద్యుత్ ఖర్చు రైతుకు ఆదా అవుతుంది.

 ఆఖరు దుక్కిలో ఎకరాకు 2 క్వింటాళ్లు, పైరు పూత దశలో క్వింటాల్ చొప్పున ఘనజీవామృతం వేస్తారు. బీజామృతంతో విత్తనశుద్ధి చేస్తారు. దీనివల్ల మొలక త్వరగా రావటంతో పాటు మొలక శాతం పెరుగుతుంది. తొలినాళ్లలో ఆశించే చీడపీడలు, తెగుళ్లను మొక్కలు తట్టుకుంటాయి. ప్రతి పదిహేను రోజులకోసారి పైరుపై జీవామృతాన్ని పిచికారీ చేస్తారు. గింజ పాలుపోసుకునే దశలో 5 లీటర్ల పుల్లటి మజ్జిగను 200 లీటర్ల నీటిలో కలిపి ఎకరా పైరుపై పిచికారీ చేస్తారు. దోమను నివారించేందుకు నీమాస్త్రం, పురుగులను నివారించేందుకు అగ్నాస్త్రం.. కాండం, కాయతొలిచే పురుగు నివారణకు బ్రహ్మాస్త్రం వాడుతున్నారు.
 
 సహకార సంఘం ద్వారా ఉత్పత్తుల అమ్మకం..
 పండించిన పంటలను విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చి విక్రయించుకుంటేనే రైతుకు ప్రయోజనం అంటారు గోపినాథ్‌రెడ్డి. కందులు మార్కెట్లో విక్రయిస్తే క్వింటాల్ రూ. 5 వేలు. అదే పప్పుగా మార్చి అమ్మితే క్వింటాల్‌కు రూ.12 వేల ఆదాయం లభిస్తుంది. ఇది రైతుకు ఆర్థికంగా ఎంతో ప్రయోజనం చేకూరుస్తుంది. మరో ఆదాయ వనరు రైతుకు లభించినట్టే అని అంటారు గోపీనాథ్‌రెడ్డి.

 దీనికోసం ప్రకృతి సేద్యం చేసే రైతులతో కలసి ‘పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయదారుల పరస్పర సహాయ సహకార సంఘం’ను ఏర్పాటు చేశారు. పండించిన పంట ఉత్పత్తులను ఈ పేరుతోనే కర్నూలు సంతలో నేరుగా వినియోగదారులకు అమ్ముతున్నారు. రుచి నాణ్యత వల్ల వారి ఉత్పత్తులకు వినియోగదారుల ఆదరణ లభిస్తోందని గోపీనాథ్‌రెడ్డి తెలిపారు. గో ఆధారిత ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న గోపీనాథ్‌రెడ్డిని రైతు నేస్తం, భారతీయ కిసాన్ సంఘ్ ఉత్తమ రైతు పురస్కారంతో సత్కరించాయి.
 - గవిని శ్రీనివాసులు, సాక్షి, కర్నూలు జిల్లా
 
 సొంత విత్తనంతో మేలు
 వ్యవసాయం గిట్టుబాటు కావాలంటే విత్తనం దగ్గర మోసం జరుగకూడదంటారు గోపీనాథ్ రెడ్డి. సంప్రదాయ వంగడాలనే గోపీనాథ్ సాగులో వాడుతున్నారు. కొన్ని రకాల దేశీ వంగడాలను దక్కన్ డెవలప్‌మెంట్  సొసైటీ నుంచి తెచ్చారు. ప్రస్తుతం తాను పండించిన పంట నుంచే విత్తనోత్పత్తి చేసి తరువాతి పంటలో వాడుతున్నారు. విత్తనోత్పత్తి కోసం కొన్ని ప్రత్యేక లక్షణాలతో ఉన్న చెట్లను ఎంపిక చేసుకుంటారు. పెద్ద ఆకులతో చెట్టు గుబురుగా ఉండాలి. మరీ ఎత్తుగాను మరీ పొట్టిగాను ఉండకూడదు. కాయలు జంపు ఉండాలి. చెట్టుకు చీడపీడలు ఆశించకూడదు. అలాంటి చెట్లను ఎకరాకు 50 వర కు ఎంపిక చేసి ఎరుపు రంగు రిబ్బెన్ కడతారు. పంట కోతకు రెండు రోజులు ముందుగానే వీటిని సేకరించి నీడకింద ఆరబెట్టి విత్తనాన్ని తయారుచేసుకొని నిల్వ చేసుకుంటారు.
 
 ఖర్చు తక్కువ.. నికరాదాయం ఎక్కువ!
 రసాయన సేద్యంలో కంపెనీ విత్తనాలు కొనాలి. పురుగు కనపడితే కొట్టుకెళ్లి పురుగుమందులు తెచ్చి పిచికారీ చేయాలి. అయినా చావకపోతే మందు మార్చాలి. ఒక్కటే పంటను సాగు చేస్తారు. అది పోతే ఆదాయం మొత్తం పోయినట్టే. పంటను వ్యాపారులు చెప్పిన ధరకు విక్రయించాలి. ఖర్చు ఎక్కువ ఆదాయం తక్కువ. కానీ ప్రకృతి సేద్యం దీనికి పూర్తిగా భిన్నమైనది. దిగుబడి తక్కువ వ చ్చినా రైతుకు నికరాదాయం పెరుగుతుంది. అంతరపంటల ద్వారా ఖచ్చితమైన ఆదాయం లభిస్తుంది. ప్రకృతి సేద్యంలో రైతు సొంత విత్తనం వాడతాడు. తన పంటకు తనే ధర నిర్ణయిస్తాడు. ప్రకృతి సేద్యంతో  రైతుకు ఇతరులపై ఆధారపడాల్సిన అగత్యం తప్పుతుంది. ఖర్చు తక్కువ నికరాదాయం ఎక్కువ. పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు. అందుకే నా దృష్టిలో ప్రకృతి వ్యవసాయం అనేది కేవలం నా జీవనాధారం కోసం మాత్రమే కాదు.. నేను పండిస్తున్న అమృతాహారం ద్వారా సమాజం కూడా బావుంటుంది. దీనివల్ల నా వంతు సామాజిక బాధ్యతను కూడా నెరవేరుస్తున్న తృప్తి నాకుంది.
 - ఏదుల గోపీనాథ్‌రెడ్డి (98859 79659), ఉప్పలపాడు, ఓర్వకల్లు మండలం, కర్నూలు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement