
ముడతల్ని ఇలా మడతెట్టేద్దాం...
బ్యూటిప్స్
వయసు పెరిగే కొద్దీ చర్మం ముడతలు పడటం సహజమే అయినప్పటికీ చర్మం ముడతలను నివారించడానికి ప్రకృతి ప్రసాదించిన కూరగాయలు, పండ్లు, తేనెతో ఇంట్లోనే తగిన జాగ్రత్తలు తీసుకోవచ్చు. బొప్పాయి గుజ్జు కాని, పైనాపిల్ జ్యూస్ కాని ముఖానికి పట్టించి మర్దన చేస్తే చర్మం మీద మచ్చలు, జిడ్డు పోయి చర్మం మృదువుగా మారుతుంది. చిన్నవయసులోనే ముడతలు రావడాన్ని నివారిస్తుంది. ఇలా వారానికొకసారి చేస్తుంటే ఫలితం ఉంటుంది.
క్రమం తప్పకుండా ఫేషియల్ చేసుకుంటే ముడతలను, వార్ధక్య లక్షణాలను అదుపు చేయవచ్చు. అరకప్పు చెరకు రసంలో ఒక టేబుల్ స్పూన్ పసుపు కలిపి ముఖానికి పట్టించుకుని ఆరిన తర్వాత కడిగితే చర్మం బిగుతుగా మారుతుంది, ముడతలు పడదు. ఇలా వారానికొకసారి చేయాలి. రాత్రి పడుకునే ముందు ఆముదంతోకాని, కొబ్బరి నూనెతో కాని అరగంటసేపు మర్దన చేసుకుంటే ముడతలు దరిచేరవు. రెండు టేబుల్ స్పూన్ల ఆలివ్ ఆయిల్‌లో ఒక స్పూన్ తేనె కలిపి ముఖానికి పట్టించుకుని అరగంట తరువాత శుభ్రపరచుకోవాలి. పొడి చర్మానికి ఈ ప్యాక్ చాలా మంచి ఫలితాన్నిస్తుంది.