ఇంత  చిన్న  పాపకు  డయాబెటిసా?  | Family health counseling 11-03-2019 | Sakshi
Sakshi News home page

ఇంత  చిన్న  పాపకు  డయాబెటిసా? 

Published Mon, Mar 11 2019 12:24 AM | Last Updated on Mon, Mar 11 2019 12:24 AM

Family health counseling 11-03-2019 - Sakshi

మా పాపకు ఆరేళ్లు. ఎప్పుడూ దాహం అంటూ ఉంటే తరచూ నీళ్లు తాగించేవాళ్లం. చర్మంపై ర్యాష్‌ వచ్చింది. మా డాక్టర్‌ గారికి ఎందుకో అనుమానం వచ్చి షుగర్‌ టెస్ట్‌ చేయించారు. పాపకు డయాబెటిస్‌ అని చెప్పారు. ఇంత చిన్నపిల్లల్లోనూ డయాబెటిస్‌ వస్తుందా? దయచేసి మాకు తగిన సలహా ఇవ్వండి.  – డి. పావని, కాకినాడ 
మీ పాప కండిషన్‌ను జ్యూవెనైల్‌ డయాబెటీస్‌ అంటారు. దీన్నే టైప్‌ ఒన్‌ డయాబెటిస్‌ అని కూడా అంటారు. ఇది నెలల పిల్లలకూ రావచ్చు. డయాబెటిస్‌ రావడానికి అనేక కారణాలు ఉండొచ్చు. వాటిలో జన్యుపరంగా సంక్రమించడం ఒక కారణం. ఒకసారి డయాబెటిస్‌ వచ్చిందంటే జీవితాంతం ఉంటుంది. అంతవూత్రాన ఆందోళనపడాల్సిందేమీ లేదు. వీళ్లలో చక్కెర నియంత్రణ చేస్తూ ఉంటే మిగతా అందరు సాధారణమైన పిల్లల్లాగానే వీళ్లూ పెరిగి తవు ప్రతిభాపాటవాలు చూపుతారు. ఇలాంటి పిల్లల్లో మందుల ద్వారా, ఆహారం ద్వారా డయాబెటిస్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవచ్చు. పిల్లల్లోనే ఇలా డయాబెటిస్‌ రావడానికి జన్యుపరమైన కారణాలతో పాటు... కొన్ని రసాయనాలు, వైరల్‌ ఇన్‌ఫెక్షన్లు కారణం అవతాయి. ఇలాంటి పిల్లలకి ఇన్సులిన్‌ వాడటం తప్పనిసరి. 

ఈ పిల్లల చేత క్రమం తప్పకుండా ఎక్సర్‌సైజ్‌లు చేయించడం, ఆహారంలో నియమాలు పాటించేలా చేయడం కూడా అవసరం. డయాబెటిస్‌ ఉన్న పిల్లల విషయంలో తల్లిదండ్రులు కొన్ని విషయాలు నేర్చుకొని, కొన్ని జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరి. వీళ్లలో బ్లడ్‌ షుగర్‌ లెవల్స్‌ చెక్‌ చేయడం వంటివి తల్లిదండ్రులు నేర్చుకోవాలి. డయాబెటిక్స్‌ ఉన్న పిల్లలయితే వాళ్లలో సాధారణంగా బరువ# పెరగకపోవడం, విపరీతంగా దాహం వేస్తుండటం, తరచూ వాంతులు కావడం, డీ–హైడ్రేషన్, చర్మంపై ర్యాషెస్‌ వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఇలాంటి పిల్లల్లో చక్కెర నియంత్రణ లేకపోతే పోనుపోనూ రక్తపోటు పెరగడం, వుూత్రపిండాల సమస్యలు. కంటికి సంబంధించిన రుగ్మతలు, కరోనరీ గుండె సవుస్యలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి  అవేవీ రాకుండా జాగ్రత్తపడాలి. భవిష్యత్తులో ఇన్సులిన్‌ను ఇంజెక్షన్‌ ద్వారా కాకుండా నోటి ద్వారా లేదా ఇన్‌హెలేషన్‌ (పీల్చడం) ద్వారా ఇచ్చే ప్రక్రియలు అందుబాటులోకి రాబోతున్నాయి. పాంక్రియాటిక్‌ సెల్స్‌ (ఇన్సులిన్‌ తయారు చేసే కణాల) మార్పిడి శస్త్రచికిత్స కూడా పరిశోధన దశలో ఉంది. అలాంటి చికిత్స వూర్గాలు అందుబాటులోకి వస్తే ఈ పిల్లలకు చికిత్స ప్రక్రియలు వురింత సులువవతాయి. మీరు పీడియాట్రీషియన్‌ పర్యవేక్షణలో చికిత్స తీసుకోవడం తప్పనిసరి.

పాపకు  నత్తి వస్తోంది... తగ్గుతుందా?
మా పాప వయసు ఎనిమిదేళ్లు. బాగా చదువుతుంది. అయితే ఇప్పటికీ నాలుక తిరగదు. కొంచెం నత్తిగా మాట్లాడుతుంది. డాక్టర్‌ను కలిస్తే అంతా మామూలు అయిపోతుంది. మాటలు బాగా వస్తాయి, కాకపోతే కాస్త ఆలస్యంగా వస్తాయి అన్నారు. అయితే మా పాప కంటే చిన్నవాళ్లు చాలా చక్కగా మాట్లాడుతున్నారు. మా పాప మామూలుగా మాట్లాడగలుగుతుందా? మాకు తగిన సలహా ఇవ్వండి. 
– ఆర్‌. అంజలి, కొత్తగూడెం 

ఉచ్చారణ విషయంలో మీ పాపకు ఉన్న సమస్యను స్టామరింగ్‌ లేదా స్టట్టరింగ్‌ అంటారు. ఈ కండిషన్‌ ఉన్న పిల్లలు ఒక పదాన్ని ఉచ్చరించే ముందు అదేమాటను పదే పదే పలుకుతూ ఉండటం, లేదా గబుక్కున అనలేక దాన్ని పొడిగించడం, ఒక్కోసారి మాట ఆగిపోవడం కూడా జరగవచ్చు. మన జనాభాలో దాదాపు ఒక శాతం మందికి ఈ సమస్య ఉంటుంది. ఇది అమ్మాయిల్లో కంటే అబ్బాయిల్లో ఎక్కువ. ఈ సమస్యకు నిర్దిష్టంగా ఇదే కారణం అని చెప్పలేకపోయినా... జన్యుపరమైన, న్యూరోఫిజియలాజికల్‌ మార్పుల వల్ల ఒక్కోసారి ఈ సమస్య రావచ్చు. ఇలాంటి పిల్లల్లో కొందరికి వినికిడి సమస్య కూడా ఉండవచ్చు. కాబట్టి పై సమస్యలు ఉన్నాయా లేదా అని పరీక్షించడం చాలా ముఖ్యం. పిల్లల మానసిక స్థితిని సరిగ్గా అర్థం చేసుకోకుండా వారిని ఇతరులతో పోల్చిచూడటం, బాగా రాణించాలని కోరుతూ ఒత్తిడి పెంచడం వంటి కారణాలతో స్టామరింగ్‌ ఇంకా ఎక్కువ కావచ్చు. 

మాటలు నేర్చుకునే వయసు పిల్లల్లో స్టామరింగ్‌ అన్నది చాలా సాధారణంగా కనిపించే సమస్య. అయితే వాళ్లలో వయసు పెరుగుతున్నకొద్దీ సమస్య తగ్గుతూ ఉంటుంది. పిల్లల్లో ఒకవేళ స్టామరింగ్‌ ఉంటే... ఐదేళ్లు వచ్చేనాటికి 65 శాతం మంది పిల్లల్లో, యుక్తవయసు వచ్చేదానికి ముందర (అర్లీ టీన్స్‌లో) 75 శాతం మందిలో ఈ సమస్య తగ్గిపోతుంది.  ఇలాంటి పిల్లల్లో వాళ్లు చెప్పేది పూర్తిగా వినడం మన బాధ్యత. వాళ్లను తొందరపెట్టడం వల్ల ప్రయోజనం ఉండదు. వాళ్లు చెప్పదలచుకున్నది పూర్తిగా చెప్పేలా ప్రోత్సహించడం అవసరం. ఇలాంటి పిల్లలకు నిర్దిష్టంగా ఒకే ప్రక్రియతో సమస్య మటుమాయం అయ్యేలా చేయడం జరగదు. కొన్ని మందులు వాడుకలో ఉన్నా వాటి వల్ల అంతగా ప్రయోజనం లేదు. స్పీచ్‌ ఫ్లుయెన్సీ, స్టామరింగ్‌ మాడిఫికేషన్‌ వంటి స్పీచ్‌థెరపీ ప్రక్రియల ద్వారా మీ పాపకు చాలామటుకు నయమవుతుంది. మీరు మొదట స్పీచ్‌ థెరపిస్ట్‌ని కలిసి తగు చికిత్స తీసుకోండి.

పాపకు  ఒంటి మీద మచ్చలు...  తగ్గేదెలా? 
మా పాపకు 13 ఏళ్లు. ఏడాది కిందటినుంచి ఒంటిమీద, ముఖం మీద చాలా మచ్చలు వస్తున్నాయి. ఈ మచ్చలు పోవడానికి ఏం చేయాలి?– ఆర్‌. మీనాక్షి, విజయవాడ 
మీ పాపకు ఉన్న కండిషన్‌ నీవస్‌ అంటారు. దీన్ని వైద్యపరిభాషలో మల్టిపుల్‌ నీవస్‌ అనీ, సాధారణ పరిభాషలో చర్మంపై రంగుమచ్చలు (కలర్‌డ్‌ స్పాట్స్‌ ఆన్‌ ద స్కిన్‌) అంటారు. ఇవి రెండు రకాలు. మొదటిది అపాయకరం కానివీ, చాలా సాధారణంగా కనిపించే మచ్చలు. రెండోది హానికరంగా మారే మెలిగ్నెంట్‌ మచ్చ.  ఒంటిపై మచ్చలు పుట్టుకతోనే రావచ్చు. మధ్యలో వచ్చే మచ్చలు  10 నుంచి 30 ఏళ్ల మధ్య రావచ్చు. నీవస్‌ చర్మానికి రంగునిచ్చే కణాల వల్ల వస్తుంది. ఇది శరీరంలో ఎక్కడైనా (అరచేతుల్లో, అరికాళ్లలో, ఆఖరుకు గోళ్లమీద కూడా) రావచ్చు. సూర్యకాంతికి ఎక్కువగా  ఎక్స్‌పోజ్‌ కావడం, కుటుంబ చరిత్రలో ఇలాంటి మచ్చలున్న సందర్భాల్లో ఇది వచ్చేందుకు అవకాశం ఎక్కువ. కొన్ని సందర్భాల్లో నీవాయిడ్‌ బేసల్‌ సెల్‌ కార్సినోమా అనే కండిషన్‌ కూడా రావచ్చు. ఇది పుట్టుకనుంచి ఉండటంతో పాటు, యుక్తవయస్సు వారిలోనూ కనిపిస్తుంది. వారికి ఈ మచ్చలతో పాటు జన్యుపరమైన అబ్‌నార్మాలిటీస్‌ చూస్తుంటాం. అలాంటి వాళ్లకు ముఖ ఆకృతి, పళ్లు, చేతులు, మెదడుకు సంబంధించిన లోపాలు కనిపిస్తాయి. మీ పాపకు ఉన్న కండిషన్‌తో పైన చెప్పినవాటికి సంబంధం లేదు. మీ పాపది హానికరం కాని సాధారణ నీవస్‌ కావచ్చు. దీనివల్ల ఎలాంటి ప్రమాదమూ ఉండదు. క్యాన్సర్‌గా మారే అవకాశం కూడా చాలా తక్కువ. అయితే... కొన్ని నీవస్‌లు క్రమంగా  క్యాన్సర్‌ లక్షణాలను సంతరించుకునే అవకాశం ఉంది. కాబట్టి ఒంటిపై మీ పాపలా మచ్చలు ఉన్నవారు రెగ్యులర్‌గా డెర్మటాలజిస్ట్‌లతో ఫాలో అప్‌లో ఉండటం మంచిది.

అది ఎలాంటి మచ్చ అయినా... ఏ, బీ, సీ, డీ అన్న నాలుగు అంశాలు గమనిస్తూ ఉండటం మంచిది. ఏ– అంటే ఎసిమెట్రీ... అంటే పుట్టుమచ్చ సౌష్టవంలో ఏదైనా మార్పు ఉందా?, బీ– అంటే బార్డర్‌... అంటే పుట్టుమచ్చ అంచుల్లో ఏదైనా మార్పు ఉందా లేక అది ఉబ్బెత్తుగా మారుతోందా?, సీ– అంటే కలర్‌... అంటే పుట్టుమచ్చ రంగులో ఏదైనా మార్పు కనిపిస్తోందా?, డీ– అంటే డయామీటర్‌... అంటే మచ్చ వ్యాసం (పరిమాణం)  పెరుగుతోందా? ఈ నాలుగు మార్పుల్లో ఏదైనా కనిపిస్తే వెంటనే డెర్మటాలజిస్ట్‌ను సంప్రదించాలి. అప్పుడు బయాప్సీ తీసి పరీక్ష చేసి అది హానికరమా కాదా అన్నది వారు నిర్ణయిస్తారు. ఇక ఇలాంటివి రాకుండా ఉండాలంటే... ఎండకు ఎక్కువగా ఎక్స్‌పోజ్‌ కావడం పూర్తిగా తగ్గించాలి. హానికారక అల్ట్రావయయొలెట్‌ కిరణాలు తాకకుండా చూసుకోవాలి. బయటకు వెళ్లేప్పుడు ఎక్కువ ఎస్‌పీఎఫ్‌ ఉన్న సన్‌ స్క్రీన్‌ లోషన్స్‌ రాసుకోవాలి. మీ పాపకు ఉన్న మచ్చల్ని అప్పుడప్పుడూ డెర్మటాలజిస్ట్‌తో పరీక్ష చేయిస్తూ ఉండటం మంచిది. ఇలాంటి నీవస్‌లు ముఖం మీద ఉండి కాస్మటిక్‌గా ఇబ్బంది కలిగిస్తుంటే... దీన్ని ఎక్సెషన్‌ థెరపీతో వాటిని తొలగించవచ్చు. 
డా. రమేశ్‌బాబు దాసరి
సీనియర్‌ పీడియాట్రీషియన్, రోహన్‌ హాస్పిటల్స్,  విజయనగర్‌ కాలనీ, హైదరాబాద్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement