చిన్న రిక్వెస్ట్‌ బాస్‌! | vinayaka chavithi special | Sakshi
Sakshi News home page

చిన్న రిక్వెస్ట్‌ బాస్‌!

Published Thu, Aug 24 2017 11:49 PM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM

చిన్న రిక్వెస్ట్‌ బాస్‌! - Sakshi

చిన్న రిక్వెస్ట్‌ బాస్‌!

మా కోరికలేవీ పెద్దవి కావు బాస్‌. చిన్న చిన్న విఘ్నాలు తొలగిస్తే చాలు.
ఫ్యామిలీ ఫ్యామిలీ నీకు ఉండ్రాళ్లు పెడుతూ తరిస్తాం.
విపత్తులు, ఉత్పాతాలు, విలయాలు... వాటి పని మీరే చూసుకుంటారు.
చికాకులు, చిర్రుబుర్రులు, చివాట్లు, చిక్కులు...
ఇవి మా ప్రాబ్లమ్స్‌. ఇవే విఘ్నాలు.
నిన్ను దేవుడూ అని పిలుస్తూ ఎక్కడో దూరంగా ఉంచాలని లేదు.


మనసుకు దగ్గరగా ఉంటావ్‌... బాగా క్లోజ్‌గా అనిపిస్తావ్‌.
ఏదైనా చెప్పేసుకోవచ్చు... అన్నంత క్లోజ్‌గా అనిపిస్తావ్‌ బాస్‌.
మా విన్నపం మన్నించండి.
కొంచెం కన్సిడర్‌ చేయండి బాస్‌.
ఇది ఓ ఫ్యామిలీకి కంబైన్డ్‌గా వచ్చిన కల.
వినాయకుణ్ణి ఏం కోరుకున్నారో సరదాగా చదవండి.

పత్రితో నీకు పూజలు చేస్తాం.
పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.
గొడుగు నీకు అమరుస్తాం.
ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు. ఉండ్రాళ్లు సమర్పిస్తాం.
ఆకలిగొన్న కడుపు
ఒక్కటీ లేకుండా చూడు.


అత్తగారు ఊరి నుంచి ఆవకాయతో దిగుతుంది. తెల్లారి లేచే సరికి కొడుకు కిచెన్‌లో కేరెట్‌ తరుగుతుంటాడు. ‘అదేమిటే అమ్మాయ్‌. అబ్బాయి చేత కూరగాయలు తరిగిస్తున్నావ్‌. రేపటి నుంచి విమ్‌ సోప్‌ చేతిలో పెట్టి అంట్ల ముందు కూర్చోబెడతావా ఏంటి? వాడు ఉద్యోగానికి వెళ్లొద్దూ?’ అంటుంది అత్తగారూ. ‘నేనూ బేవార్సుగా లేను కదా అత్తయ్యా. నేనూ జాబ్‌కు వెళ్లాలి కదా. ఇంట్లో ఆ మాత్రం సాయం చేయకపోతే పనులెలా అవుతాయ్‌’ అంటుంది కోడలు. అక్కడి నుంచి ఆ ఇంట్లో శాంతికి విఘ్నం. అలా కాకుండా అత్తగారు కిచెన్‌లో కష్టపడుతున్న కోడలిని చూసి ‘ఏరా అబ్బాయ్‌. అమ్మాయి ఒక్కత్తే ఎంత పనని చేసుకుంటుంది. కూర్చుని పేపర్‌ చదువుకోకపోతే ఆ కేరెట్‌ కాస్త కట్‌ చేసి పెట్టరాదూ’ అనంటే ఎంత బాగుంటుంది.నువ్వు స్నానానికి వెళ్లమ్మాయ్‌. ఈలోపు నేను కేరేజీ కట్టేస్తానుగా’ అంటే ఎంత బాగుంటుంది. ‘సాయంత్రం ఉరుకులు పరుగుల మీద వచ్చేయకండి. కలిసి సినిమాకెళ్లి హోటల్లో ఏదైనా తినేసి రండి. నాదేముంది ఈ పూట శనివారం. నేను ఉపవాసం. వస్తూ నాకేదైనా లైట్‌గా పట్రండి’ అంటే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ.

పిల్లలు పిడుగులు. తండ్రి ఆఫీసుకు వీరభక్తుడు. ఆదివారం పూటైనా కృష్ణకాంత్‌ పార్క్‌కు వెళ్లి కోన్‌ ఐస్‌క్రీమ్‌ తినిపించు డాడీ’ అని వాళ్ల మారాము. మా బాస్‌ కొంటె కృష్ణుడు. పెండింగ్‌ వర్క్‌ పూర్తి చేయకపోతే మెమోతో ముద్దిస్తాడు’ అని తండ్రి హైరానా. పిల్లల అలక. తండ్రి ఆగ్రహం. తల్లి పీచుపీచు. ఇక ఆ ఇంటి మనశ్శాంతికి విఘ్నం. అలా కాకుండా ఆ బాస్‌ను ఏ అండమానో చెక్కేసేలా చేస్తే ఎంత బాగుంటుంది. డాడీగారు జాంజామ్మని సాయంత్రానికే ఇల్లు చేరుకుని బైక్‌ మీద ఫ్యామిలీ మొత్తాన్ని తీసుకుని జి.వి.కె మాల్‌లో మాలామాల్‌ చేయిస్తే ఎంత బాగుంటుంది. మళ్లీ రెండు వారాల దాకా అడక్కుండా ఉండేలా ఫన్‌ జోన్‌లో ఆడించి, ఫుడ్‌ కోర్ట్‌లో తినిపించి, బిగ్‌ స్క్రీన్‌ మీద మహేశ్‌బాబు మాస్‌ మూవీ చూపించి తెస్తే ఎంత బాగుంటుంది. అలా అని ఆశీర్వదించు స్వామీ.

భర్తగారికి ఊరుకూరికే ఆకలేస్తుంటుంది. భార్యగారికి చీటికి మాటికి నిద్ర కమ్ముకొస్తోంది. షుగరా అని భర్తకు డౌటు. థైరాయిడ్డేమో అని భార్య నలుగుబాటు.శనివారం ఎర్లీమార్నింగ్‌ ల్యాబ్‌లో బ్లడ్‌ శాంపిల్స్‌ ఇచ్చినప్పటి నుంచి రిపోర్ట్సు వచ్చేంత వరకూ అనుక్షణంఆత్మశాంతికి విఘ్నం. ఆనందానికి విఘ్నం. ఆలోచనకు విఘ్నం.అలా కాకుండా అది షుగరూ కాదూ పాడూ కాదు మనిషి గుమ్మటంలా ఉన్నావ్‌ అని రిపోర్టు వస్తే? థైరాయిడ్డు లేదూ ఏమీ లేదు మనిషి దంగల్‌ లేడీలా ఉందని కౌంట్‌ తేల్చి చెప్తే?ఎంత హాయిగా ఉంటుంది. మరెంత హొయలుగా అనిపిస్తుంది. వానాకాలంలో జలుబు, ఎండాకాలంలో కాసిన్ని చెమటకాయలు, చలికాలంలో చుండ్రు తప్ప జీవితంలో ఎప్పుడూ ఏ అనారోగ్యం రాకుండా ఉంటే? అలా అని కరుణించు స్వామీ. ఈ లైఫ్‌ను హాస్పిటల్‌ మెట్లక్కనీయకుండా ఆశీర్వదించు స్వామీ.

జూబ్లీహిల్స్‌లో కలిగిన వారి కల్యాణానికి వెళ్లాం. బెంగుళూరు నుంచి వచ్చిన చిట్టిరోజాలతో కట్టిన మండపం. ఒక సెల్ఫీ. ఒక మూలగా మద్రాస్‌ అయ్యంగార్‌ వయొలిన్‌ కన్సర్ట్‌. ఒక సెల్ఫీ. ఆహూతులలో సన్నాసన్నని తమన్నా. ఒక సెల్ఫీ. బఫే దగ్గర డబుల్‌ బిరియానీతో ఒక సెల్ఫీ. ఆలూ అల్‌బత్తాతో ఒక సెల్ఫీ. ఇవన్నీ తీసుకుని ఇంటి కొచ్చి ‘ఫ్యామిలీ గ్రూప్‌’లో వాట్సప్‌ చేసి వాట్‌ యార్‌ అని పోజు కొడదామంటే వైఫై పని చేయకపోతే? దేర్‌ ఈజ్‌ నో ఇంటర్‌నెట్‌ కనెక్షన్‌ అని మెసేజ్‌ చూపిస్తుంటే? ఆ యొక్క అతిశయానికి ఆ యొక్క ప్రదర్శనానందానికి ఎంతటి విఘాతం. మరెంతటి విఘ్నం. అలా కాకుండా ఆల్వేస్‌ వైఫై పని చేసేలా ఉంటే? నట్టింట నెట్‌ కళకళలాడుతుంటే?అలా అని హండ్రెడ్‌ ఎంబిపిఎస్‌తో ఆశీర్వదించు స్వామీ.

అబ్బాయికి మీసం కర్వ్‌ తిరిగే ఏజ్‌ వచ్చింది. అమ్మాయికి ఊరికూరికే నవ్వొచ్చే ప్రాయం వచ్చింది. అబ్బాయి ఎక్కడ తిరుగుతాడో తెలియదు.అమ్మాయిని ఎవరు తనవైపు తిరిగేలా చేసుకుంటారో తెలియదు. అది కాదూ..’ అని తల్లి ఏదో చెప్పబోతుంది. నీకేం తెలియదు ఊర్కో’ అని విసురు.అది కాదురా’ అని తండ్రి ఏదో అనబోతాడు. నస ఆపు డాడీ’ అని రుసురు.ఏ వయసు ముచ్చట ఆ వయసులో ఉండాల్సి వున్నా అది హద్దు అదుపుల్లో ఆరోగ్యకరమైన అంచుల్లో లేకపోతే మరి ఆ తల్లిదండ్రులకు ఎంతటి ఘాతం. మరెంత విఘాతం.అలా కాకుండా పిల్లలు తమ మంచి చెడ్డలను తల్లిదండ్రులతో పంచుకుంటే ఎంత బాగుంటుంది. వారిని తమ జర్నీలో తోడుగా ఉంచుకుంటే మరెంత అందంగా ఉంటుంది. అలా అని ప్రతి సంతానానికీ వారి కన్నవారికీ వెలుగు పంచు స్వామీ.నలుగురి హృదయాలలో ఆనందాన్ని వెలిగించు స్వామీ.

ఒక భర్తగారికి వాటర్‌ అలెర్జీ. అతను వైన్‌ షాప్‌లో దొరికేదానినే వాటర్‌ అనుకుని పుచ్చుకుంటూ ఉంటాడు. ఒక హజ్బెండ్‌ గారికి ఇల్లంటే రోత. వారు పేకాట క్లబ్బునే తన ఆవాసం చేసుకుంటూ ఉంటారు. ఒక మొగుడు మహాశయునికి  కరెన్సీయే ఆక్సిజన్‌. దాని వేటలో ఇంటికే రారు. ఒక పురుషుడు వేళ్లతో వాట్సప్‌లో ఎవరెవరితోనో మాట్లాడటం తప్ప ఇంట్లో నోరు తెరవడు. ఒక మగ అతనికి నిలువెల్లా అనుమానం. మరో మగపురుగుకి చేయి దురుసు జాస్తి.ఏ ఇంటికైనా ఇంతకు మించిన విఘ్నం ఉంటుందా?ఆ ఇంటి ఇల్లాళ్లకు పిల్లలకు అంతకు మించిన విఘాతం ఉంటుందా?సరదాలు వ్యసనాలుగా మారని, విసుగులు ఉత్పాతాలుగా రూపాంతరం చెందని, అసంతృప్తులు ఆజ్యంగా మారి పైకప్పులను తగలబెట్టని ఇళ్లు కావాలి. దంపతులు మార్నింగ్‌ పూట కలిసి చిర్నవ్వుతో టీ సేవించే, పిల్లలు నవ్వుకుంటూ స్కూలు విషయాలు చెబుతూ ఒడిలో కూర్చునే, అమ్మానాన్నలూ తరుచూ వచ్చిపోయే లేదంటే పిల్లల దగ్గరే ఉండిపోయే, నెలకోసారైనా ఆత్మీయులు చేయి కడిగే, ఆనందానికి తప్ప దుఃఖానికి చెమర్చని కళ్లు ఉండే, ఇరుగు పొరుగులతో సామరస్యం ఉండే, చక్కని వంట కుదిరే, పండే పక్క కుదిరే, తృప్తిగా నిదుర పట్టే, నిర్మలమైన వేకువ తట్టి లేపే ఇళ్లు ఉంటే ఎంత బాగుంటుంది?అలాంటి ఇళ్లను కటాక్షించు స్వామీ.బయట జోళ్ళు, ఇంట్లో వెచ్చాలు, అవసరాలు తీర్చగల డబ్బు ఉండే ఏటీఎం కార్డులు, బాల్కనీలో పూలు పూసే కుండీలు, అవసరానికి సాయం చేసే చేతులు, దేవుని ఆశీర్వాదాలు, చెదరని దరహాసాలు... ఇవి ఉండే ఇళ్లను ప్రసాదించు స్వామీ.


పత్రితో నీకు పూజలు చేస్తాం.పచ్చగా ఉండే ఇళ్లను ఇవ్వు.గొడుగు నీకు అమరుస్తాం.ప్రకృతి గొడుగు గతి తప్పకుండా చూడు.ఉండ్రాళ్లు సమర్పిస్తాం.ఆకలిగొన్న కడుపు ఒక్కటీ లేకుండా చూడు.నిన్ను చల్లగా నిమజ్జనం చేస్తాం.సకల అసంతృప్తులను అసమానతలను అమానవీయ ఆలోచనలను ఏటిలో కలుపు.అస్తు దేవా. తథాస్తు గణేశా.
– కె
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement